close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఈ శతాబ్దం ఆసియాదే!

పరస్పర సంధానతతో ఆసియాలో మరింత వృద్ధి
అందుకు ‘బీఆర్‌ఐ’ ప్రాజెక్టు బాటలు
అది ‘డ్రాగన్‌’ పెత్తనం పెంచేది కాదు
బహుళ ధ్రువ ప్రపంచంలో కీలకం కానున్న భారత్‌
వాణిజ్య యుద్ధం అమెరికాకే నష్టం
చైనాపై పెద్ద ప్రభావం ఉండబోదు
ప్రముఖ అంతర్జాతీయ వ్యూహకర్త పరాగ్‌ ఖన్నాతో ప్రత్యేక ముఖాముఖీ

భారత్‌, చైనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నెర్ర చేస్తున్నారు. భారత్‌ను తరచూ బెదిరిస్తున్న ఆయన చైనాతో అయితే ఏడాదిగా ఏకంగా వాణిజ్య యుద్ధమే ఆరంభించారు. దీంతో రెండు దేశాలూ పోటాపోటీగా పరస్పరం సుంకాలు విధించుకుంటున్నాయి. చైనాతో మొదలుపెట్టిన ఈ వాణిజ్య యుద్ధం వల్ల నష్టం అమెరికాకే ఎక్కువనీ, వీటి ప్రభావం చైనాపై పెద్దగా ఉండబోదని అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ వ్యూహకర్త పరాగ్‌ ఖన్నా చెబుతున్నారు. అంతేకాదు.. అమెరికాను దీటుగా ఎదుర్కొంటూ.. ప్రపంచ వాణిజ్యంలోనూ, భౌగోళిక-రాజకీయ సమీకరణాల్లోనూ ఆసియా పైచేయి సాధించే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైనా చేపట్టిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)’ ప్రాజెక్టు వల్ల ఆసియా దేశాల మధ్య అనుసంధానత పెరిగి.. వాణిజ్యపరంగా, ఆర్థికంగా అనూహ్య పురోగతితో ఇవి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరతాయని విశ్లేషిస్తున్నారు. ఆయన ‘ఈనాడు డిజిటల్‌’ ప్రతినిధి సత్యపాల్‌ మేనన్‌కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖీ...

19వ శతాబ్దంలో ఐరోపా హవా నడిచింది. 20వ శతాబ్దంలో అమెరికా పైచేయి సాధించింది. 21వ శతాబ్దం మాత్రం ఆసియాదే!


పరాగ్‌ ఖన్నా..

ప్రఖ్యాత ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’లో చదువుకున్నారు. ‘ఫ్యూచర్‌ ఈజ్‌ ఏషియన్‌’ అనే పుస్తకంతో పాటు పలు రచనలు చేశారు. చాలా దేశాలకు, సంస్థలకు అంతర్జాతీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.


చైనా తెస్తున్న ‘బీఆర్‌ఐ’ ప్రాజెక్టు.. అంతర్జాతీయంగా ఆసియా ఆధిపత్యానికి నాంది పలుకుతుందని మీ పుస్తకంలో విశ్లేషించారు, దీనికి ప్రాతిపదిక ఏమిటి?
అవును, ‘బీఆర్‌ఐ’ ఒక ఒక మైలురాయి కాబోతోంది. ఎందుకంటే ఇది ఆసియా దేశాలన్నీ కలిసి, ఒక సమిష్టి శక్తిగా సత్తా చాటేందుకు దోహదం చేసే బృహత్తర ప్రాజెక్టు. నిజానికి దశాబ్ద కాలంగా ఆసియా దేశాల మధ్య వాణిజ్య బంధాలు ముందెన్నడూ లేనంతగా బలపడుతున్నాయి. ఇప్పుడీ దేశాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కంటే తమలో తామే ఎక్కువగా వాణిజ్యాన్ని నెరపుతున్నాయి. దీనికి దారి తీసిన పరిణామాలు చాలా ఆసక్తికరం. 1990ల నుంచీ వర్ధమాన దేశాల్లో నిత్యావసరాల డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవటం (కమోడిటీస్‌ సూపర్‌సైకిల్‌).. పశ్చిమాసియాని దక్షిణ, తూర్పు ఆసియాలకు మరింత చేరువ చేసింది. ఒకవైపు సిల్క్‌ రోడ్ల పునరుద్ధరణ జరుగుతోంది. దీనికి ఇప్పుడు వాణిజ్య సరళీకరణ, ఈ ‘బీఆర్‌ఐ’ ప్రాజెక్టు కూడా తోడవుతుండటం వల్ల ఆసియా సంఘటితంగా, ఒక ప్రబల శక్తిగా ఎదిగేందుకు పునాదులు పడుతున్నాయి. నిజానికి వలస పాలన, ప్రచ్ఛన్న యుద్ధాల కారణంగా దాదాపు 500 ఏళ్ల పాటు ఆసియా తన పూర్తి సామర్థ్యాన్ని చాటలేకపోయింది. ఇప్పుడు ఆసియావాసులంతా కలసి వస్తున్నారు. చమురు, సహజవాయువు, ఖనిజాలు, ఆహారం, సాంకేతికత, కార్మిక శక్తి, వస్తుసేవలు వంటి రంగాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరుగుతోంది. ఫలితంగా ఆసియా తన సామర్థ్యాన్ని మించి పనితీరును ప్రదర్శిస్తోంది. వీరిని మరింత ఎక్కువగా సంధానించేలా బీఆర్‌ఐ ఆవిష్కృతమవుతుంది. అంతా అనుకుంటున్నట్లుగా ఇది కేవలం చైనాకే పరిమితమైనదేం కాదు. అయితే చాలావరకూ చైనా ప్రాబల్యం అనేది ఆసియాతో అనుసంధానంపైనే ఆధారపడి ఉంటుంది.

చైనా ఒక అప్రతిహత శక్తి అన్న భావన ఉన్న మాట వాస్తవమే అయినా..  సువిశాల ఆసియా వ్యవస్థలో ఏదో ఒక్క దేశమే పలుకుబడి పెంచుకోవటమనేది  ఎప్పటికీ కుదరదని అర్థమవుతుంది.

మీరు చెబుతున్నట్లు ‘ఆసియా ఆధిపత్యం’ వాస్తవ రూపం దాలిస్తే దానిలో భారత స్థానం ఎలా ఉంటుందంటారు?
ఆసియా వ్యవస్థకు భారత్‌ ఇప్పటికే ఒక మూలస్తంభంగా ఎదిగింది. గతంలోనూ భారత్‌ను పరిగణనలోకి తీసుకునేవారు కానీ ప్రముఖ స్థానం ఉండేది కాదు. బ్రెగ్జిట్‌ అనంతర ఆర్థిక వ్యూహంలో బ్రిటన్‌కు భారత్‌ చాలా కీలకం. చతుర్భుజి (క్వాడ్‌)లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలసి భారత్‌ కూడా ఒక కీలక కేంద్రంగా ఉంది. చైనా ఎదుగుదలపై ప్రతివ్యూహాలను సమన్వయం చేసేందుకు ఈ కూటమి ఒక కీలక వేదికగా ఎదిగింది. నిజానికి ప్రపంచ వేదిక మీద తన పాత్ర ఎలా ఉండాలన్న దానిపై భారత్‌కు స్పష్టత లేదు. అయినా భారత్‌కు అనుకూలంగా పరిస్థితులు రూపుదిద్దుకుంటున్నాయి. చైనాలోని సంక్లిష్ట ఆర్థిక విధానం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాల్లో చిక్కుకుపోయే పరిస్థితిని తప్పించుకోవడానికి చైనా నుంచి బయటపడే మార్గాలను అనేక కంపెనీలు అన్వేషిస్తున్నాయి. అలాగే చైనా ‘బీఆర్‌ఐ’ ప్రణాళికపైనా అనేక దేశాలకు అనుమానాలున్నాయి. ఈ నయా సిల్క్‌ రోడ్లు కేవలం చైనాకు మాత్రమే అనుసంధానమయ్యేలా కాకుండా భారత్‌కూ పాత్ర ఉండేలా నడవాలను ఏర్పరిచేలా చూడాలని భావిస్తున్నాయి. చైనా ఒక అప్రతిహత శక్తి అన్న భావన ఉన్న మాట వాస్తవమే అయినా.. అదే సమయంలో భారత్‌లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం చూస్తే.. సువిశాల ఆసియా వ్యవస్థలో ఏదో ఒక్క దేశమే పలుకుబడి పెంచుకునేలా కాకుండా ఈ ఖండానికే ప్రత్యేకమైన బహుళధ్రువ స్వభావం ఎప్పటికీ మారదని అర్థమవుతుంది. మనం భౌగోళిక-రాజకీయ పరిణామాల్లో వస్తున్న ఈ ప్రబల మార్పులను విస్మరించకుండా.. వీటిని భారత్‌కు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు కొనసాగించాలి.

