close

శుక్రవారం, నవంబర్ 22, 2019

తాజా వార్తలు

పైసలిచ్చుకో.. పేరు మార్చుకో

నల్లా కనెక్షన్‌ మార్పిడి పేరిట అక్రమాలు
మల్కాజిగిరి జలమండలి డివిజన్‌లో గోల్‌మాల్‌
అధికారుల పాస్‌వర్డ్‌లూ దుర్వినియోగం
ఈనాడు, హైదరాబాద్‌

‘ఇతరుల పేరిట ఉన్న నల్లా కనెక్షన్‌ను మీ పేరున మార్పు చేయాలా? మేము అడిగినంత ఇస్తే చిటికెలో చేసేస్తాం..’ అంటూ జలమండలిలోని కొందరు క్షేత్రస్థాయి ఉద్యోగులు, పొరుగుసేవల, ఒప్పంద సిబ్బంది అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపుతున్నారు. ఉన్నతాధికారుల ఐడీ, పాస్‌వర్డ్‌లను చాకచక్యంగా తెలుసుకొని వాటిని ఈ పనులకు వాడుతున్నారు. ఒక్కో నల్లాకు రూ.5-10 వేల వరకు వసూలు చేస్తున్నారు. మల్కాజిగిరి జలమండలి డివిజన్‌లో ఈ తరహా అక్రమాలు ఎద్ద ఎత్తున జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ పనిచేసే ఓ పొరుగుసేవల ఉద్యోగి అధికారుల ఐడీ, పాస్‌వర్డ్‌తో దాదాపు 120 కనెక్షన్లను ఇలా పేర్లు మార్చినట్లు తెలుస్తోంది. ఇంకా వందల్లోనే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఇదే ఉద్యోగి వేరే డివిజన్‌లో పనిచేసిన సమయంలోనూ పెద్దఎత్తున దందాకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. తమకు సంబంధం లేకుండా పాస్‌వర్డ్‌లను దుర్వినియోగం చేయడం చూసి అధికారులు లబోదిబోమంటున్నారు. దీనిపై విజిలెన్సుకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే వారు విచారణ ప్రారంభించారు.

అనేక డివిజన్లలో..
నగరంలోని చాలా డివిజన్లలో నల్లా కనెక్షన్‌ పేరు మార్పు(చేంజ్‌ ఆఫ్‌ నేమ్‌)లో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఒకరి పేరుతో ఉన్న నల్లాలను కొందరు తమ పేరుతో మార్చుకొని ఆస్తిని కోర్టు వివాదాల్లోకి లాగుతున్న సందర్భాలున్నాయి. గతంలో సైదాబాద్‌ ప్రాంతంలో ఓ ఉద్యోగి ఇదే తరహా వ్యవహారానికి పాల్పడి అరెస్టయ్యాడు.

నిబంధనలు పట్టవు..
* సాధారణగా ఒకరి పేరుతో ఉన్న నల్లా కనెక్షన్‌ను ఇంకొకరి పేరుతో మార్చుకునే వీలుంది. ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. సదరు ఆస్తి కొన్నట్లు సేల్‌డీడ్‌, లింక్‌ డాక్యుమెంట్లు, ఈసీ పత్రం, మ్యూటేషన్‌ కాపీ, ఆ ఇంటికి సంబంధించి విద్యుత్తు, నీటి బిల్లులను దరఖాస్తుతోపాటు జలమండలి డివిజన్‌ కార్యాలయంలో సమర్పించాలి. రూ.200 ఫీజు కట్టాలి. విచారించిన తర్వాత అన్నీ సక్రమంగా ఉన్నాయని భావిస్తే...కొత్త యజమాని పేరుతో మార్చుతారు.
* కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు, అమ్మకాలు జరిగినా రిజిస్ట్రేషన్లు చేయరు. ఆ స్థలం వివాదస్పదంగా నమోదై ఉండటమే కారణం. పెద్ద మనుషుల సమక్షంలో స్టాంప్‌ పేపర్లపై రాతకోతలతో ఆస్తి బదిలీలు కానిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో పత్రాలేవి ఉండవు.. జలమండలి సిబ్బంది చేతిలో ఎంతోకొంత పెట్టి అడ్డగోలుగా మార్పించుకుంటున్నారు.
* కొన్నిసార్లు ఆస్తులను వివాదాల్లోకి లాగడానికి ఈ ఎత్తుగడ ఉపయోగిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. దాయాదులు, బంధువుల మధ్య ఉన్న ఆస్తి తగదాలను ఇలా పేరు మార్పుతో సంక్షిష్టం చేస్తున్నారు. నల్లా, విద్యుత్తు బిల్లులను చూపి ఆస్తి తమదంటూ కోర్టు నుంచి ఇంజక్షన్‌ ఉత్తర్వులు తీసుకొని ముప్పు తిప్పలు పెడుతున్నారు.
* తొలుత మల్కాజిగిరి డివిజన్‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్సు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు.చేంజ్‌ ఆఫ్‌ నేమ్‌ దరఖాస్తులపై ఆరా తీయనున్నామని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.