close

ప్ర‌త్యేక క‌థ‌నం

చందమామపై చైనాతో పోటీ!

సోవియట్‌ పతనం తర్వాత అంతరిక్షంపై అమెరికా, ఐరోపాలదే పైచేయిలా తయారైంది. అయితే చైనా ఆగమనంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ దేశాలన్నింటికీ సవాల్‌ విసురుతున్న చైనా.. రోదసిలోనూ సత్తా చాటుకునేందుకు భారీ కార్యక్రమాలకు తెరతీసింది. ముఖ్యంగా భారీ కేటాయింపులతో చంద్రుడిపై ప్రయోగాలకు పూనుకుంది. ఈ జోరు చూసి... ఇప్పుడు అమెరికా, ఐరోపా, జపాన్‌ తదితర దేశాలు కూడా మళ్లీ చందమామపైకి దృష్టి మళ్లించటం ఆరంభించాయి. పొరుగు నుంచే ఇంతపెద్ద అంతరిక్ష పోటీ ఎదురవుతుంటే.. భారత్‌ మౌనంగా ఉండగలదా? మన చంద్రయాన్‌ శ్రేణి చైనాకు పోటీ ఇవ్వగలదా? దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి?

నేక అంశాల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్న భారత్‌, చైనాల మధ్య అంతరిక్ష ప్రయోగాల విషయంలోనూ పోటీ ఆరంభమైంది. ఈ ఆసియా దిగ్గజాలు రెండూ జోరుగా గ్రహాంతర యాత్రా ప్రణాళికలతో విశ్వ వేదికపై సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఒక్క అంగారకుడిని చేరే అంశంలో తప్పించి మిగతా అంశాలన్నింటిలోనూ మనకంటే చైనానే ముందంజలో ఉందని చెప్పుకోక తప్పదు. అంతరిక్షంలోకి మానవ సహిత యాత్రలు, భూ కక్ష్యలో సొంత ప్రయోగ కేంద్రాన్ని నిర్మించటం తదితరాలతో డ్రాగన్‌ జోరుమీదుంది. ముఖ్యంగా చంద్రుడి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పరిస్థితుల్లో చంద్రయాన్‌ శ్రేణితో చైనా వేగాన్ని అందుకోవాలని భారత్‌ భావిస్తోంది. చంద్రయాన్‌-2తో జాబిల్లిపై మన రోవర్‌ను దింపే స్థాయికి చేరటం చిన్న విషయమేం కాదు. ఈ నేపథ్యంలో చంద్రుడిపై చైనా ఏ స్థాయిలో పురోగమించిందో ఓసారి చూద్దాం.

2007-2018 మధ్య జాబిల్లి వద్దకు వ్యోమనౌకలు 
అమెరికా: 6  
చైనా: 9 
రోదసిలో డ్రాగన్‌ జోరుకు ఇదే నిదర్శనం!

* చందమామను శోధించేందుకు ఆరంభించిన ‘చాంగే’ శ్రేణిలో ఇప్పటి వరకూ 4 వ్యోమనౌకలను విజయవంతంగా పంపింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి 3న పంపిన చాంగే-4 చంద్రుడి ఆవలి భాగంలోకి విజయవంతంగా దిగింది. మన భూమి మీంచి ఎప్పుడూ కనబడని ఆ ఆవలి భాగంపై ఇప్పటి వరకూ పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఆ పని చేసేందుకు చైనా ఇప్పుడు నడుం బిగిస్తోంది. అంతేకాదు.. చంద్రుడిపై ఏకంగా ఓ స్థావరాన్ని కూడా నిర్మించాలని, వచ్చే దశాబ్దానికి దీన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక ఈ ఏడాది చివర్లో పంపే చాంగే-5 ద్వారా జాబిల్లి నుంచి శిలలను భూమికి తెప్పించాలని, చాంగే-6తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాలని, చాంగే-7తో చంద్రుడి ఉపరితలాన్ని, అక్కడున్న మూలకాలను, అంతరిక్ష వాతావరణాన్ని మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలనీ యోచిస్తోంది. చాంగే-8 జాబిల్లిపై స్థావరం కోసం కసరత్తు చేస్తుంది.

కృత్రిమ చందమామ

వీధి దీపాల బెడద లేకుండా నగరాల్లో రాత్రిపూట కాంతులు నింపేందుకు ఆకాశంలో కృత్రిమ చందమామలను ఏర్పాటు చెయ్యాలని చైనా భావిస్తోంది. సూర్యకాంతిని పరావర్తనం చెందించడం ద్వారా ఇవి పనిచేస్తాయి. నిజమైన చందమామ కన్నా 8 రెట్లు ప్రకాశవంతంగా కాంతులనిస్తాయి. ఫలితంగా ఏటా 17.4 కోట్ల డాలర్ల మేర విద్యుత్‌ ఆదా అవుతుంది.

చైనాతో పోటీ.. మనకేంటి లాభం?

చైనాతో పోటీ ఎలా ఉన్నా.. చంద్రయాన్‌ వంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాలు, అంతరిక్ష పరిశోధనల వల్ల ఎంతో మేలు జరగటం తథ్యం. ఉదాహరణకు రష్యాతో పోటీ పడి చంద్రుడిపైకి చేపట్టిన మానవసహిత అపోలో యాత్రల వల్ల అమెరికా భారీగా లబ్ధి పొందింది. అక్కడి విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు సాంకేతికంగా ఎంతో పరిపుష్టమయ్యాయి. పేస్‌మేకర్‌, డయాలసిస్‌ సాధనాలు, సీటీస్కాన్‌, ఎమ్మారైలు, రేడియోగ్రఫీ వంటి అత్యాధునిక వైద్య ఉపకరణాలకు పునాదులు ఇలాగే పడ్డాయి. ఇప్పుడు చంద్రయాన్‌ యాత్రలతో భారత్‌కూ అలాంటి ప్రయోజనం ఒనగూరుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అంతంత మాత్రంగా ఉన్న దేశంలోని ఇంజినీరింగ్‌ విద్యను మెరుగుపరుస్తుందన్న చర్చ ఊపందుకుంది. చంద్రయాన్‌-2 మొత్తం దేశీయంగానే రూపొందించటం, ఇందులోని 14 పరికరాల్లో 13 మన సంస్థలే తయారుచేయటం, ముఖ్యంగా చంద్రుడి మీద దిగే రోవర్‌లోని సాఫ్ట్‌వేర్‌ను కాన్పూర్‌ ఐఐటీ అందించటం... తదితర పరిణామాలు దీనికి సంకేతం కాదూ!

జాబిల్లితో ఢీ

* మానవ నిర్మిత వస్తువు ఒకటి జాబిల్లిని ఢీ కొట్టిన మొట్టమొదటి సంఘటన 1959 సెప్టెంబర్‌ 14న జరిగింది. నాడు సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన లూనా-1 ‘పాలస్‌ పుట్రెడినిస్‌ మారే’ అనే ప్రాంతాన్ని తాకింది. 
* భూమి మీద నుంచి మనకు కనిపించని జాబిల్లి ఆవలి భాగాన్ని తొలిసారిగా సోవియట్‌కు చెందిన లూనా-3 ఫొటోలు తీసింది.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.