చైనా చేపట్టిన బీఆర్‌ఐ వంటి ప్రాజెక్టులు కీలక మౌలిక వసతుల స్థాపనకు ప్రేరకంగానే ఉంటాయిగానీ చైనా పెత్తనం చెలాయించేందుకు కాదు.

చైనా వాణిజ్య విధానాలు, రక్షణాత్మక పద్ధతుల వల్ల ఆ దేశంతో ఇప్పటికే భారత్‌, ఇతర ఆసియా దేశాల వాణిజ్య సంబంధాలు అసమతౌల్యంగా తయారయ్యాయి కదా?
ద. కొరియా వంటి కొద్ది దేశాలకే చైనాతో మిగులు వర్తకం ఉందిగానీ చాలా దేశాలకు లోటే ఉంది. అమెరికాతో జరిగే వాణిజ్యంతో పోలిస్తే చైనాకు ఆసియాలోని దాని పొరుగు దేశాలతో వర్తకం సమతులంగానే ఉంటోంది. చైనాతో భారత్‌కు కూడా వాణిజ్య లోటే ఉంది. కాబట్టి భారత్‌ తన ఉత్పాదకతను పెంచి, చైనాకు ఎగుమతులను పెంచాలి. ‘ఆసియాన్‌’ దేశాలు కుదుర్చుకున్న ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య’ (ఆర్‌సీఈపీ) వాణిజ్య ఒప్పందం వల్ల భారత కంపెనీలు చైనాలోకి మరింతగా చొచ్చుకెళ్లే అవకాశం దొరుకుతుంది .

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావజాలం విస్తరిస్తున్నా చైనా మాత్రం కాలం చెల్లిన సొంత సిద్ధాంత కవచంలోనే కొనసాగుతోంది. ఒకవైపు ఇతర దేశాల వాణిజ్య ప్రవేశానికి ఆస్కారం ఇవ్వకుండా.. మరోవైపు వివిధ ప్రాంతాలకు రోడ్డు సంధానతలకు ప్రయత్నిస్తోంది. ఇది ద్వంద్వ వైఖరి కాదా?
సామ్రాజ్యవాద దేశాల వైఖరికి ఇది భిన్నమైనదేం కాదు. వలస రాజ్యాల్లో స్థానికంగా పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా దిగుమతులకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచడం ఇందులో ప్రధానాంశం. ఆ తర్వాత ఆ ఉత్పత్తులను వాణిజ్య భాగస్వామ్య దేశాలపై రుద్దుతారు. బీఆర్‌ఐలోనూ ఇదే కీలకాంశంగానీ.. ఇది వలసపాలన కాలం కాదు. సార్వభౌమాధికార శక్తులు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కోసం సాగే డిమాండ్లు చైనా దూకుడుకు తప్పకుండా కళ్లెం వేస్తాయి. చైనా మార్కెట్‌తో మరింత సంధానత కోసం ఐరోపా నుంచి డిమాండ్లు రావడమే ఇందుకు ఉదాహరణ.

అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుందని అంటారు?
చైనా విషయంలో ట్రంప్‌ తెంపరితనాన్ని ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. దీనివల్ల ప్రస్తుతానికి చైనా ఎగుమతులు క్షీణించినా దీర్ఘకాలంలో అమెరికాకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే అమెరికా దిగుమతులకు మెల్లగా చైనా శాశ్వత ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుంది. ఇదే సమయంలో ఆసియా మార్కెట్లలోకి ఐరోపా చొచ్చుకొచ్చి భారీగా లబ్ధి పొందనుంది.

చైనా వ్యవహారం చూస్తే వాణిజ్య అవసరాలకే కాదు, ఇతరత్రా ప్రయోజనాల కోసం కూడా ‘వారధులను నిర్మించే’ అలవాటు ఉందని అర్థమవుతుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు రహదారిని నిర్మించడమే ఇందుకు ఉదాహరణ. మరి చైనా ధోరణిలో మార్పు సాధ్యమేనా?
2017 నాటి డోక్లామ్‌ సైనిక ప్రతిష్ఠంభన భారత్‌కు, చైనాకు, ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. చైనాకు దురుసు శక్తిగా ఎంత పేరున్నా.. డోక్లామ్‌ వివాదంలో భారత్‌ ఎక్కడా వెనక్కి తగ్గకుండా దృఢంగా వ్యవహరించింది. చివరికి చైనానే దిగి రావాల్సి వచ్చింది. మనతోనే కాదు, పొరుగునున్న మరో డజను దేశాలతో కూడా చైనా జాగ్రత్తగా ఉండాలని డోక్లామ్‌ ఘటన సందేశాన్నిచ్చింది. 4 వేల ఏళ్ల ఆసియా చరిత్రలో సింహభాగం ‘బహుళ ధ్రువ’ రీతిలోనే సాగింది. భవిష్యత్‌లోనూ కచ్చితంగా అదే ఒరవడి కొనసాగుతుంది. భారత్‌, జపాన్‌, రష్యా, ఆస్ట్రేలియాలను చైనా ఆక్రమించజాలదు. చైనా చేపట్టిన బీఆర్‌ఐ వంటి ప్రాజెక్టులు కీలక మౌలిక వసతుల స్థాపనకు ప్రేరకంగానే ఉంటాయిగానీ చైనా పెత్తనం చెలాయించేందుకు కాదు. ఆసియాలోని వర్ధమాన దేశాలకు ఆధునికీకరణ, ఉద్యోగ సృష్టి, పెట్టుబడులకు బీఆర్‌ఐ ఒక కొత్త వేదికగా ఉపయోగపడుతుంది. దీంతో క్రమంగా ఆయా దేశాల్లో చైనా ప్రాబల్యం తగ్గుతుంది. సామ్రాజ్యవాద దేశాల చరిత్ర చూస్తే మనకీ పరిణామం కనిపిస్తూనే ఉంటుంది.

భాగస్వామ్య దేశాల భౌగోళిక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏర్పడిన అలీనోద్యమం (నామ్‌), బ్రిక్స్‌ వంటి మిశ్రమ కూటములతో ప్రయోజనం ఉంటుందంటారా?
మార్కెటింగ్‌ లేదా బ్రాండింగ్‌ కోసం ఏర్పడిన ఈ తరహా కూటములకు వాస్తవ ప్రపంచంలో ఎలాంటి ప్రాముఖ్యతా లేదు. దేశాలను ‘భౌగోళిక సామీప్యత’ అన్నటి కలిపి ఉంచినంతగా మరేదీ పట్టి ఉంచలేదు. కాబట్టి వాణిజ్యం, వృద్ధి వంటివాటిని పరస్పరం బలోపేతం చేసుకోవడం ద్వారా ‘బ్రిక్స్‌’ వంటి వాటి కన్నా ఆసియానే మరింత ప్రాధాన్య కూటమిగా అవతరిస్తుంది. సంబంధంలేని అర్జెంటీనా లేదా దక్షిణాఫ్రికా వంటి దేశాలతో ఆసియా మార్కెట్లను కలపకూడదు.


అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుందని అంటారు?

చైనా విషయంలో ట్రంప్‌ తెంపరితనాన్ని ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. దీనివల్ల ప్రస్తుతానికి చైనా ఎగుమతులు క్షీణించినా దీర్ఘకాలంలో అమెరికాకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే అమెరికా దిగుమతులకు మెల్లగా చైనా శాశ్వత ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుంది. ఇదే సమయంలో ఆసియా మార్కెట్లలోకి ఐరోపా చొచ్చుకొచ్చి భారీగా లబ్ధి పొందనుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.