Published : 22/01/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరీక్ష రాసేందుకు వెళ్తూ బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

మరొకరికి తీవ్ర గాయాలు

ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో షేక్‌ మహ్మద్‌ అమీర్‌ సొహైల్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఆ విద్యార్థి పరీక్ష రాసేందుకు తన స్నేహితుడితో కలిసి ఉత్సాహంగా బయలుదేరారు. అంతలోనే లారీ మృత్యురూపంలో కబళించింది. ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. కల్లూరు మండలం తడకనపల్లె మలుపు సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్‌ ఇష్రాక్‌ (20) మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వడ్డెగేరికి చెందిన షేక్‌ ఇష్రాక్‌ చిన్నటేకూరు సమీపంలోని బృందావన్‌ కళాశాలలో బీటెక్‌ (సీఎస్‌ఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇతని తల్లి బంధువుల పెళ్లికి హైదరాబాద్‌ వెళ్లారు. గురువారం మధ్యాహ్నం తన మిత్రుడు షేక్‌ మహ్మద్‌ అమీర్‌సొహైల్‌ (దేవనగర్‌)తో కలిసి కళాశాలలో మొదటి సెమిస్టర్‌ పరీక్ష రాసేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. తడకనపల్లె మలుపు సమీపంలో లారీ వెనుకవైపు నుంచి వీరిని ఢీకొట్టి వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షేక్‌ ఇష్రాక్‌ అక్కడికక్కడే మృతి చెందగా షేక్‌ మహ్మద్‌ అమీర్‌సొహైల్‌ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని హైవే గస్తీ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఉల్లిందకొండ ఎస్సై శరత్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. హరియాణాకు చెందిన లారీ డ్రైవర్‌ వాహనం వదిలి పరారయ్యాడు. మృతుడి సోదరి జైబరుహీ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 షేక్‌ ఇష్రాక్‌ (పాత చిత్రం) 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని