close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

కానరాని సన్నద్ధత.. ఏదీ నిబద్ధత

మరో 100 రోజుల్లో పది పరీక్షలు

రెండేళ్లుగా 29వ ర్యాంకుకే పరిమితం

ప్రత్యేక ప్రణాళిక జాడే లేని వైనం

పాల్వంచ సాంస్కృతికం, కొత్తగూడెం విద్యా విభాగం, న్యూస్‌టుడే

ప్రత్యేక తరగతిలో విద్యార్థులు

విద్యాశాఖ పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయినా జిల్లా విద్యా శాఖాధికారుల్లో చలనం కనిపించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా ఎన్నికల హడావుడి, విద్యాశాఖలో అధికారులకు స్థానచలనాలు.. వెరసి ‘పది’ విద్యార్థుల సన్నద్ధతపై ప్రభావం పడుతోంది. గత రెండేళ్లుగా వార్షిక ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రస్థాయిలో కింది వరుసన రెండు, మూడో స్థానాలకే పరిమితమవుతోంది. పరీక్షలకు ముందు గతంలోనే కొంతమేర కసరత్తు కనిపించినా ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు శాఖాపరమైన కార్యాచరణను రూపొందించే వారే కరవయ్యారు. ప్రణాళిక లేమి స్పష్టంగా కనిపిస్తోంది. పొరుగు జిల్లాల్లో పది పరీక్షల సన్నద్ధతపై ఇప్పటికే సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక ప్రణాళికలతో వారు ముందుకు వెళ్తున్నారు. కానీ భద్రాద్రి జిల్లాలో మాత్రం అలాంటిదేమీ కనిపించకపోవడంతో తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. అసలు తరగతులు సక్రమంగా జరగుతున్నాయా? సిలబస్‌ పూర్తి చేశారా? పరీక్షల సన్నద్ధత విషయంలో ఏం జరుగుతోంది? అని వారు ప్రశ్నిస్తున్నారు. గతేడాది గణితం, ఆంగ్లం, విజ్ఞానశాస్త్రంలో ఎక్కువ మంది విద్యార్థులు వెనుకబడ్డారు. విద్యాశాఖ ఆదేశాల ప్రకారం డిసెంబరు నాటికి సిలబస్‌ పూర్తి కావాలి. మొన్న దసరా సెలవులు పొడిగించడంతో సిలబస్‌ పూర్తయ్యిందా? అనే సందేహం తలెత్తుతోంది. పరీక్షలకు ఇంకా సుమారు 100 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇకనైనా దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా శాఖాధికారులను కోరుతున్నారు.

సమీక్షలేవీ? : వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యమని విద్యాశాఖ అధికారులు ప్రకటించడం, ఫలితాలు విడులయ్యాక డీలా పడిపోవడం పరిపాటిగా మారింది. పదో తరగతి ఎఫ్‌ఏ-1 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షల వరకు జిల్లా విద్యాశాధికారులు సమీక్ష సమావేశాల్ని నిర్వహించాలి. విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో గుర్తించి, వారికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులచే దిశానిర్దేశం చేయించాలి. ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఎలా సన్నద్ధం కావాలో జిల్లా పాలనాధికారి, ఇతర అధికారుల సలహాలు తీసుకోవాలి. కానీ జిల్లాలో ఎలాంటి సమీక్ష సమావేశం జరగకపోవడం, ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేసే పరిస్థితి నేటికీ లేకపోవడం గమనార్హం. దీంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పిల్లలకు అల్పాహారం అందించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

ఇప్పుడెంతో కీలకం..: విద్యార్థి దశలో కీలకమైన పది పరీక్షలు వంద రోజుల్లోనే ప్రారంభకానున్నాయి. వచ్చే ఏడాది మార్చి 19 నుంచి పరీక్షలు మొదలవుతాయి. రెగ్యులర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 1తో పరీక్షలు ముగియనుండగా, స్పెషల్‌ లాంగ్వేజీ, వొకేషనల్‌ సబ్జెక్టు విద్యార్థులకు ఏప్రిల్‌ 6న పరీక్షలు పూర్తిచేస్తామంటూ ‘స్టేట్‌ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్‌’ ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఇదీ గతం: గడచిన రెండు సంవత్సరాల్లోనూ రాష్ట్రంలో జిల్లా పది ఫలితాల్లో 29వ ర్యాంకుకే పరిమితమైంది. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో అధికసంఖ్యలో విద్యార్థులు వెనుకబడినట్లు ఫలితాలు తేల్చాయి.

‘పది’ పరీక్షలకు సమయం ముంచుకొస్తోంది. కానీ జిల్లా విద్యా శాఖలో అందుకు తగిన విధంగా సన్నద్ధతే కనిపించడం లేదు. ఈ వైనం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవరానికి గురిచేస్తోంది. విద్యార్థుల భవితకు తొలిమెట్టు పదో తరగతి. ఈ స్థాయిలో సాధించే మంచి గ్రేడ్‌(జీపీఏ)పై విద్య, ఇతర ఉపాధి అవకాశాలకు ఆధారమవుతాయి. కానీ రెండేళ్లుగా జిల్లాలో నిరుత్సాహకరమైన ఫలితాలు ఎదురవుతున్నాయి. ఆ లోటుపాట్లను సరిదిద్దుకొని ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం గమనార్హం.

ఆఖరి రెండు నెలల్లో పునశ్చరణ - పి.సరోజినీదేవి, జిల్లా విద్యాశాఖాధికారి

ప్రత్యేకంగా ప్రణాళిక అంటూ ఏమీ రూపొందించ లేదు. డిసెంబరు వరకు సిలబస్‌ పూర్తి చేసి, ఆ తర్వాత పునశ్చరణ తరగతులు నిర్వహించేలా చూస్తాం. మొన్నటి వరకు వరుస ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ప్రత్యేక సన్నద్ధ అంటూ ఏమీ లేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.