ధాన్యం@60 వేల టన్నులు
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

ధాన్యం@60 వేల టన్నులు

ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి సేకరణ లక్ష్యం

అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద సాగు చేసిన వరి పంట

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించి జిల్లా పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సారి ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచి మార్గదర్శకాలు అందాయి. సాగు జరిగిన ఆర్‌బీకేల పరిధిలోనే రైతులకు శిక్షణ ఇచ్చి తేమశాతం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. వచ్చే వారం నుంచి రైతులకు డివిజన్‌, మండల, ఆర్‌బీకేల పరిధిలో శిక్షణ తరగతులు నిర్వహించేలా ప్రణాళిక చేశారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్‌ జె.వెంకట మురళి ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టి అమ్మకానికి సిద్ధమైన వెంటనే కొనుగోలు చేసేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

పరిస్థితులు మారేనా..

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 60 వేల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది కూడా ఇలానే నిర్ణయించినప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత మేర దిగుబడి తగ్గడం, కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం, మరికొందరు ఈ-పంట, ఈకేవైసీ వంటి సాంకేతిక కారణాలతో ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించారు. ఇంకొందరు స్థానిక అవసరాలకు కేటాయించారు. తద్వారా 19,500 టన్నుల పంట ఉత్పత్తిని మాత్రమే జిల్లా పౌరసరఫరాల సంస్థ సేకరించింది. రైతులు కేంద్రాల ద్వారా విక్రయించాలంటే ఈ-పంట నమోదుతోపాటు; ఆధార్‌, బ్యాంకు పాసు పుస్తకాల వంటి వివరాలను ఈకేవైసీ చేయించాలి. ప్రస్తుత ఖరీఫ్‌లో 27,689 మంది రైతులు వరి సాగు చేయగా, అందులో ఇప్పటివరకు 15,189 మంది ఈకేవైసీ చేయించుకున్నారు. గత ఏడాది వరి రకం-ఏ టన్ను రూ.18,880; సాధారణ రకం రూ.18,680 చొప్పున కొనుగోలు చేయగా; ఈ ఏడాది కొంత మేర పెంచారు.

రంగంలోకి మార్క్‌ఫెడ్‌

పంట ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఇప్పటివరకు రెండు, మూడు ఆర్‌బీకేలకు ఒకటి చొప్పున ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఏర్పాటుచేసేవారు. ఇక నుంచి ప్రతి ఆర్‌బీకే పరిధిలోనూ ఉంటాయి. గత ఏడాది 35 మండలాల్లోని 352 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 152 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని పౌరసరఫరాల సంస్థ ఇప్పటివరకు డీఆర్డీఏ, ఏఎంసీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, పొగాకు సహకార సమాఖ్యలకు అప్పగించగా, ఈ ఏడాది నుంచి మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగనుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రతి కేంద్రంలో తేమ శాతం కొలిచే యంత్రాలుంటాయి. ఇప్పటికే సుమారు 27 లక్షల గోనె సంచులను సిద్ధం చేశారు.

ఈకేవైసీ చేయించుకోవాలి

ధాన్యం అమ్మేందుకు ముందస్తుగా ప్రతి రైతు ఈ-పంటతోపాటు, ఆర్‌బీకేలో ఈకేవైసీ వివరాలు నమోదు చేయించుకోవాలి. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పంట చేతికి వచ్చేదాన్ని బట్టి డిసెంబర్‌ 15వ తేదీకల్లా జిల్లాలో కేంద్రాలను ప్రారంభించనున్నాం. - నారదముని, డీఎం, జిల్లా పౌరసరఫరాల సంస్థ

జిల్లాలో ఖరీఫ్‌ వరి సాగు సాధారణ విస్తీర్ణం 65,558

ఎకరాలు ఈ ఏడాది సాగు అంచనా 58,344

ఎకరాలు ఈ-పంట నమోదైంది 52,071

ఎకరాలు ఈకేవైసీ చేయించుకున్న రైతులు 15,189

చేయించుకోవాల్సిన వారు 12,500

ఈ ఏడాది వరి సాధారణ రకం టన్ను రూ.19,400

వరి రకం-ఏ టన్ను రూ.19,600


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని