close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

ఈ తీరు మారదా?

 మూత స్థితిలో 250 రేషన్‌ షాపులు
 చేతులెత్తేసిన పలువురు డీలర్లు
ఈనాడు, హైదరాబాద్‌

ఒకటి కాదు, రెండు కాదు..నగరంలో ఏకంగా 250కి పైగా చౌకధరల దుకాణాలు మూతపడ్డాయి. నిల్వల్లేవంటూ ఆయా రేషన్‌ డీలర్లు రెండ్రోజుల కిందటే చేతులెత్తేశారు. పౌరసరఫరాల శాఖాధికారులు ‘మాకేం సంబంధం లేదు’ అన్నట్లుగా చూసీ చూడనట్లు వదిలేశారు. గడువు ముగుస్తుండటంతో, సరకులు తీసుకునేందుకు వచ్చిన వేలాది పేదలు ‘నో స్టాక్‌’ బోర్డులు చూసి నివ్వెరపోతున్నారు.

12 లక్షలకు పైగా కార్డులు..
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధుల్లో 1600కు పైగా చౌకధరల దుకాణాలుంటాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 700కు పైగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న కార్డులు 12 లక్షల పైచిలుకు!  ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం, గోధుమలు తదితరాలను  ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీ ధరపై అందజేయాల్సి ఉంది. సహజంగా పదో తేదీ దాటిన తర్వాతే ఎక్కువ మంది వస్తువులు తీసుకునేందుకు ముందుకొస్తుంటారు. కానీ గడువు కంటే ముందే వందలాది చౌకధరల దుకాణాల్లో బియ్యం నిల్వలు నిండుకున్నాయి!! అప్రమత్తమైన డీలర్లు వాస్తవ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. చేసేదేం లేక డీలర్లు చౌక దుకాణాలను మూసేశారు.

ఇదేనా నిర్వహణ?
నగర పౌరసరఫరాల శాఖాధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గోదాముల నుంచి బియ్యం నేరుగా నగరంలోని మండల నిల్వ కేంద్రాలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి స్టేజ్‌-2 గుత్తేదారులు రేషన్‌ దుకాణాలకు చేరుస్తారు. ఒక్కో దుకాణం కోటా కనీసం 150 టన్నుల నుంచి 200 టన్నుల వరకు ఉంటుంది. డీలర్లు డిమాండును బట్టి బియ్యాన్ని తెప్పించుకుంటారు. తాజాగా ప్రతి నెలా 10వ తేదీలోపు మొత్తం కోటాను ‘లిఫ్ట్‌ చేయాల్సిందే’నంటూ నిబంధనను అమల్లోకి తెచ్చారు. డీలర్లు గగ్గోలు పెట్టినా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. పైగా పక్కనే మరో గదిని అద్దెకు తీసుకోవాలంటూ సూచించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగరంలో దుకాణాల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ షాపులు చిన్నవిగా ఉండటంతో, ఒకేసారి 150 నుంచి 200 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకునేందుకు అవకాశం లేదు. కొత్తగా అద్దెకు అంటే.. వ్యాపారులు మా వల్ల కాదంటున్నారు. దుకాణంలో ఎంతపడితే అంతే స్టాక్‌ తెప్పించుకున్నారు. రేషన్‌ పోర్టబులిటీ అమలవుతుండటంతో, నగరంలో నివసిస్తున్న ఇతర ప్రాంతాలకు చెందినవారు కూడా ఇక్కడే తీసుకుంటున్నారు. ఆ స్టాక్‌ను 13వ తేదీ వరకు పంపిణీ చేశారు. గతంలో మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టి దుకాణాలను మూసేశారు. పక్కనే ఉన్న దుకాణాలకు వెళ్తే అక్కడ కూడా ఇదే అనుభవం ఎదురుకావడంతో- పేదలు బిక్కచచ్చిపోతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.