Updated : 30/07/2021 17:54 IST

అన్ని ఊళ్లకు వస్తా: మంత్రి జగదీశ్‌రెడ్డి

ఆహార భద్రత కార్డుల పంపిణీ సందర్భంగా ఇద్దరి నడుమ వాగ్వాదం

- చౌటుప్పల్‌, న్యూస్‌టుడే


చౌటుప్పల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తుండగా అభ్యంతరం తెలుపుతున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడుతుంటే ఇష్టం లేక కొందరు అడ్డుకుంటున్నారని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రచారం కోసం నాటకాలు వేయొద్దని, చిల్లర పనులు చేయొద్దని హెచ్చరించారు. చౌటుప్పల్‌ పురపాలిక పరిధి లక్కారంలో సోమవారం నిర్వహించిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్థాన్‌నారాయణపురర, చౌటుప్పల్‌ మండలాలకు చెందిన 417 మంది లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రొటోకాల్‌ పాటించడం లేదని, ప్రతిపక్షానికి చెందిన తనను గౌరవించడం లేదన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యేను వెంటబెట్టుకుని నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ చిల్లర రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని ఊళ్లకు వస్తానన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, తెరాస కార్యకర్తలు నినాదాలు చేయటంతో పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. కార్యక్రమానికి కలెక్టర్‌ పమేలా సత్పతి అధ్యక్షత వహించగా జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్‌, పురపాలిక ఛైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఎంపీపీలు తాడూరి వెంకట్‌రెడ్డి, గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ సభ్యులు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వీరమల్ల భానుమతి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఏ విధంగా వస్తారో చూస్తా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను బయటకు పంపుతున్న పోలీసులు

ప్రొటోకాల్‌ పాటించకుండా మునుగోడు నియోజకవర్గానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ఏ విధంగా వస్తారో చూస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. లక్కారంలో విలేకరులతో సోమవారం మాట్లాడారు. హుజూరాబాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.2వేల కోట్లిచ్చారని, జిల్లాకు మంత్రి కనీసం రూ.200 కోట్లు నిధులైనా తెచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లిచ్చిన ప్రభుత్వం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ, ఇతర ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయించలేదన్నారు. డిండి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్య, చౌటుప్పల్‌ ప్రాంతంలోని కాలుష్యం, పెండింగ్‌ ప్రాజెక్టుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడినా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ మాత్రమే నియోజకవర్గాలా? మునుగోడు కాదా? వెనుకబడిన ఈ ప్రాంతానికి నిధులు ఎందుకివ్వరని ప్రశ్నించారు. జిల్లాకు నిధులు తీసుకురావటంలో విఫలమైన జగదీశ్‌రెడ్డికి మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. నిధులు తేలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లక్కారంలోని జాతీయ రహదారిపై కారగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. లింగోజీగూడెంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్‌ నాయకులు మొగుదాల రమేశ్‌, బక్క శ్రీనాథ్‌, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, వాంకుడోతు బుజ్జి, సైదులుగౌడ్‌ పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని