అదృశ్యమైన ఆడశిశువు
eenadu telugu news
Published : 02/08/2021 03:04 IST

అదృశ్యమైన ఆడశిశువు

డిండిలో సీఐ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేస్తున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రేణుకారెడ్డి

డిండి, న్యూస్‌టుడే: ఆడశిశువు అదృశ్యమైన ఘటన డిండి మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసుల వివరాల ప్రకారం.. డిండి మండలం శామలబావితండాకు చెందిన ఓ మహిళ రెండోకాన్పులో జూన్‌ 28 దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఆ మండల పరిధిలోనే తల్లిగారింటికి వెళ్లింది. నెల రోజుల అనంతరం తండాకు వచ్చింది. ఆడ శిశువు లేకపోవడంతో అనుమానం వచ్చి గ్రామస్థులు 1098కు ఫోన్‌ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయి విచారణకు వెళ్లారు. ఆడ శిశువు లేదని గుర్తించి, ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇదే తండాలో మరో దంపతులు మూడో కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టిందని, ఎవరికైనా దత్తత ఇస్తామని ఇరుగుపొరుగు వారితో చెప్పగా 1098కు ఫోన్‌ వెళ్లింది. దీంతో ఐసీడీఎస్‌ అధికారులు సదరు దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇదే దంపతులు రెండో కాన్పులో ఆడశిశువు జన్మించిందని ఆ పాపను దత్తత ఇవ్వడానికి ప్రయత్నించగా.. అప్పట్లో అధికారులు పట్టుకుని కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో వారే పోషించుకుంటున్నారు. తాజాగా ఆ తరహా ప్రయత్నాలు మొదలు పెట్టారని ఐసీడీఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. తండాలో ఇద్దరు ఆడశిశువులను తల్లిదండ్రులే పోషించుకునేలా లేదా శిశుగృహకు తరలించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రేణుకరెడ్డి డిండి సీఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని