close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

భోధన.. వేదన

కళాశాలల్లో పూర్తిస్థాయిలో ప్రారంభం కాని తరగతులు

అధ్యాపకులు లేక టీసీలు తీసుకుంటున్న విద్యార్థులు

అతిథి అధ్యాపకుల నియామకాలకు మళ్లీ ఆటంకం

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఒక పక్క ప్రవేశాలు ముమ్మరంగా నడుస్తుండగానే అధ్యాపకులు లేరన్న కారణంగా చేరిన విద్యార్థులు టీసీలు తీసుకొని వెళ్లిపోతున్నారు. జూన్‌ ఒకటో తేదీన విధుల్లో చేరాల్సిన అతిథి అధ్యాపకులు జులై నెలాఖరు కావస్తున్నా నియామకానికి నోచుకోకపోవడంతో కళాశాలల ప్రిన్సిపల్స్‌ సైతం నిస్సహాయస్థితిలోనే ఉండాల్సి వస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 34 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 50 మందికి పైగా అతిథి అధ్యాపకుల అవసరం ఉంది. 2015-16, 2016-17, 2017-18 వరకు కొనసాగింపు ఉత్తర్వులతో నడిచిన వీరి సేవలు 2018-19లో హఠాత్తుగా కమిషనర్‌ ఇచ్చిన ‘ఫ్రెష్‌ నోటిఫికేషన్‌’ ఆ నియామకాలను రెండు నెలలు సాగదీసింది. తిరిగి 2019-20లోనూ జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా, జేసీ, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో వీరి ఎంపికలు జరగాలని ఉత్తర్వులు ఇవ్వటంతో మళ్లీ సమస్య మొదటికొచ్చి కోర్టు వరకు వెళ్లింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పక్కన బెట్టి 2018-19లో పనిచేసిన వారినే కొనసాగించాలన్న కోర్టు తీర్పు జులై మూడో వారంలో వచ్చింది. వాటిని అమలు చేయకపోగా పున:పరిశీలన పిటిషన్‌ దాఖలు చేస్తారన్న వాదనలతో కళాశాలల్లో చేరిన విద్యార్థుల్లో కొంతమంది టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. ప్రైవేటు కళాశాలలు దీన్ని అవకాశంగా తీసుకుని తమ ఖాళీలను నింపుకొంటున్నాయి. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ నాలుగేళ్లుగా అరకొర జీతంతో పనిచేస్తూ 12 నెలల పాటు పనిచేసి 9 నెలల జీతాలే తీసుకున్నప్పటికీ తమ జీవితాలతో అధికారులు ఆటలాడుకుంటున్నారని అతిథి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తగ్గిపోతున్న పనిదినాలు..

పది నెలలు జరగాల్సిన తరగతులు నాలుగు నెలలు కూడా సమయం దొరక్కపోవడంతో అధ్యాపకులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంటర్‌ బోర్డు నిబంధనల ప్రకారం జూన్‌ మొదటి తేదీ నుంచి జనవరి చివరి వరకు తరగతులు నిర్వహించాలి. ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు, జనవరి, ఫిబ్రవరిలో ప్రిఫైనల్‌ పరీక్షలు జరగాల్సి ఉంటుంది. బోర్డు రూపొందించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను అనుసరించి 222 పనిదినాలు ఉండాలి. వీటిలో జూన్‌ 30 వరకు మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశాల కారణంగా వారి పనిదినాలు 200 కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 222గా ఇంటర్‌ బోర్డు ఒక క్యాలెండర్‌ను రూపొందించింది. జూన్‌ నుంచి మార్చి 15లోగా పూర్తయ్యే పరీక్షల మధ్యలో దసరా, సంక్రాంతి, ఆదివారం, రెండో శనివారం, ఇతర పండుగల సెలవులను మినహాయిస్తే మిగిలిన రోజుల్లో డిసెంబరు మాసాంతానికి అధ్యాపకులందరూ తమ తమ పాఠ్యాంశాల్లో సిలబస్‌ను పూర్తి చేయాలి. రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత, ఒప్పంద, అతిథి అధ్యాపకులందరూ పరీక్షలు, మూల్యాంకన విధుల కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రంలోని ఇంటర్‌ విద్యావ్యవస్థలో సంక్షోభం వల్ల జులై నెలాఖరు లేదా ఆగస్టు రెండో వారం వరకు పూర్తి స్థాయిలో బోధనలో నిమగ్నమయ్యే అవకాశం లేకుండాపోయింది.

సిలబస్‌ పూర్తి కత్తి మీద సామే..

జులై 3 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశాల నమోదు సైతం పూర్తి కాకపోవటంతో ప్రవేశాలకు తుదిగడువు ఈనెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. ఆగస్టు ఒకటి నుంచైనా మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు మొదలైతే సమయానికి సిలబస్‌ పూర్తి చేయటం, పరీక్షలు నిర్వహించటం కత్తిమీద సాములాంటిదేనని ఒక సీనియర్‌ అధ్యాపకుడు చెబుతున్నారు. ఈ ఏడాది పరీక్ష ఫలితాల గందరగోళం కారణంగా జులై మొదటివారం వరకు నడిచిన సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం ప్రభుత్వ కళాశాలల్లోని రెగ్యులర్‌, ఒప్పంద, అతిథి అధ్యాపకులు, ప్రిన్సిపల్స్‌ యావన్మందీ మూల్యాంకనంలోనే ఉండాల్సి రావడంతో కళాశాలల్లో అటు ప్రవేశాలుగానీ, బోధనగానీ పూర్తిస్థాయిలో కుంటుపడిందనే చెప్పాలి. ఏదేమైనా ఇంటర్‌ విద్యాశాఖ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రవేశాలు, బోధన, పరీక్ష ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి

కె.రవిబాబు, జిల్లా  ఇంటర్మీడియట్‌ అధికారి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటి వరకు అడ్మిషన్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఈనెలాఖరు వరకు గడువు ఉన్నందున ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గురుకులాలు, కస్తూర్బాల్లో ఇంటర్మీడియట్‌ ఏర్పాటు చేయటం వల్ల దాని ప్రభావం కొంత కళాశాలలపై పడే అవకాశం ఉంది.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు ఇలా...

* జిల్లాలో మొత్తం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు: 19

* మొదటి సంవత్సరం విద్యార్థులు జనరల్‌,  వృత్తి విద్యాకోర్సులు కలిపి(ఇప్పటి వరకు): 2,001

* ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు: 2,205

* ద్వితీయ సంవత్సరం వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులు 1,013

* ద్వితీయ సంవత్సరం మొత్తం విద్యార్థులు: 3,218

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.