ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వండి: సీతక్క
eenadu telugu news
Updated : 20/10/2021 05:38 IST

ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వండి: సీతక్క

ప్రసంగిస్తున్న సీతక్క, చిత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌

హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వాలని, నిరుపేద బిడ్డను ఆశీర్వదించి ఉప ఎన్నికలో గెలిపించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, కనుకులగిద్ద, జూపాక, బొత్తలపల్లి, చెల్పూరు, శాలపల్లి, రాజపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌తో ఆమె ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ గెలుపుకోసం ఒకసారి ఆలోచించాలన్నారు. చదువుకున్న యువకులకు ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగాలు ఇవ్వాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం అధికారంతో అణచివేస్తుందని ఆరోపించారు. కనీసం నిరుద్యోగభృతి ఇవ్వటం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే స్వేచ్ఛ, హక్కులు ఉంటాయని అనుకున్నామని, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాశాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నిరుపేదలకు తొమ్మిది రకాల వస్తువులను అందించి ఆదుకున్నామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ మాట్లాడుతూ తెరాస, భాజపాలు ఒకటే అన్నారు. ఆస్తుల పంచాయతీని ఆత్మగౌరవంగా పరిగణించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, నాయకులు గూడూరి స్వామిరెడ్డి, లక్ష్మణ్‌కుమార్‌, అన్వేష్‌రెడ్డి, సురేఖ, కొల్లూరి కిరణ్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని