close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జల్లెడ పట్టారు ..

 ప్రమాద ఘటనపై ఉదయమే ప్రారంభమైన తనిఖీలు

ప్రత్యేక బృందాల రాకతో నగరంలో హడావుడి

అప్రమత్తమైన ఇతర హోటళ్లు, ఆసుపత్రుల యాజమాన్యాలు

ఈనాడు డిజిటల్‌, విజయవాడ

ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొలతలు తీసుకుంటున్న జిల్లా అగ్నిమాపకశాఖ

అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు

విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్‌ హోటల్‌లోని ప్రైవేటు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించాలని కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో సోమవారం ఉదయం నుంచే ఆ బృందాలన్నీ రంగంలోకి దిగాయి. రమేష్‌ ఆసుపత్రితో పాటు.. అనుబంధంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌కేర్‌ కేంద్రాలు, హోటల్‌ యాజమాని ఇల్లు, ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమైన పత్రాలు, ఆధారాలు సేకరించారు. పోలీసులు మూడు బృందాలతో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బృందాలు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు.. వీరు దర్యాప్తు చేస్తున్న ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరినీ అటువైపు అనుమతించలేదు. జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ నియమించిన కమిటీ సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది. దీనిపై కలెక్టర్‌ ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులతో మాట్లాడారు. అగ్నిప్రమాద సంఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాలని, పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని వారికి సూచించారు. డీసీపీ-2 విక్రాంత్‌ పాటిల్‌ పోలీసుల దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ అగ్నిప్రమాద నివారణకు ఉపయోగపడే పరికరాలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని తమ విచారణలో తేలిందన్నారు. దీనిలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తులో వెల్లడవుతుందని చెప్పారు. పోలీసు సాంకేతిక బృందం సేకరించిన నమూనాల ఫలితాలు వచ్చాక ప్రమాదానికి గల కారణంపై స్పష్టత వస్తుందన్నారు.
నిబంధనలు పాటించలేదు...

ఎవరైనా ఆస్పత్రి ఏర్పాటు చేస్తే ఆ భవనానికి వీఎంసీ లేదా సంబంధిత స్థానిక సంస్థ నుంచి అన్ని రకాల అనుమతులు ఉండాలి. అస్పత్రి ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం పరిశీలన నిమిత్తం డీఎంహెచ్‌ఓ, వీఎంసీ ఫైర్‌ అధికారి, సీపీడీసీఎల్‌ అధికారులతో కూడిన నోడల్‌ అధికారుల బృందానికి రిఫర్‌ చేస్తారు. ఆ బృందం ఆ భవనం వద్దకు వెళ్లి వెంటిలేషన్‌, విద్యుత్తు సరఫరా, పరికరాల నాణ్యత, అగ్నిప్రమాదం సంభవిస్తే ముందుగా గుర్తించేలా వార్డులు, గదుల్లో స్మోక్‌ డిటెక్టర్లు, మంటలను ఆర్పేందుకు అవసరమైన పరికరాలు, వాటర్‌ పైపులైన్లు, ఆటోమెటిక్‌ స్ప్రింక్లర్లు వంటివి ఏర్పాటు చేశారా లేదా అని పరిశీలించాలి. అగ్నిప్రమాదం జరిగితే.. రోగులను తక్షణమే బయటకు తరలించేందుకు వీల్‌ స్ట్రెచ్చర్లు, భవనానికి రెండు వైపుల నుంచి బయటకు వెళ్లేలా ర్యాంపులు వంటివి ఉండాలి. ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయా అధికారులు వ్యక్తిగతంగా తమ నివేదికలను జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. నగరంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేంద్రాలు ఇవేమీ పాటించలేదు.

వసతుల కల్పనలో నిమగ్నమైన హోటళ్లు, ఆసుపత్రులు

ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల పేరుతో కరోనా బాధితులను చేర్చుకుని చికిత్స అందజేస్తున్న హోటళ్లు/లాడ్జిల్లో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. వీటిల్లో కిటికీలకు అమర్చే కర్టెన్లు, ఇంటీరియర్‌ డెకరేషన్‌ కారణంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతాయి. ఒక గదిలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఇతర గదులకు మంటలు చాలా వేగంగా వ్యాపిస్తాయి. దీంతో నగరంలోని ఇతర హోటళ్లు, లాడ్జిలు, ఆసుపత్రుల నిర్వాహకులు అప్రమత్తయ్యారు. అగ్నిమాపక నిబంధనలను ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు తొలుత కేవలం రమేష్‌ ఆసుపత్రి, దాని అనుబంధంగా ఉండే వాటిపైనే దృష్టిపెట్టారు. అనంతరం కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చిన ఇతర హోటళ్లను పరిశీలించనున్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో ఆయా యాజమాన్యాలు హడావుడిగా రక్షణ చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.