close

ప్ర‌త్యేక క‌థ‌నం

అవిగవిగో బడి గంటలు!

వచ్చేసింది.. అదిగో వాకిట్లో ఆటో... వీధి చివ్వరే బస్సు...
నాలుగు చెంచాల ఉప్మా చకచకా నోట్లో కుక్కేసి...
బ్రెడ్డు ముక్కల మీద బరబరా కాస్త జామ్‌ పూసేసి,
రెండు ముక్కలు టకటకా నోట్లో, మిగిలినవి డబ్బాలో పెట్టేసి...
చెయ్యిపట్టుకుని లాక్కుంటూ.. పరుగు పరుగు..
పదపదా... ఎక్కెక్కు.. టైమైపోతోంది....

పిల్లల్ని ఇంతకన్నా ప్రశాంతంగా స్కూలుకు పంపలేమా?

అవును... మళ్లీ బడులు తెరిచే రోజు దగ్గరపడుతోంది. వారంపది రోజుల్లో బడి గంటల గణగణ మొదలవబోతోంది. పిల్లలు బడికి వెళుతున్నారంటే ఆ ఇంట్లో సూర్యోదయం కంటే ముందే మొదలవుతుంది పెద్ద రణగొణ రభస. కానీ కష్టం లేకుండా పిల్ల్లలే ఇష్టంగా ఎగురుకుంటూ స్కూలుకు వెళ్లేలా చెయ్యలేమా? అంటే కచ్చితంగా చెయ్యగలం అంటున్నారు నిపుణులు. అందుకు మనమేం చెయ్యాలి?


చెంగుచెంగున.. మళ్లీ బడికి!

కొత్త సంవత్సరం మొదలవుతోంది!!

అవును. అందరికీ ఉగాదితోనో.. జనవరి ఒకటితోనో కొత్త సంవత్సరం మొదలైతే... బడికెళ్లే పిల్లలున్న ఇళ్లలో మాత్రం కొత్త సంవత్సరం ఇప్పుడే మొదలవుతుంది. కొత్త డ్రస్సులు, కొత్త పుస్తకాలు, కొత్త బ్యాగులు, బూట్లు, లంచ్‌ బాక్సులు... కొత్త క్లాసులకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవటం.. పిల్లల్ని తయారు చేయటం.. ఇదో పెద్ద పండగ సందోహం!!

పిల్లల మనసుల నిండా ఒకటే కొత్త ఉత్సాహం. ఆ ఉత్సాహాన్ని అలాగే పట్టి ఉంచి.. మనం ఒక పద్ధతి ప్రకారం ఇప్పటి నుంచే వాళ్లను సిద్ధం చేస్తే.. పిల్లలకు స్కూలు మీద ఇష్టం కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. దీంతో చదువుల్లో పిల్లలు సగం ముందుకు వెళ్లినట్లే! దీనికోసం ఇప్పటి నుంచే పిల్లలను ‘మళ్లీ బడికి’ సమాయత్తం చెయ్యటం ఆరంభించాలి అంటున్నారు నిపుణులు. స్కూళ్లు తెరవటానికి వారంపది రోజుల ముందు నుంచే వాళ్లను మానసికంగా, శారీరకంగా ఒక పద్ధతి ప్రకారం సిద్ధం చెయ్యటం మంచిదన్నది వీరి సూచన.

మరో వారం పదిరోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బడి గంటలు మోగబోతున్నాయి. దానర్థం మనం పిల్లల్ని ‘మళ్లీ బడికి’ సిద్ధం చెయ్యటానికి ఈ వారంపది రోజులనూ అద్భుతంగా ఉపయోగించుకోవచ్చనే!

 

వారం ముందు నుంచే..

* వేకువతోనే మెలకువ: వేసవి సెలవుల్లో పిల్లలు ఇష్టం వచ్చిన టైముకు పడుకుని, ఉదయాన్నే లేటుగా లేవటానికి అలవాటు పడి ఉండొచ్చు. స్కూలు తెరిచిన తర్వాత సకాలంలో లేవకపోతే తయారవటం పెద్ద నరకంగా తయారవుతుంది, దీనివల్ల పిల్లలకు స్కూలంటే ఇష్టమే అయినా.. ‘అప్పుడే బడి ఎందుకు తెరుస్తున్నారు బాబో’, ‘మరికొంతకాలం సెలవులు ఉండే బాగుణ్ణనిపించే’ అవకాశమూ ఉంటుంది. దీన్ని నివారించాలంటే స్కూలు తెరవటానికి ఓ వారం ముందు నుంచే పిల్లలను సకాలంలో నిద్రపోవటం, ఉదయాన్నే లేవటమనే కొత్త రొటీన్‌కు అలవాటు పడేలా చెయ్యాలి. అలాగే సెలవుల్లో కాలంతో పరుగులు లేకుండా నచ్చిన సమయానికి, నచ్చినట్లు తినటానికి అలవాటు పడి ఉంటారు. అందుకని ఓ వారం ముందు నుంచే స్కూలు సమయాలకు తగ్గట్లుగా పొద్దున్నే అల్పాహారం, మధ్యాహ్నం అన్నం వంటివి టైముకు తినేలా అలవాటు చెయ్యాలి.

* అంతా కొత్తకొత్తగా..: పిల్లలు పైక్లాసుకు వెళుతున్నప్పుడు ఎంతో కొత్త ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి కొత్త స్కూలు బ్యాగులు, లంచ్‌ బాక్సుల వంటివి కొనేటప్పుడు వాళ్లను కూడా తీసుకువెళ్లి, వాటి మీద మనం ఎంత ఖర్చుపెట్టాలనుకుంటున్నామో చెప్పి, ఆ బడ్జెట్‌లో తమకు నచ్చినది ఎంచుకునే అవకాశం వారికే ఇవ్వటం మంచిది. దీనివల్ల వాళ్లు ఉత్సాహంగా తమకు నచ్చింది కొనుక్కునే వీలుంటుంది, బాధ్యతగా తమకు కావాల్సినవి ఎంచుకోవటమూ తెలిసి వస్తుంది.

* కొనేవన్నీ ఒక్కసారే:  ఏడాది మొత్తానికి అవసరమైన పెన్సిళ్లు, పెన్నులు, నోట్‌బుక్స్‌ వంటివన్నీ  ఒక్కసారే తెచ్చిపెట్టుకోవటం వల్ల సంవత్సరం మధ్యలో ఇబ్బంది ఉండదు, మన దగ్గరున్న పుస్తకాలన్నీ ఒక సైజులో, ఒకే తీరులో ఉంటాయి. అలా కాకుండా అవసరమైనప్పుడు కొందామనుకుంటే ఒకే తరహా పుస్తకాలు దొరక్కపోవచ్చు, రకరకాల సైజుల్లో, రంగుల్లో ఉండే పుస్తకాలను పిల్లలు ఇష్టపడకపోవచ్చు.

* ధ్యాస మళ్లాలి: చాలామంది పిల్లలకు వేసవి సెలవులంటే పొరుగూర్లకు వెళ్లిరావటం, ఇరుగుపొరుగుతో ఆటలు, లేదంటే రోజులో ఎక్కువ భాగం టీవీ చూడటం, వీడియో గేముల వంటి వాటితోనే గడిపేస్తుంటారు. దీంతో స్కూలు మొదలవ్వగానే ఇవన్నీ బందవ్వాలంటే ఒక్కసారిగా అసహనానికి లోనవుతుంటారు. ఆ సీరియల్లో ఏమయ్యిందో, ఆ గేమ్‌లో కొత్తగా ఏమొచ్చాయో.. ఇలా రకరకాలుగా ఆలోచనలు మొదలవుతుంటాయి. కాబట్టి స్కూలు మొదలవటానికి వారం ముందు నుంచే టీవీలు, గేములు బందు చేసి, మెల్లగా పుస్తకాలు చదవటం, రాసుకోవటం వంటి పనులవైపు మళ్లించటం మంచిది.

* అప్పుడప్పుడు ఊరింపు: మళ్లీ స్కూలు మొదలవుతుంది, కొత్త క్లాసు, కొత్త టీచర్లు, కొత్త పుస్తకాలు, కొత్త పాఠాలు... ఇలా అప్పుడప్పుడు ఊరిస్తూ పిల్లల్ని మానసికంగా మళ్లీ స్కూలుకు సిద్ధం చెయ్యటం మంచిది. దీనివల్ల అయ్యో సెలవలు అయిపోతున్నాయే, అమ్మో మళ్లీ స్కూలు తెరుస్తున్నారే.. అన్న నిరుత్సాహ ధోరణి వాళ్లలో మచ్చుకు కూడా ఉండదు.
* సిద్ధమయ్యే సమయం: పిల్లలకు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని గురించి పట్టించుకోవటానికి ఇదే సరైన సమయం. వయసు వారీగా వేయించాల్సిన టీకాలుంటే వాటిని ఇప్పుడే ఇప్పించాలి. కొన్ని టీకాలు వేసిన తర్వాత కొద్దిపాటి జ్వరం వంటివి రావటం సహజం. కాబట్టి సెలవుల్లోనే ఇలాంటివి పూర్తి చేస్తే ఇబ్బంది ఉండదు. ఇటీవలి కాలంలో పిల్లలకు దూరం వస్తువులు సరిగా కనబడని సమస్య విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల క్లాసులో బ్లాక్‌బోర్డు చూడలేకపోవటం వంటి ఇబ్బందులూ తలెత్తుతూ అద్దాలు అనివార్యమవుతున్నాయి. కాబట్టి బడులు తెరవక ముందే ఒక్కసారి పిల్లల కళ్లు పరీక్ష చేయించి, అవసరమైతే కళ్లజోడు ఇప్పించటం, ఇప్పటికే జోడు ఉంటే దాని పవర్‌ ఏదైనా మారిందేమో చూపించటం అవసరం. అలాగే పిల్లల్లో దంతాల సమస్యలు కూడా ఎక్కువే, కాబట్టి ఒక్కసారి దంతపరీక్ష కూడా చేయించటం మంచిది.
* ఆఖర్లో ఒత్తిడి: చాలా స్కూళ్లు వేసవి సెలవుల కోసమంటూ ప్రత్యేకంగా హోంవర్కు ఇస్తాయి. పిల్లలు ఆటల ధ్యాసలో పడి సెలవులు చివరికి వచ్చే వరకూ కూడా దాన్ని పట్టించుకోరు. దీంతో బడులు తెరుస్తున్నారంటేనే కంగారు, గందరగోళం మొదలవుతాయి. ఆఖరి ఐదార్రోజులైతే పూర్తిగా హోంవర్కుకే అంకితమై.. సెలవులు చేదుగా ముగుస్తాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ముందు నుంచే కొద్దికొద్దిగా చేసేసుకుంటూ ఉండటం లేదంటే కనీసం ఇప్పటి నుంచైనా దానిపై దృష్టిపెట్టటం మంచిది.

* కొత్తవాటికి చోటు: పాత పుస్తకాలు తీసేసి, వాటి స్థానంలో కొత్త పుస్తకాలను అందంగా సర్దిపెట్టటం, స్కూలు బ్యాగు, నీళ్ల సీసాల వంటి వస్తువులన్నీ పిల్లలు ఎక్కడ పెట్టుకోవాలో నిర్దేశించి, వాళ్లకు అలవాటు చెయ్యాలి. పొట్టి అయిపోయిన డ్రస్సులు తీసేసి, ఈ ఏడాది వేసుకోవాల్సిన బట్టలన్నింటినీ సర్ది ఒక పద్ధతిగా, అందుబాటులో పెట్టటం మంచిది. డ్రస్సులు, ఇంట్లో వేసుకునే బట్టల వంటివాటన్నింటికీ ఒక చోటు నిర్దేశించి, వాటిని ఒక పద్ధతిగా పెట్టుకోవటం నేర్పించాలి.

