close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆంగ్ల విద్య.. ఏదీ శ్రద్ధ

మూడేళ్ల క్రితం 4,500 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభం 
  బడికి ఒకరిద్దరు ఉపాధ్యాయులకు శిక్షణ 
  గత ఏడాది నుంచి కొత్త పాఠశాలల్లో ప్రవేశమే లేదు 
  ఉపాధ్యాయుల బదిలీలతో మరింత అస్తవ్యస్తం

ఆంగ్ల విద్య.. ఏదీ శ్రద్ధ

సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం చదువు అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ విధానాలు, నిర్లక్ష్య ధోరణి కారణంగా అసలు ఉద్దేశం నెరవేరడం లేదు. ఉపాధ్యాయుల అంగీకారంతోనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించుకోవాలని చెప్పి.. ముందుకొచ్చిన వారికి శిక్షణ ఇచ్చిన విద్యాశాఖ.. జులైలో వారిని తెలుగు మాధ్యమ పాఠశాలలకు బదిలీలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్య ప్రవేశపెట్టాలని, స్కూళ్ల మనుగడకు ఇది తప్పనిసరని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు మొర పెట్టుకోవడంతో 2016-17 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంగ్ల బోధనకు ఉపాధ్యాయులు అంగీకరించిన చోటే విద్యాకమిటీల ఆమోదంతో ప్రారంభించుకునేలా విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఆ ఏడాది ఒకటో తరగతికి మాత్రమే ఆంగ్లం బోధించాలని.. ఏటా ఒక్కో తరగతి పెంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి 4,500 పాఠశాలల్లో శ్రీకారం చుట్టారు.

ఊరించి.. ఉసూరనిపించి 
ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామని గొప్పగా చెప్పుకున్న విద్యాశాఖ క్రమేణా తన ఆలోచన మార్చుకుంది. ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతే అయిదో తరగతి వరకూ సమస్య ఉండదని భావించింది. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో ఆరో తరగతి నుంచి పాఠాల బోధన తమవల్ల కాదంటే ఏమిటన్న ప్రశ్న విద్యాశాఖలో తలెత్తింది. అదే జరిగితే అయిదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో చదివిన వారు తర్వాత విద్య ఎక్కడ అభ్యసించాలన్నది ప్రశ్న.

ఒకవేళ టీఆర్‌టీ ద్వారా ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఉపాధ్యాయులను భర్తీ చేద్దామనుకున్నా నిరుద్యోగుల సమస్యలు వస్తాయని విద్యాశాఖ భావించింది. రాష్ట్రంలో 4,500 బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించి 2017లో ఇచ్చిన టీఆర్‌టీ ప్రకటనలో కేవలం 910 కొలువులే ఆంగ్ల మాధ్యమానికి కేటాయించడం గమనార్హం.

పదో తరగతి వరకూ కచ్చితంగా తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాలని ప్రభుత్వమే నిర్ణయించి ఈ ఏడాది నుంచీ అమలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించే అంశంపై ప్రభుత్వంలో అయోమయం నెలకొంది.

గత జులైలో ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆంగ్ల మాధ్యమం బోధిస్తామని ముందుకు వచ్చిన టీచర్లు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తెలుగు మాధ్యమం బడులకు వెళ్లారు. ఆసక్తి లేనివారు ఇతరచోట్ల నుంచి ఆంగ్ల మాధ్యమం పాఠశాలలకు వచ్చారు. ఆంగ్ల పాఠశాలలోని వారు ఆంగ్ల మాధ్యమ స్కూళ్లకు బదిలీ చేసేలా నిబంధన లేకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.

స్పష్టమైన విధానంతో రావాలి 
ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వం సమీక్షించి స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న, టీఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి కోరారు. ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు లేకపోవడం.. కొన్నిచోట్ల చేర్చుకున్నా వారికి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు అనుమతి లేకపోవడం తదితర కారణాలతో ఒకటో తరగతిలో చేరే వారు తగ్గిపోతున్నారని వారు పేర్కొన్నారు.

ఆంగ్ల విద్య.. ఏదీ శ్రద్ధ

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.