close

ఆదివారం, ఆగస్టు 25, 2019

తాజా వార్తలు

వీఆర్వో బదిలీలలు

ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు

కలెక్టర్‌ సస్పెండ్‌ చేసిన వ్యక్తికి మళ్లీ పోస్టింగు

 

రెవెన్యూ శాఖలో అడ్డగోలుగా బదిలీలు నిర్వహించారు. ఈనెల 10వ తేదీన 333 మంది వీఆర్వోలను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆ తర్వాత మూడు, నాలుగు రోజులకు 137 మందికి స్థాన చలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం విధించినప్పటికీ తాజాగా శనివారం మరో 78 మంది వీఆర్వోలను ఒకచోట నుంచి మరో చోటికి బదిలీ చేశారు. ఓ వీఆర్వోను కలెక్టర్‌ సస్పెండ్‌ చేసిన నెల రోజులలోపే.. సస్పెన్షన్‌ తొలగించకముందే బదిలీ జాబితాలో ఆయనకు స్థానం కల్పించడం గమనార్హం.

- న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

జిల్లాలో కొందరు వీఆర్వోలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జనం వద్ద డబ్బులు తీసుకొని ఆన్‌లైన్‌ అడంగల్‌లో ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేసేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలోనూ పలువురు బాధితులకు అధికారులకు విన్నవిస్తున్నారు. అయినప్పటికీ కఠినచర్యలు కానరావడం లేదు. మరోవైపు కొందరు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరిగి చివరికి ఎంతో కొంత ఇచ్చుకుని వారిని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

సస్పెండ్‌ చేసినా ఉత్తర్వులు

జిల్లా కలెక్టర్‌గా జి.వీరపాండియన్‌ జూన్‌ 7న బాధ్యతలు చేపట్టారు. అదే మాసంలో ఆన్‌లైన్‌ అడంగల్‌లో మార్పులు చేర్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న బేతంచర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం వీఆర్వో ఎ.నాగమద్దిలేటి ఆగడాలను జేసీ రవి పట్టన్‌శెట్టి గుర్తించారు. ఆయన్ను సస్పెండ్‌ చేయాలంటూ కలెక్టర్‌కు సిఫారసు చేశారు. దీంతో జూన్‌ 18న సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల్లోనే.. ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తేయకముందే వీఆర్వోల బదిలీల రెండో జాబితాలో ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామానికి వీఆర్వోగా పోస్టింగు ఇవ్వడం గమనార్హం. జిల్లా రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్‌నే తప్పుదోవ పట్టిస్తుందనేందుకు ఇదే నిలువెత్తు నిదర్శనం.

మార్పులు ఇలా..

● రెండో జాబితాలో కర్నూలు మండలం మామిదాలపాడు (స్టాంటాన్‌పురం) వీఆర్వో రాజేంద్రప్రసాద్‌ను ఆయన సొంత గ్రామమైన పంచలింగాలకు బదిలీ చేయగా దీనిపై ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. చివరికి స్పందించిన రెవెన్యూ అధికారులు మూడో జాబితాలో భాగంగా ఆయన్ను దేవనకొండ మండలం కరివేముల-1 వీఆర్వోగా నియమించారు.

● ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె వీఆర్వో ఖాజాబందే నవాజ్‌ను రెండో జాబితాలో కర్నూలు మండలం రేమట గ్రామానికి బదిలీ చేశారు. ఆయన విధుల్లో చేరారు. తిరిగి డోన్‌ పట్టణానికి బదిలీ చేయడం గమనార్హం.

● కర్నూలు మండలం ఇ.తాండ్రపాడులో పనిచేస్తున్న ఉద్యోగినిని డోన్‌ మండలం కొత్తకోట వీఆర్వోగా బదిలీ చేశారు. తిరిగి ఆమెను ఇ.తాండ్రపాడు గ్రామానికే తిరిగి నియమించారు.

ముడుపులు చెల్లిస్తేనే..

బదిలీల వ్యవహారంలో పెద్దఎత్తున నగదు చేతులు మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా అధికారులు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చినా ముడుపులు చెల్లించనిదే పనులు కాలేదని పలువురు ఆరోపించారు. మరోవైపు కొందరికి కౌన్సెలింగ్‌ నిర్వహించకుండానే ఇష్టానుసారంగా బదిలీలు చేశారని పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.