close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

వెలుగు జిలుగుల్లో ఉల్లంఘనులు

జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాల్లో నిబంధనలకు పాతర

రెండు భారీ ప్రమాదాలతో మేలుకున్న యంత్రాంగం

40 కేంద్రాలు సీజ్‌.. లోపాలు సవరించుకోవాలని నిర్వాహకులకు గడువు

చిన ద్వారపూడి పుంత రోడ్డులోని నిల్వ కేంద్రంలో సోమవారం బాణసంచాను

స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు

కాకినాడ, ఈనాడు: నిబంధనలు తుస్‌ మంటున్నాయి.. ధరలు మాత్రం దీపావళికి ముందు నుంచే పేలుతున్నాయి.. ఇన్నాళ్లూ యంత్రాంగం చూసీచూడనట్లు వదిలేయడంతో బాణసంచా తయారీ, వ్యాపారం మూడు పూలు.. ఆరు కాయలుగా సాగిపోయింది. జిల్లాలో 20 రోజుల వ్యవధిలోనే రెండు బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు చోటుచేసుకోవడం..ఆరుగురు మృత్యువాత పడటంతో పాటు పలువురు క్షతగాత్రులుగా మిగలడంతో ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వరుస సంఘటనలపై అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి దీనిపై చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో సామర్లకోట మండలం జి.మేడపాడు ఘటనలో సంబంధిత యాజమానిపై కేసు నమోదు చేసి బాణసంచా కేంద్రాన్ని సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీశ రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో తాజా పరిస్థితిపై సమీక్షించారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలకు ఆదేశించారు. ఈ క్రమంలో కీలక శాఖల బృందం పరిశీలనలో పెద్ద ఎత్తున అతిక్రమణలు వెలుగుచూశాయి. జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు 64 ఉండగా.. విక్రయ కేంద్రాలు 16 ఉన్నాయి. గత రెండు రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో 40 వరకు కేంద్రాలు నిబంధనలు పాటించని విషయాన్ని గుర్తించారు. ఆయా కేంద్రాలన్నింటినీ సీజ్‌ చేశారు. ‘సంబంధిత యాజమాన్యాలకు వారం రోజలు గడువు ఇచ్చాం.. ఈలోగా లోపాలు సవరించుకుని నిబంధనలకు అనుగుణంగా కేంద్రాలను మార్చుకోకపోతే లైసెన్సు కూడా రద్దుచేస్తాం’ అని జిల్లా సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీశ ‘ఈనాడు’కు తెలిపారు. .

ముంచుతున్న నిర్లక్ష్యం..

జిల్లాలో తాజాగా జరిగిన రెండు ప్రమాదాలకు మట్టి చిచ్చుబుడ్ల తయారీ కారణమని తేలింది. 60 శాతం ప్రమాదాలు ఈ చిచ్చుబుడ్ల తయారీ క్రమంలోనే జరుగుతాయని అగ్నిమాపక శాఖ హెచ్చరిస్తున్నా యాజమాన్యాలు పెడచెవిన పెట్టాయి. దీంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏటా నిబంధనల అతిక్రమణ, సంబంధిత యాజమాన్యాల నిర్లక్ష్యం ఫలితంగా ప్రమాదాలు సాధారణమైపోయాయి. ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా గత నెల 31న సామర్లకోట మండలంలోని జి.మేడపాడులో పేలుడు చోటుచేకుని ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయిదుగురు గాయపడ్డారు. ఈనెల 18న తాళ్లరేవు మండలంలోని జి.వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. నిబంధనలకు అనుగుణంగా రహదారికి, నివాస ప్రాంతాలకు కనీసం 45 మీటర్ల దూరంలో బాణసంచా తయారీ కేంద్రాలు ఉండాలి. తయారీ యూనిట్లకు, తయారు చేసిన సరకు నిల్వ ఉంచే కేంద్రానికీ అంతే దూరం పాటించాలి. అనుమతులు పొందిన కేంద్రాల్లో మినహా మరెక్కడా తయారుచేయకూడదు. బాణసంచా కేంద్రాలకు విద్యుత్తు సరఫరా ఉండకూడదు. కేంద్రాల్లో పనిచేస్తున్న వారిపైన.. అక్కడ పాటించాల్సిన పద్ధతులపైనా పరిమితులున్నాయి. నిరంతర తనిఖీలు, స్థానిక అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. పెద్దాపురం డివిజన్లో ఏడు కేంద్రాలుంటే అన్నింటినీ సీజ్‌ చేయడం గమనార్హం. తాము తనిఖీ చేసిన కేంద్రాల్లో 90 శాతం చోట్ల ఈ నిబంధనలేవీ పాటించలేదని ఓ అధికారి తెలిపారు. అధికారిక కేంద్రాలతో పాటు అనధికారిక కేంద్రాలపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు సీజన్‌ ముంచుకొచ్చిన తరుణంలో తనిఖీలు, చర్యలు సంబంధిత కేంద్రాల యాజమాన్యాలకు మింగుడు పడడంలేదు. ఆంక్షలతో అడ్డుకుంటే తాము నష్టపోతామని, సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తాము ఇప్పటి వరకు తయారు చేసిన బాణసంచా విక్రయానికి అనుమతి ఇవ్వాలని బాణసంచా తయారీదారుల ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును సోమవారం కలిసి విన్నవించడం గమనార్హం.

ధరల దరువు..

బాణసంచా విక్రయాల్లో మాయాజాలం ఏటా కొనసాగుతోంది. సంబంధిత పెట్టెపై ఉన్న ధరకు, వ్యాపారులు విక్రయించే ధరకూ కనీస పొంతన ఉండడం లేదు. భారీ మొత్తంలో ముద్రితమైన ధరలకు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నట్లు చూపుతూ రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. చేస్తున్న వ్యాపారానికి నిబంధనలకు అనుగుణంగా పన్ను చెల్లించే పరిస్థితీ ఉండేది కాదు. స్థానిక యంత్రాంగం లోపాయికారీ సహకారంతో వ్యవహారం అడ్డూఆపులేకుండా సాగిపోయేది. రూ.40 లక్షల లోపు వ్యాపారానికి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు.. పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనే నిబంధన చాలా మందికి కలిసొస్తోంది.

నిబంధనలు అత్రికమిస్తే చర్యలు

జిల్లాలో నిబంధనలు అతిక్రమించిన బాణసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవు. దీపావళికి బాణసంచా సామగ్రి అమ్మే దుకాణాల వద్ద నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆర్డీవో, తహసీల్దార్లకు ఆదేశించాం. దుకాణాల మధ్య మధ్య మూడు మీటర్ల దూరం ఎదురెదురు షాపులకు ఆరు మీటర్లు దూరం ఉండేలా అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించాం. నివాస పాంతాల్లో, అనుమతులు లేనిచోట బాణసంచా విక్రయించే దుకాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమనుతించం.

- లక్ష్మీశ, జిల్లా సంయుక్త కలెక్టర్‌

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.