close

ప్ర‌త్యేక క‌థ‌నం

పట్టాలెక్కలేదు... పైసలు దక్కలేదు 

భూమి ఉన్నా అందని పాసుపుస్తకం 
5.43 లక్షల మంది రైతుల నిరీక్షణ 
రైతుబంధు, బీమాలు వర్తించడం లేదని ఆవేదన 
అన్నదాతల అవస్థలు

పట్టాలెక్కలేదు... పైసలు దక్కలేదు 

ఈనాడు, హైదరాబాద్‌: ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు రాకపోవడంతో రైతులు నానాయాతన అనుభవిస్తున్నారు. వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా పథకాలు అందడం లేదు. బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 72 లక్షల భూ ఖాతాలు ఉండగా 58.43 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు 53 లక్షల మందికి మాత్రమే అందాయి. వీరిలోనూ కొందరి పుస్తకాల్లో తప్పులు ఉన్నాయి. నేటికీ పుస్తకాలు రాని ఐదున్నర లక్షల మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లు.. ప్రభుత్వం సాయం చేస్తున్నా పాసుపుస్తకాలు లేక వాటిని అందుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. 
తప్పులతో తిప్పలు 
కొత్త పాసుపుస్తకాల ముద్రణ, పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న పొరపాట్లు రైతులకు తలనొప్పిగా మారాయి. భూదస్త్రాల ప్రక్షాళనలో సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌ చేసే సమయంలో భారీగా తప్పులు దొర్లాయి. దాదాపు ఇరవై లక్షల సర్వే సంఖ్యలు కనిపించకుండా పోగా, అచ్చయిన పుస్తకాల్లోనూ తప్పులు వచ్చాయి. దీంతో దాదాపు తొమ్మిది లక్షల పుస్తకాలు తిరిగి ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుస్తకంలోని రెండో పేజీలో దొర్లిన తప్పులను తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే ముద్రించే అవకాశమిచ్చినా ముందుకు సాగడం లేదు. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధులకు వెళ్లడంతో కొంత జాప్యం జరిగింది. తహసీల్దార్లు డిజిటల్‌ సంతకాలు చేయడంలో జాప్యంతో పుస్తకాల పంపిణీకి ఆటంకాలు కొనసాగుతున్నాయి. కొత్త పాసుపుస్తకాల జారీతో పాతవాటికి కాలం చెల్లింది. దీంతో వాటిని కుదవ పెట్టి ప్రైవేట్‌గా అప్పులు తెచ్చుకునే వీలు కూడా లేకపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
వారికి సాయం ఎప్పటికి? 
ప్రభుత్వం ఎకరాకు  రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద వానాకాలం, యాసంగి పంటలకు ఆర్థిక సాయం అందించింది. వానాకాలంలో వ్యవసాయ శాఖ 58 లక్షల చెక్కులు ముద్రించగా అందరి దగ్గరా పాసుపుస్తకాలు లేకపోవడంతో 50 లక్షల చెక్కులను మాత్రమే పంపిణీ చేశారు. యాసంగికి వచ్చేసరికి 45 లక్షల మందికే సాయం అందింది. పాసుపుస్తకాలు అందని అయిదున్నర లక్షల మంది అన్నదాతలకు.. రైతుబంధు, రైతు బీమా అందేది ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

పేరు..  ఫొటో తప్పు అని తిప్పుతున్నారు

పట్టాలెక్కలేదు... పైసలు దక్కలేదు 

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళంపల్లికి చెందిన ఈ రైతు పేరు ఉప్పల శేఖర్‌. మూడెకరాల పొలం ఉంది. కొత్త పాసుపుస్తకం ఇస్తామని ప్రక్షాళనలో 1బీ వివరాలు తీసుకున్నారు. పేరు తప్పు పడిందని కొద్దిరోజులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే ఫొటో కూడా తప్పు వచ్చిందంటున్నారన్నారని శేఖర్‌ చెప్పారు. నేటికీ పాసుపుస్తకం అందకపోవడంతో రెండు విడతల రైతుబంధు సాయం అందలేదని, రైతు బీమా కూడా వర్తించలేదని వాపోయారు.

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం 

పట్టాలెక్కలేదు... పైసలు దక్కలేదు నాకు పూర్వీకుల నుంచి సంక్రమించిన రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో పాసుపుస్తకం ఉండేది. 1బీ దస్త్రాల్లో, కాస్తులో నేనే ఉన్నాను. భూమిపై ఎలాంటి వివాదాలు లేకపోయినా కొత్త పాసుపుస్తకం ఇవ్వలేదు. రైతుబంధు, బీమా అమలు కాలేదు. ఇప్పటికీ పాసుపుస్తకం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. 
- రౌతు అశోక్‌, ధర్మారావుపేట, గణపురం మండలం, జయశంకర్‌భూపాలపల్లి జిల్లా

నాలుగెకరాలకు పైసలు రాలే 

పట్టాలెక్కలేదు... పైసలు దక్కలేదు నాకు నాలుగెకరాల భూమి ఉంది.  కొత్త పాసుపుస్తకం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులను అడిగితే నీ సర్వే నంబర్లలో ఇతరుల భూమి నమోదయింది.. దాన్ని మార్చాలని చెబుతున్నారు. రైతుబంధు పైసలు రాలేదు. 
- వేల్పుల నర్సయ్య, కిష్టాపూర్‌, రామడుగు మండలం, కరీంనగర్‌ జిల్లా

పరిష్కారానికి ప్రత్యేక బృందాలు

కొన్నిచోట్ల పాసుపుస్తకాలు అందలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తున్నాం. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక   బృందాలు ఏర్పాటు చేసి గ్రామాలకు పంపిస్తున్నాం. అందరికీ పుస్తకాలు   వస్తాయి. ఆందోళన చెందొద్దు. 

- వాకాటి కరుణ, డైరెక్టర్‌, ఎల్‌ఆర్‌యూపీ

రెవెన్యూ సిబ్బందిపై భారం

క్షేత్రస్థాయి విచారణకే ఎక్కువ సమయం పడుతుంది. ఆన్‌లైన్‌ తప్పిదాలకు కూడా రెవెన్యూ సిబ్బందినే బాధ్యులను చేస్తున్నారు. ఓటర్ల జాబితాల సవరణ, ఎన్నికలు, ఇతర ప్రభుత్వ విధులతో రెవెన్యూ సిబ్బంది   అధిక ఒత్తిడికి గురవుతున్నారు. పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.

- గౌతం కుమార్‌, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.