close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

స్వచ్ఛ నాగాపూర్‌

పల్లెకు స్వశక్తి కరణ్‌ పురస్కారం

శతశాతం శౌచాలయాల నిర్మాణం

న్యూస్‌టుడే, కమ్మర్‌పల్లి

పురస్కారం అందుకున్న సర్పంచి సాయమ్మ

మారుమూల గ్రామమైన ‘స్వచ్ఛభారత్‌’ను స్ఫూర్తిగా తీసుకున్నారు ఆ గ్రామస్థులు. పల్లెల పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వ తపనను అర్థం చేసుకున్నారు. వందశాతం శౌచాలయాలు, ఇంకుడు గుంతల నిర్మాణంతో పల్లెలో స్వచ్ఛత, నీటి సంరక్షణ అవశ్యకతను చాటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంతో ప్రగతికి బాటలు వేసుకున్నారు. కేంద్ర మంత్రిత్వశాఖ పంచాయతీరాజ్‌ బృందం చేపట్టిన సర్వేలో ఆదర్శంగా నిలిచి కేంద్ర స్వశక్తి కరణ్‌ పురస్కారానికి ఎన్నికయ్యారు. ఆ గ్రామమే కమ్మర్‌పల్లి మండలంలోని నాగాపూర్‌.

స్వచ్ఛతను చాటారు

గ్రామంలో 291 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 1143. వీరిలో స్త్రీలు 576, పురుషులు 567 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ను ప్రారంభించినప్పుడు గ్రామంలో చాలా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. అప్పటి సర్పంచి గుగులోత్‌ శంకర్‌, ఎంపీటీసీ సభ్యుడు అంగరి రాజేశ్వర్‌, గ్రామకమిటీ అధ్యక్షుడు నర్సాగౌడ్‌ కలిసి మహిళా సంఘాల సహకారంతో ఇంటింటికీ శౌచాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. గ్రామస్థులు సైతం సహకరించారు. అందరూ వాటా ధనం చెల్లించడంతో సకాలంలో ఇంటింటికీ శౌచాలయాన్ని నిర్మించుకోవడంతో స్వచ్ఛత పల్లెగా ఎంపికైంది. అంతేకాక ఇంటింటికీ ఉపాధి హామీలో ఇంకుడు గుంతలు నిర్మించుకొని నీటి సంరక్షణకు బాటలు వేసుకున్నారు.

ఇతర అంశాలు

* పల్లెలో 26 సమాఖ్య సంఘాల్లో 260 మంది మహిళలు ఉండగా పొదుపు, బ్యాంకు రుణాలు, రికవరీలో వందశాతం సాధించారు.

* ఉపాధిహామీలో 210 జాబ్‌కార్డులు ఉండగా 98 శాతం మంది కూలీలు పనికొస్తారు.

* గ్రామంలో వివిధ శాఖలకు చెందిన 130 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.

* ఈ- పంచాయతీలో అన్ని ధ్రువీకరణ పత్రాల అందజేతలో ముందంజలో ఉన్నారు.

శ్రమకు ఫలితం

ఈ ఏడాది ఫిబ్రవరి 5న శైలేష్‌కుమార్‌, పుష్పేందశర్మ ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించిన కేంద్ర మంత్రిత్వశాఖ, పంచాయతీరాజ్‌ బృందంపై అంశాలన్నింటినీ పరిశీలించింది. నాగాపూర్‌ను సాధారణ విభాగంలో స్వశక్తి కరణ్‌ పురస్కారానికి ఎంపిక చేశారు. సర్పంచి పాలెపు సాయమ్మ, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్‌ కలిసి దిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా బుధవారం కేంద్ర ప్రభుత్వ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుతో పాటు రూ. ఎనిమిది లక్షల నగదు ప్రోత్సాహకాన్ని నెల రోజుల్లో అందిస్తారు.

పన్నుల చెల్లింపులో ఆదర్శం

1981లో పంచాయతీగా ఏర్పడింది. 2006-07లో వంద శాతం పన్నుల వసూలుతో తొలిసారి ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. అసలే చిన్న గ్రామం. వచ్చే కేంద్ర రాష్ట్ర నిధులు తక్కువగా ఉంటాయని గ్రామస్థులే పంచాయతీకి సహకరించి స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సైతం గ్రామస్థులంతా రూ. 2.62 లక్షలు చెల్లించడంతో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. స్వశక్తి కరణ్‌ బృందాన్ని ఆకర్షించింది.

 

 

గ్రామంలో నిర్మించిన శౌచాలయం

ప్రజల భాగస్వామ్యంతో సాధ్యం

- సాయమ్మ, సర్పంచి

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం పురస్కారానికి ఎంపికైంది. మండల, జిల్లాస్థాయి అధికారుల సహకారంతో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో వందశాతం శౌచాలయాల నిర్మాణం సాధ్యమైంది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం.

ఆదర్శంగా తీసుకోవాలి

- సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో, కమ్మర్‌పల్లి

రాష్ట్రస్థాయిలో నాగాపూర్‌కు స్వశక్తి కరణ్‌ పురస్కారం రావడం ఆనందంగా ఉంది.గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు బాగా పని చేయడంతో సాధ్యమైంది. జిల్లా అధికారుల సహకారం మరువలేనిది. ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలి.

ఊర చెరువు కబ్జాను వెలికితీసి కందకం తవ్విన గ్రామస్థులు

చెరువు కోసం ఏకమయ్యారు

ఊర చెరువు 2015లో రాష్ట్ర ప్రభుత్వ పథకమైన మిషన్‌ కాకతీయకు ఎంపికైంది. రూ.21 లక్షలు మంజూరు కావడంతో చెరువును పునరుద్ధరించాలని నిర్ణయించారు. 108 ఎకరాల విస్తీర్ణంలోని సరిహద్దులను నిర్ణయించాలని, కబ్జాలు ఉంటే గ్రామస్థులంతా వెలికితీతకు సహకరించాలని ఏకగ్రీవంగా సంకల్పించారు. కొలతల్లో భాగంగా కబ్జాకు గురైన ఎనిమిది ఎకరాల చెరువు శిఖం భూమిని కలిసికట్టుగా వెలికితీసి చుట్టూ కందకం తవ్వారు. జిల్లాలో ఏ గ్రామానికి సాధ్యపడని ఘనతను సాధించి తమ ఐక్యతను చాటారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.