* నిన్నటి లోపాలకు వీడ్కోలు: పిల్లలతో కలిసి కూర్చుని... గత ఏడాది వాళ్లు స్కూలులో ఎదుర్కొన్న సమస్యలేమైనా ఉన్నాయేమో వివరంగా చర్చించాలి. ఒకవేళ అలాంటివి ఏవైనా బయటకొస్తే వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి.. వాటిని ఈ ఏడాది నివారించుకోవటం ఎలాగో పరిష్కారాలు అన్వేషించాలి. దీన్ని పిల్లలతో పెద్దపెద్ద శిఖరాగ్ర చర్చల్లా చెయ్యకూడదు. మాటల్లో పెట్టి విషయం తెలుసుకోవాలి. మన ప్రయత్నం వాళ్లకు భరోసానిచ్చేలా ఉండాలి.

రేపటికి పునాది

3-4 తరగతుల నుంచీ పిల్లలు ప్రతిరోజూ స్థిరంగా కూర్చుని తమంతట తాముగా క్లాసు పుస్తకాలను కనీసం ఒక గంట పాటు చదివేలా (ఇతర పుస్తకాలు ఈ గంట లెక్కలోకి రావు) అలవాటు చెయ్యాలి. దీనివల్ల వాళ్లకు స్థిరంగా కూర్చుని చదువుకోవటమనే కీలకమైన అలవాటు అబ్బుతుంది. ఈ సమయంలో అవసరమైతే తల్లిదండ్రులు సలహాలిచ్చేందుకు అందుబాటులో ఉండాలిగానీ పక్కనే కూర్చోబెట్టుకుని వాళ్లతో చదివించటమనేది ఉండకూడదు. ఇలా ఒక గంట పాటు కూర్చుని క్లాసు పుస్తకాలు చదవటమనే అలవాటు భవిష్యత్తులో పిల్లలకు గొప్ప మేలు చేస్తుంది.

బడి తర్వాతే ఏదైనా

బంధువుల ఇళ్లకు, పెళ్లిపేరంటాల వంటి వాటికి వెళ్లటంతో వేసవి సరదాసరదగా గడిచిపోతుంది. అది అవసరం కూడా. కానీ ఒకసారి స్కూలు తెరిస్తే మాత్రం పూర్తి శ్రద్ధ స్కూలు మీదే ఉండాలన్న దృక్పథాన్ని అలవరచటం అవసరం. అందుకే సాధ్యమైనంత వరకూ స్కూలు మాన్పించి పెండ్లిపేరంటాల వంటివాటికి తీసుకువెళ్లకూడదు. ఇలాచేస్తే మిగతా అన్నింటికంటే స్కూలే తనకు ముఖ్యమన్న మంచి ఆలోచన పిల్లల మనసుల్లో చిన్నతనం నుంచే నాటుకుంటుంది.

బడి తెరిచేప్పుడు

* తొలిరోజు చిత్రం: బడి తెరిచిన మొదటి రోజు చక్కగా తయారై స్కూలుకు వెళుతున్నప్పుడు పిల్లలను ఒక ఫోటో తీసి ఉత్సాహపరచొచ్చు. పిల్లలు పెద్దైన తర్వాత.. దాన్ని ఫలానా క్లాసుకు వెళ్లేటప్పుడు ఇలా ఉన్నానని మురిపెంగా చెప్పుకొంటూ.. ఎంతో ఇష్టంగా పదిలపరుచుకుంటారు కూడా!

* ఆరంభ సమస్యలు: స్కూలు మొదలైన తొలి వారాల్లో పిల్లలకు జలుబు, జ్వరాల వంటి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇవి ఒకరి నుంచి మరొకరికి తేలికగా అంటుతుంటాయి. కాబట్టి ఈ సమయంలో పిల్లలు తగినంత నిద్రపోయేలా చూడటం, వేడివేడి ఆహారం పెట్టటం వంటి చర్యలతో ఈ సమస్యలను కొంత నివారించొచ్చు.
* భలే డబ్బా: కాలంతో పరుగులు పెడుతూ హడావుడిగా బ్రెడ్డుజాము, ఉప్మా, నిమ్మ పులిహోరలతో సరిపెట్టకుండా.. ఎదిగే పిల్లలకు లంచ్‌ బాక్సుల్లో చక్కటి పోషకాహారాన్ని, వాళ్లు ఇష్టంగా తినేలా కట్టివ్వటం అవసరం. చాలామంది టైము లేక, ఓపిక లేక.. పిల్లలు తొందరగా తినరనీ, పొద్దున్నే తినటానికి ఇష్టపడరనీ.. ఇలా రకరకాలుగా ఆహారం విషయంలో ఉదాసీనంగా కాలం గడిపేస్తుంటారు. ఇది సరికాదు. లంచ్‌ బాక్సుల్లోకి పప్పు-క్యారెట్లు, బఠాణీలు, బీన్స్‌తో చేసిన కిచిడీ వంటి రంగురంగుల పదార్ధాలు పెట్టటం, ఒక పండు కూడా అలవాటు చెయ్యటం మంచిది. పిల్లలకు అవసరమైన పోషకాహారం గురించి బోలెడంత సమాచారం అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు వీటి మీద ప్రత్యేక దృష్టిపెట్టటం మంచిది.
* ముందు రాత్రే సిద్ధం: రాత్రి పడుకోబోయే ముందే రేపటికి కావాల్సినవేమిటన్నది ఆలోచించి, అవన్నీ ఒక దగ్గర పెట్టుకోవటం, సర్దుకోవటం నేర్పించాలి. రేపు వేసుకోవాల్సిన బట్టలు, తీసుకువెళ్లాల్సిన పుస్తకాలు.. ఇలా అన్నీ రాత్రే చూసుకోవాలి. ఒక పద్ధతి ప్రకారం హోంవర్కు చేసుకుని, కొంత సేపు చదువుకుని, కచ్చితంగా సమయానికి పడుకునేలా చూడటం వల్ల ఒక పద్ధతి అలవడుతుంది. దీనికోసం పిల్లలకు ఒక అలారం కొనిబెడితే మరింత ఉత్సాహంగా దాని ప్రకారం పనులు చేసుకుంటుంటారు.
* ఆ నొప్పికి అర్థం వేరు: అప్పటి వరకూ హాయిగా తిని తిరుగుతున్న పిల్లలే కొన్నిసార్లు బడి మొదలయ్యే ముందు ఉన్నట్టుండి దిగాలుగా తయారై, కడుపునొప్పి వంటి ఫిర్యాదులు మొదలెడతారు. దానర్థం బడి గురించి పిల్లల మనసుల్లో ఏదో ఆందోళన పేరుకుందనే!  ఇటువంటి సందర్భాల్లో పిల్లలతో అనునయంగా మాట్లాడి.. వారి ఆందోళనకు మూలాలేమిటో కనుక్కోవాలి. బడిలో ఎవరైనా ఏమన్నా అంటున్నారా? ఇబ్బంది పెడుతున్నారా? వంటి వివరాలన్నీ కనుక్కొని అధిగమించేందుకు అవసరమైతే టీచర్ల సహాయం తీసుకోవాలి. ఒకవేళ పిల్లలు స్కూల్లో ఒంటరితనానికి లోనవుతుంటే ఒకసారి స్కూలుకు వెళ్లి మిగతా పిల్లలతో మాట్లాడి కొద్దిగా స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి.
* బడి తర్వాత: స్కూలు నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఏం చెయ్యాలన్న ప్రణాళిక సిద్ధం చెయ్యటం అవసరం. వయసును బట్టి వాళ్లు పొరుగింటికి వెళ్లి ఆడుకోవాలా? లేక డ్రాయింగ్‌, సంగీతం, విదేశీ భాష.. ఇలా ఏదైనా క్లాసుకు వెళ్లాలా? హోంవర్కు ఎప్పుడు చేసుకోవాలి.. ఇవన్నీ ముందే ఒక టైమ్‌టేబుల్‌ వెయ్యాలి.

* తేడాగా అనిపిస్తే: ఒకవేళ కొత్త క్లాసులు, పాఠాల గురించి పిల్లలు ఏ కాస్త అయినా ఒత్తిడికి గురవుతున్నట్లు అనుమానం వస్తే.. బడి తెరిచిన మొదటి 1-2 వారాల్లోనే తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి, పిల్లలకున్న అనుమానాలు, ఆందోళనల గురించి మాట్లాడితే మంచిది. దీనివల్ల టీచర్ల నుంచి  భరోసా అందుతుంది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.