close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

వేగ నియంత్రణా.. ప్రాణాంతకమా?
●స్పీడ్‌ బ్రేకర్ల వద్ద కన్పించని హెచ్చరికలు

●అశాస్త్రీయ నిర్మాణాలతో ప్రమాదాలు

పాకాల, న్యూస్‌టుడే:

గుంతగాదంకి చెక్‌ పోస్టు వద్ద మరీ ఇంత ఎత్తుగా నిర్మించిన స్పీడ్‌బ్రేకర్‌

●పాకాల మండలం కోనపురెడ్డిపల్లి సమీపంలోని స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద తిరుపతికి చెందిన మెకానిక్‌ విజయకుమార్‌ గత ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. దగ్గరకు వచ్చే వరకు స్పీడ్‌ బ్రేకర్‌ కనిపించక పోవడంతో వాహనాన్ని నియంత్రించలేకపోయాడు.

●ఆగస్టులో నేండ్రగుంట వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో స్పీడ్‌బ్రేకర్‌ వద్ద జరిగిన ప్రమాదంలో తిరుపతికి చెందిన గుత్తా అమరావతి అనే నర్సు ప్రాణాలు కోల్పోయారు. స్పీడ్‌ బేకర్‌ను గుర్తించిన బైక్‌ చోదకుడు అదే వేగంతో వచ్చి ఎక్కించాడు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న మహిళ అమాంతం ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. అంతకు కొద్దిరోజుల క్రితమే గాదంకికి చెందిన ఓ యువకుడు బైక్‌పై నుంచి పడి చనిపోయాడు.

●పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలోని వేము కళాశాల వద్ద ద్విచక్రవాహనాన్ని జీపు ఢీకొనడంతో కొన్నాళ్ల కిందట ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ సరైన సూచికలు లేక చోదకులు అయోమయంలో పడిపోతున్నారు. ఇటీవల రంగంపేట క్రాస్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని మినీ బస్సు ఢీకొనడంతో గోకుల్‌ అనే విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు.

●చంద్రగిరి మండలం కొత్తఇండ్లు గ్రామం వద్ద సెప్టెంబరు 12న కర్ణాటక బస్సు, బొలేరో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు చనిపోయారు. 10 మంది గాయపడ్డారు. తొండవాడ వద్ద ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు.

●తాజాగా చంద్రగిరి ఐతేపల్లి నడుమ రెండు చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ‘రోడ్డు నిర్మాణంలో ఉంది. నెమ్మదిగా వెళ్లండి’ అన్న బోర్డులు దారిపక్కన పాతారు. ఇది సాధారణ హెచ్చరిక. స్పీడ్‌ బ్రేకర్లకు అటూఇటూ 100 మీటర్ల దూరంలో ప్రత్యేకంగా బోర్డులంటూ లేవు. దూరప్రాంతాల నుంచి వచ్చే కొత్త డ్రైవర్లు వేగంగా వచ్చి స్పీడ్‌బ్రేకర్ల వద్ద హైరానా పడుతున్నారు. వెనుకవచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి.

వాహనాల దూకుడును నియంత్రించి ప్రమాదాలను అరికట్టేందుకు ఏర్పాటు చేస్తున్న వేగనిరోధకాలు ప్రమాదాలకు కారణమై ప్రాణాలు తీస్తున్నాయి. పూతలపట్టు- నాయుడుపేట రహదారి విస్తరణలో భాగంగా పూతలపట్టు నుంచి పాకాల, చంద్రగిరి మండలాల పరిధిలో 50 కి.మీ దూరంలో సుమారు 20 చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు నిర్మించారు. వీటి నిర్మాణంలో నిబంధనలకు నీళ్లొదిలేశారు. తాజాగా హైవే నిర్మాణ పనుల కారణంగా దాదాపు 15 చోట్ల డైవర్షన్లు ఇచ్చారు. వీటికి అర కిలోమీటర్‌ ముందు నుంచే సరైన రీతిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే.. దూర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైవర్లు అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. గతంలోనూ ఈ మార్గంలో వేసిన స్పీడ్‌ బ్రేకర్ల వద్ద సూచిక బోర్డులు రోడ్డుపక్కన చెట్ల పొదల్లో ఉండి కన్పించడం లేదు. ఈ మార్గంలో తాజాగా కొన్ని ప్రమాదాలను పరిశీలిస్తే స్పీడ్‌ బ్రేకర్లు, స్టాపర్‌, బారికేడ్లు డ్రైవర్లను అయోమయానికి గురి చేస్తున్నట్లు అర్థమవుతోంది. బెంగళూరు-విజయవాడ మధ్య తిరిగే ట్రావెల్స్‌ బస్సులు, భారీ కంటైనర్లు రాత్రివేళ బారికేడ్లను ఢీకొట్టుకుంటూ వెళ్తున్నాయి. నేలకొరిగిన ఆ బోర్డులు తర్వాత వచ్చే వాహనదారులను ప్రమాదంలోకి నెడుతున్నాయి.

నిబంధనల మేరకు స్పీడ్‌ బ్రేకర్‌ నమూనా

నిర్మాణం.. అశాస్త్రీయం

నిబంధనల మేరకు స్పీడ్‌ బ్రేకర్‌ను 3.7 మీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల ఎత్తుతో ఏటవాలుగా నిర్మించాలి. దాని ఉపరితలభాగం గుండ్రంగా ఉండాలి. ఇక్కడ వాహన వేగం 25 కి.మీ తగ్గి.. తిరిగి పుంజుకునేందుకు వీలుంటుంది. తారురోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్‌ 10-30 డిగ్రీల కోణంలో వాలుగా ఉంటే వాహనాల టైర్లకు, అందులోని ప్రయాణికులకు కుదుపు అన్పించదు. కాని చాలాచోట్ల చిన్నపాటి గోడమాదిరిగా 50-70 డిగ్రీల వాలుతో నిర్మించారు. పైగా ఎక్కడా జీబ్రా లైన్స్‌, తెల్ల గీతలు, రేడియం స్టిక్కర్స్‌ వేయలేదు.

●రెండు వరుసల మార్గంలో ఒకవైపు మాత్రమే స్పీడ్‌బ్రేకర్‌ నిర్మించి.. మరోవైపు వదిలేశారు. స్పీడ్‌బ్రేకర్‌ను తప్పించేందుకు డ్రైవర్లు నున్నగా ఉన్న వైపునుంచి వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.