close

ప్ర‌త్యేక క‌థ‌నం

అక్రమాలపై ఓ కన్నేసి ఉంచాం

  అత్యాధునిక సాంకేతికతతో జీఎస్టీ  మోసాలకు అడ్డుకట్ట
  రూ.766 కోట్ల పన్ను ఎగవేతపై కేసులు
  నకిలీ ఇన్‌వాయిస్‌లపై 66 కేసుల నమోదు
  ‘ఈనాడు-ఈటీవీ’తో సీజీఎస్టీ చీఫ్‌ కమిషనర్‌ వాసా శేషగిరిరావు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో పన్ను ఎగవేత, నకిలీ ఇన్‌వాయిస్‌లతో అక్రమంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వ్యవహారాల నిగ్గు తేలుస్తున్నట్లు హైదరాబాద్‌ జోన్‌ సీజీఎస్టీ చీఫ్‌ కమిషనర్‌ వాసా శేషగిరిరావు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రత్యేక విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎనలిటిక్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌(డీజీఏఆర్‌ఎం).. పన్ను రిటర్న్‌లను సమగ్రంగా విశ్లేషిస్తుందని వివరించారు. జీఎస్టీ చెల్లింపులో అక్రమాలు, అనూహ్య మార్పులు, హెచ్చుతగ్గులను డీజీఏఆర్‌ఎం విశ్లేస్తోందన్నారు. ఈ విభాగం అందిస్తున్న సమాచారం ద్వారా పన్ను ఎగవేత, నకిలీ ఇన్‌వాయిస్‌ల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

కొనుగోలుదారులకు మీ సూచన
ప్రతి కొనుగోలుదారుడు విధిగా బిల్లు తీసుకోవాలి. అందులో జీఎస్టీ వివరాలు స్పష్టంగా ఉండాలి. లేకుంటే పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు. దీనివల్ల విక్రేతల్లో జవాబుదారీతనం పెరుగుతుంది.
నకిలీ ఇన్‌వాయిస్‌లతో అక్రమంగా ఐటీసీ ఘటనలు పెరుగుతున్నాయి  హైదరాబాద్‌ జోన్‌(తెలంగాణ) పరిధిలో నకిలీ ఇన్‌వాయిస్‌లకు సంబంధించి 66 కేసులు నమోదు చేశాం. వీటిలొ రూ.330 కోట్ల మేర ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకున్నట్లు గుర్తించాం. దీనికి సంబంధించి 15 మందిని అరెస్టు చేశాం. జాతీయ స్థాయిలోని విభాగం డీజీఏఆర్‌ఎం అందిస్తున్న వివిధ ఆధారాలతో ముందుకు వెళ్తున్నాం.

జీఎస్టీ ఎగవేత కేసులెన్ని నమోదయ్యాయి
తెలంగాణలో ఇప్పటి వరకూ రూ.766 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి 295 కేసులు నమోదు చేశాం. పూర్తిగా జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేస్తే.. మరిన్ని ఎగవేతలు వెలుగులోకి వస్తాయి. నవంబరు చివరి వరకు రిటర్న్‌ల దాఖలుకు గడువు ఉంది. ఈ-వేబిల్లులు లేకుండా ఒకచోట నుంచి మరోచోటుకు సరకు రవాణా చేయకూడదు. ఇలాంటి వాటిని గుర్తిస్తున్నాం.

హైదరాబాద్‌ జోన్‌లో జీఎస్టీ రాబడి పరిస్థితి
హైదరాబాద్‌ జోన్‌లో నిర్దేశిత లక్ష్యం మేరకు జీఎస్టీ రాబడి లేకున్నా.. గతేడాది కంటే 8 శాతం వృద్ధి రేటు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్లలో రూ.9360 కోట్లు వచ్చింది.

జీఎస్టీ వసూళ్లు తగ్గడంపై మీ అభిప్రాయం
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. ఎగుమతులు, అమెరికా-చైనాల మధ్య నెలకొన్న పరిస్థితులు సహా వివిధ అంశాలు ఇందుకు కారణం. పన్ను శ్లాబ్‌లో చోటుచేసుకున్న మార్పుల ప్రభావమూ దీనిపై ఉంది. చాలా వాటిపై పన్ను 28 నుంచి 18 శాతానికి వచ్చాయి. అత్యధిక వస్తువులు 18 శాతం కంటే తక్కువ శ్లాబ్‌లోనే ఉన్నాయి. జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుకు గడువు నవంబరు చివరి వరకూ ఉంది. రిటర్న్‌లు దాఖలైతే జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయి.

యాంటీ ప్రాఫిటీరింగ్‌ అమలు ఎలా ఉంది
నిర్దేశించిన పన్ను కంటే ఎక్కువ వసూలు చేయడం లేదంటే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ద్వారా ప్రయోజనం పొంది.. దానిని కొనుగోలుదారులకు బదలాయించకపోవడం చట్ట విరుద్ధం. దీనికి సంబంధించిన ఫిర్యాదులను రాష్ట్ర స్థాయిలో స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించి జాతీయ స్థాయిలోని స్క్రూటినీ కమిటీకి నివేదిస్తుంది. ఆ కమిటీ ద్వారా జాతీయ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీకి వెళ్తాయి. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన అధికపన్నును వెనక్కి చెల్లించేలా చేయడం లేదా వినియోగదారులు సంక్షేమ నిధికి అందేలా అథారిటీ చర్యలు తీసుకుంటుంది.

సబ్‌కా విశ్వాస్‌ కార్యక్రమం ఏమిటి
ఇది కేంద్రం తీసుకువచ్చిన పన్నుల వివాద పరిష్కార పథకం. సెంట్రల్‌ ఎక్సైజ్‌, సేవా పన్నులకు సంబంధించి పాత బకాయిల వివాదాలను పరిష్కరించే విధానంలో భాగంగా పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా పన్ను చెల్లించేలా చేయడం. ఈ విధానంలో వడ్డీ, జరిమానా పూర్తిగా మాఫీ కావడంతో పాటు నేర విచారణ ఉండదు. దేశవ్యాప్తంగా ఈ రూపంలో రూ.3.75 లక్షల కోట్లు వసూలవ్వాలి. తెలంగాణలో ఇప్పటికే 374 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబరు 31 వరకు ఇది అమల్లో ఉంటుంది.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.