దిల్లీ బాటలో ఎన్నెన్నో ముళ్లు
eenadu telugu news
Published : 17/07/2021 01:17 IST

దిల్లీ బాటలో ఎన్నెన్నో ముళ్లు

హస్తినకు పయనమయ్యే ముందు.. కొవిడ్‌ నియంత్రణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో

కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన మంత్రివర్గ సహచరులు, అధికారులు, వైద్య ప్రముఖులు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప దిల్లీబాట పట్టడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కొవిడ్‌-19 సమీక్ష సమావేశం (దృశ్య మాధ్యమం)లో పాల్గొన్నాక.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో బయలు దేరి, మధ్యాహ్నం 3:30 గంటలకు దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఆయన.. సాయంత్రం 6:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. అర్ధగంటపాటు నిర్విరామంగా చర్చలు కొనసాగించి.. రాత్రి దిల్లీలోనే బసచేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో శనివారం సమావేశమవుతారు. హోం మంత్రి అమిత్‌ షా భేటీపై ఇంకా స్పష్టత రాలేదు.

అభివృద్ధి జపం

జాతీయ స్థాయిలో చర్చించుకునే అంశాలు రాష్ట్రంలో లెక్కకు మిక్కిలి ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి సర్కారుల పేచీతో మరింత వివాదంగా మారిన మేకెదాటు జలాశయం యడియూరప్ప సర్కారుకు కీలకం. కేంద్ర, రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉండీ- ప్రాంతీయ పార్టీల కారణంగా ఆ ప్రాజెక్టును కోల్పోతే అంతకు మించి అవమానభారం ఉండదని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. సమన్వయం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు లేఖ రాసిన యడియూరప్ప చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నారు. మేకెదాటు ప్రాజెక్టును వందశాతం సాధించి తీరుతామని అప్ప ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడుకు ఏమాత్రం నష్టం వాటిల్లబోదని తెలిసినా ఆ సర్కారు పేచీ పెట్టడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి సైతం అఖిల పక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించటం కర్ణాటకకు మింగుడుపడని వ్యవహారం. ఇదే అంశంపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో యడియూరప్ప సమావేశమవుతారు. భద్ర ఎగువ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని, కృష్ణా ప్రాజెక్టు అంశం తేల్చాలని కోరనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అవసరాలకు సైనిక భూముల సేకరణ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో చర్చిస్తారు. ఆపై జీఎస్‌టీ పరిహారంతో పాటు కరోనా నియంత్రణకు ప్రత్యేక నిధులు రాబట్టుకోవటం సర్కారుకు ఎంతో కీలకం.

కుమారుల తోడు..

కేవలం అభివృద్ధి పనుల కోసమైతే ముఖ్యమంత్రి తన తనయులు బి.వై.రాఘవేంద్ర, విజయేంద్ర, మనవడు శశిధరలతో దిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆయన నాయకత్వానికి గుదిబండగా మారిన కీలకాంశం.. పాలనలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యమేనని ఆ వర్గాలు చెబుతున్నాయి. అసమ్మతి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకంగా ముఖ్యమంత్రి తనయుడు బి.వై.విజయేంద్ర, మనవడు శశిధర్‌ అక్రమాలను బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సరిగ్గా వీరిద్దరూ ముఖ్యమంత్రితో పాటు దిల్లీకి వెళ్లటం, పార్టీ పెద్దల ముందు హాజరవటం రాజకీయపరంగా ఆసక్తిగొలిపే అంశం. మంత్రివర్గంలో రెండు స్థానాల భర్తీ, తనపై ఆరోపణలు గుప్పిస్తున్న వారిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు ఈ పర్యటనలో ఓ ముగింపు లభించనుంది.

మంత్రులదీ అదే బాట

ముఖ్యమంత్రి పర్యటన తర్వాత రాష్ట్ర మంత్రుల్లో కొందరు దిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి బి.సి.పాటిల్‌ స్పందిస్తూ ఎస్‌.టి.సోమశేఖర్‌, భైరతి బసవరాజులతో పాటు మరికొందరు మంత్రులంతా దిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. మా శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై ఆయా కేంద్ర మంత్రులతో చర్చిస్తామని స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనపై రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లటం సాధారణ ప్రక్రియగా వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని