close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

బాపూ మాట.. స్వచ్ఛత బాట
● మహాత్ముని ఆశయసాధనే లక్ష్యం

శ్రీకాళహస్తిలో భాజపా సంకల్పయాత్ర ●

రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ

పాదయాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితర నేతలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: స్వచ్ఛతతోనే ప్రగతి సాధ్యమని చెప్పిన మహాత్ముని మాటలను, ఆయన ఆశయాల సాధనను భాజపా లక్ష్యంగా పెట్టుకుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న ‘గాంధీజీ సంకల్పయాత్ర’ను గురువారం శ్రీకాళహస్తిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన లక్ష్మీనారాయణ తొలుత మహాత్ముని విగ్రహానికి పుష్పమాలికలు అలంకరించారు. అనంతరం మాట్లాడుతూ... ‘గాంధీజీ కలలు కన్న స్వచ్ఛభారతావని సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి. పేరు చివరన గాంధీలు పెట్టుకున్నంత మాత్రాన బాపూజీ ఆశయాలు సాధించినట్లు కాదు. స్వాత్రంత్యం సిద్ధించాక ఏళ్ల తరబడి పరిపాలన సాగించిన పార్టీలు స్వచ్ఛత దిశగా సాధించిన ప్రగతి శూన్యం. స్వచ్ఛత ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చార’న్నారు. దేశవ్యాప్తంగా శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి విధిగా ఉండాలని ప్రధాని సంకల్పిస్తే ప్రతిపక్ష పార్టీలన్నీ అవహేళన చేశాయి. ప్రత్యేక కార్యాచరణతో ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వచ్చిన మార్పుతో అవే ప్రతిపక్ష పార్టీలు ముక్కున వేలేసుకున్నాయన్నారు. ‘తాజాగా ఆరోగ్య భారతావని సాధన లక్ష్యంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు శ్రీకారం చుట్టాం. 2022లోపు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలను పూర్తి స్థాయిలో నిలిపి వేయాలన్నది ప్రధాన సంకల్పం. ఇదేదో ఒక్కరి బాధ్యత కాదు. దేశ ప్రజలందరూ ఇందుకు కంకణబద్ధులు కావాలి. ప్రపంచ దేశాల్లో హింస చెలరేగి పోతోంది. ఈ తరుణంలో మహాత్ముని ఆయుధమైన అహింస ఒక్కటే శాంతి స్థాపనకు శరణ్యం. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో స్పష్టం చేశారు. ఖాదీ వాడకం విస్తరించాలి. గాంధీ ఆశయాలు నెరవేరుస్తూ ఆయన ఆశించిన సమాజ స్థాపన లక్ష్యంగా ప్రధానితో కలసి అందరూ అడుగులు వేయాల’ని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నుంచి కాణిపాకం వరకు 150 కిలోమీటర్ల పొడవున జరిగే సంకల్పయాత్రను శంఖం పూరించి ఆయన ప్రారంభించారు. పెద్దఎత్తున వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వర్షం పడుతున్నా ఎంతో ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కోలా ఆనంద్‌, భానుప్రకాష్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు చిలకం రామచంద్రారెడ్డి, జయచంద్రనాయుడు, మధుసూదన్‌, నారాయణస్వామి నాయుడు, ఉమ తదితరులు పాల్గొన్నారు.

 

23న చిత్తూరు చేరుకోనున్న సంకల్ప పాదయాత్ర

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: భాజపా చేపట్టిన సంకల్ప పాదయాత్ర ఈనెల 23న చిత్తూరు చేరుకోనున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోళ్ల హరిప్రసాద్‌ తెలిపారు. శ్రీకాళహస్తి నుంచి ఏర్పేడు, తిరుపతి, రాయలచెరువు, కొత్తపల్లిమిట్ట, జీడీనెల్లూరు మీదుగా ఈనెల 23న చిత్తూరుకు చేరుకోనుందని వెల్లడించారు. 24న కాణిపాకం వద్ద పాదయాత్ర ముగుస్తుందని, పార్టీ శ్రేణులు యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.