ఆగని బాదుడు
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

ఆగని బాదుడు

జిల్లాలో మొత్తం ఓపెన్‌ రీచ్‌లు 24

డీసిలిటేషన్‌ పాయింట్లు 27

20 కి.మీ ఇసుకు రవాణాకు రూ.8 వేలు

● బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

ఔరంగాబాద్‌ ర్యాంపులో ఇసుక లోడింగ్‌

పెనుగొండకు చెందిన ఎం.శ్రీనివాస్‌ ఇసుక కోసం బుక్‌ చేసి 6నెలలు గడిచినా.. ఇప్పటికీ అందకపోగా ఆన్‌లైన్‌లో చెల్లించిన రూ.6415 కూడా రాలేదు. ఆ మొత్తం కోసం అధికారులకు అర్జీలు పెట్టినా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆచంటకు చెందిన రామారావు ఇసుక కోసం రావులపాలెం వెళ్లారు. నాలుగు యూనిట్లు కొనుగోలు ఖరీదు రూ.12,150. లారీ యజమాని రూ.8 వేలు ఇస్తే రవాణా చేస్తానని చెప్పారు. అక్కడి నుంచి ఆచంటకు 20 కిమీ. ఎంత ఎక్కువైనా రూ.4వేలు వరకూ తీసుకోవచ్ఛు ఇదెక్కడి రేటు అని ప్రశ్నించగా.. ఇష్టమైతే రవాణా చేస్తాం.. లేదంటే లేదన్నారు.. చేసేది లేక మొత్తం రూ.20150 చెల్లించారు.

ఈనాడు డిజిటల్‌, ఏలూరు ఇసుక సరఫరాలో ప్రభుత్వం ఎన్ని విధానాలు మార్చినా ఫలితం కనిపించటం లేదు. సరఫరా బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించినా సామాన్యుడికి ఇసుక పొందటం భారంగానే ఉంటోంది. వాహనదారులు దూరంతో ప్రమేయం లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నారు.

బకాయిల గురించి పట్టదే... ప్రైవేటు వ్యక్తులకు సరఫరా బాధ్యతలు అప్పగిస్తున్న కాలంలో బుక్‌ చేసుకున్న వేల మంది వినియోగదారులకు ఇసుక సరఫరా కాలేదు సరికదా అన్‌లైన్‌లో డీడీల రూపంలో చెల్లించిన మొత్తం కూడా తిరిగి రాలేదు. కొత్త విధానం మొదలై ఆరు నెలలు దాటినా దానిపై ఎలాంటి పురోగతి లేదు. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.2కోట్ల వరకూ చెల్లింపులు చేయాల్సి ఉంది. చాలా మంది స్పందన కార్యక్రమంలో కూడా ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేదు.

అధిక వసూళ్లు

వరదల నేపథ్యంలో జిల్లాలో దాదాపు ఓపెన్‌ రీచ్‌లన్నీ మూతపడ్డాయి. దీంతో రూ.475కి సరఫరా చేయాల్సిన ఇసుక ప్రస్తుతం పడవల ద్వారా తీసుకురావటంతో రూ.625కి విక్రయిస్తున్నారు. దీంతో అదనపు భారం పడుతున్న నేపథ్యంలో లారీ యజమానులు అధిక వసూళ్లు వినియోగదారులకు గోరుచుట్టుపై రోకటిపోటులా పరిణమిస్తున్నాయి. దూరంతో పొంతన లేకుండా లారీ యజమానులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇసుక అవసరం అయిన వారు తమ వాహనాలు వారే తెచ్చుకోవచ్ఛు క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వాహనాదారులంతా కుమ్మకై వారికి ఇష్టమొచ్చిన ధర వసూలు చేస్తున్నారు. కొత్త వాహనాలను అక్కడ రానివ్వకుండా చేస్తున్నారు.

తూకంలో మోసాలు

ఇటీవల వల్లూరుకు చెందిన ఓ వినియోగదారు కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఓ యూనిట్‌ కొనుగోలు చేశారు. 4.5 టన్నుల బరువున్నట్లు రసీదు ఇచ్చారు. అనుమానంతో మరోచోట తూకం వేయగా 4 టన్నులు మాత్రమే వచ్చింది. నిర్వాహకులను అడిగితే మాకు సంబంధం లేదు. కరుగోరుమిల్లి, దొడ్డిపట్ల, ఔరంగాబాద్‌ ఇలా చాలా డిసిలిటేషన్‌ పాయింట్లలో తూకం వేయటం లేదు. కొన్ని ర్యాంపుల్లో మాత్రం ధరకు అదనంగా క్రేన్‌ డ్రైవర్లకు నగదు ఇస్తే ఎక్కువ ఇసుక పోస్తున్నారు. ఇలా రవాణాతో పాటు తూకంలో మోసాలు ఎక్కువగా ఉన్నాయి.

పర్యవేక్షణ ఎక్కడ?

సరఫరా ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నా అధికారుల పర్యవేక్షణ ఉండాలి. రేవుల నుంచి ఎంత తెస్తున్నారు. వినియోగదారులకు ఎంత విక్రయిస్తున్నారు. బిల్లులు సక్రమంగా ఇస్తున్నారా లేదా రవాణాకు ఎంత వసూలు చేస్తున్నారు అనే అంశాలపై ఎస్‌ఈబీ పర్యవేక్షించాలి వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై విచారణ చేయాలి. నిర్దేశిత ధరకే విక్రయాలు జరిగేలా చూడాలి. ఇదంతా కాగితాలకే పరిమితం అవుతోంది. దీంతో కంపెనీ సిబ్బంది, వాహనదారులు అధిక వసూళ్లు, అక్రమ ఇసుక రవాణాతో సొమ్ము చేసుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం

రవాణాకు అధిక వసూళ్లు చేసేవారిపై దృష్టి సారిస్తాం. దీనిపై ఎస్‌ఈబీ అధికారులతో తనిఖీ చేయించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో డీడీలు తీసిన వారికి తిరిగి చెల్లించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. - బీఆర్‌ అంబేడ్కర్‌, జేసీ రెవెన్యూ

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని