close

ప్ర‌త్యేక క‌థ‌నం

విచారణలో విప్లవం

దర్యాప్తులో ఆధునిక సాంకేతికత
తెలంగాణ పోలీసుల మరో ఘనత
ఐసీజేఎస్‌ వస్తే సమయం, ఖర్చు ఆదా
వందలమంది సిబ్బందితో అవసరం లేదు
మానవ తప్పిదాలకు ఆస్కారం లేనట్లే

కాలం మారుతోంది.. మన పోలీసు శాఖ కూడా మారిపోతోంది. చేతిలో లాఠీ పట్టుకుని.. జేబులో వారెంట్‌ పెట్టుకుని కానిస్టేబుల్‌ ఊరమ్మట తిరిగే పరిస్థితికి కాలం చెల్లబోతోంది.. కాగితాల కట్టలు పట్టుకుని ఠాణా నుంచి కోర్టుకు.. అక్కడి నుంచి జైలుకు తిరిగే అవసరం ఇక ఉండదు. సాంకేతిక పరిజ్ఞానం వినిమయంలో ఆదర్శంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ఘనత సాధించబోతోంది. ఏదైనా నేరం జరిగినప్పటి నుంచి న్యాయస్థానం తీర్పు వెలువరించే వరకూ రికార్డులను, వివిధ విభాగాల మధ్య జరిగే సమాచార మార్పిడి మొత్తాన్ని ఆన్‌లైన్‌ చేయబోతోంది. దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా ‘ఇంటర్‌ ఆఫరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం’ (ఐసీజేఎస్‌) పేరుతో ఇప్పటికే వరంగల్‌లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని త్వరలోనే రాష్ట్రం మొత్తానికి విస్తరించనున్నారు. ఇది కాగితరహిత విధానమే కాదు వేగవంతమైనది, పారదర్శకమైనది కూడా. అన్నింటికీ మించి విలువైన మానవ వనరులను కాపాడుతుంది. వివిధ విభాగాల మధ్య మరింత సమన్వయానికి ఉపయోగపడుతుంది. కేసు విచారణ వేగవంతం కావడానికి తోడ్పడుతుంది. ఇదొక విప్లవాత్మకమైన మార్పుగా భావిస్తున్నారు.

ఇప్పుడేం జరుగుతోంది?

ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు నేరస్థలాన్ని పరిశీలించి ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌.ఐ.ఆర్‌.) నమోదు చేస్తారు. దాన్ని న్యాయస్థానానికి పంపుతారు. క్లూస్‌ టీం సహకారంతో ఆధారాలు సేకరించి అందజేస్తారు. వాటిని న్యాయస్థానం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలి. తర్వాత సాక్షులను విచారించి వాంగ్మూలం నమోదు చేస్తారు. ఆపై దర్యాప్తు కొనసాగిస్తారు. దీనికి సంబంధించి ప్రతి అంశాన్నీ ఏరోజుకారోజు కేస్‌ డైరీలో రాసుకుంటారు. నిందితుల వాంగ్మూలం నమోదు చేస్తారు. దర్యాప్తు పూర్తయి, ఆధారాలన్నీ సేకరించిన తర్వాత న్యాయస్థానంలో అభియోగాలు దాఖలవుతాయి. అక్కడ నుంచి న్యాయ విచారణ మొదలవుతుంది. చివరగా తీర్పు వెలువడుతుంది. నిందితులకు శిక్ష పడితే ఆ వివరాలు జైలుకు పంపాలి. నేరం జరిగిన తర్వాత ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు నుంచి తీర్పు వెలువడ్డాక నేరస్థులను జైలుకు పంపడం వరకూ ప్రతిదీ ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఒక ఎఫ్‌.ఐ.ఆర్‌. న్యాయస్థానంలో సమర్పించాలన్నా కానిస్టేబుల్‌ వెళ్లక తప్పదు. ఒక్కో కేసు విచారణకు వందలాది పని గంటలు వెచ్చించాల్సి వస్తోంది. వివిధ విభాగాలకు చెందిన పదుల సంఖ్యలో సిబ్బంది ఇదే పనిమీద ఉండాలి. కేవలం దస్త్రాలు ఒకదగ్గర నుంచి మరో దగ్గరకు తరలించడానికే ఎంతోమంది పనిచేయాల్సి వస్తోంది.

ఇలా చేస్తారు

పోలీస్‌స్టేషన్లు, న్యాయస్థానాలు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, జైళ్లను అంతర్జాలం ద్వారా అనుసంధానం చేస్తున్నారు. దర్యాప్తునకు సంబంధించిన పురోగతి అప్‌లోడ్‌ చేస్తుంటారు. అభియోగపత్రం కూడా ఆన్‌లైన్లోనే దాఖలు చేస్తారు. కేసు ఎప్పుడు విచారణకు వస్తుందనేది న్యాయస్థానం నుంచి ఆన్‌లైన్లోనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం వస్తుంది. నిందితునికి శిక్ష పడితే దాని తాలూకూ పత్రాలన్నీ ఆన్‌లైన్‌లోనే జైలుకు పంపుతారు. జైలు నుంచి ఎవరైనా నిందితులు విడుదలైతే పోలీసులకు వెంటనే తెలుస్తుంది. అవసరమైతే వారిపై నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది.

ఆలస్యం.. అవినీతి

ఇప్పుడున్న పద్ధతిలో ప్రతి అంశమూ చాలా ఆలస్యమే. ఉదాహరణకు నేర స్థలం నుంచి సేకరించిన ఆధారాలు విశ్లేషించాలంటే ముందు వాటిని న్యాయస్థానానికి పంపాలి. న్యాయస్థానం వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతుంది. విశ్లేషణ పూర్తయ్యాక ఆ నివేదిక న్యాయస్థానానికి చేరుతుంది. పోలీసులు దాన్ని తెచ్చుకుంటారు. పోలీసులు, న్యాయస్థానం, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లు ఉంటారు.
* ఐసీజేఎస్‌ అందుబాటులోకి వస్తే సేకరించిన ఆధారాలు న్యాయస్థానం ద్వారా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడానికి మాత్రమే మనుషుల అవసరం ఉంటుంది. మిగతా తతంగం అంతా ఆన్‌లైన్లోనే జరుగుతుంది.

అవినీతికి కాలం చెల్లు!

ప్రస్తుత విధానంలో కేసు దర్యాప్తుల్లో ప్రతి దశలోనూ అవినీతికి ఆస్కారం ఉంటోంది. దర్యాప్తు పూర్తయ్యాక అభియోగపత్రం దాఖలు వరకు కనీసం మూడు నెలలు పడుతుంది. ఒక్కోసారి ఆరు నెలలు, సంవత్సరం కూడా పట్టవచ్చు. మధ్యలో దర్యాప్తు అధికారులు మారిపోతుంటారు. వారిలో ఎవరైనా ప్రలోభాలకు లొంగిపోతే ఆధారాలు తారుమారు కూడా కావచ్చు. కేసు వీగిపోవచ్చు.
* ఐసీజేఎస్‌ వస్తే దర్యాప్తునకు సంబంధించిన కేస్‌ డైరీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో పెడతారు. వ్యక్తిగతంగా మార్పులు చేయాలంటే సాధ్యంకాదు.

వెంటపడుతుంది.. వారెంట్‌

నిందితులపై న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు (ఎన్‌.బి.డబ్ల్యూ.) జారీ చేస్తే రకరకాల కారణాలతో పోలీసులు వాటిని పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉంటుంది. నిందితుల నుంచి డబ్బు తీసుకుని వారెంట్‌ను అమలుచేయరనే అపవాదు కూడా ఉంది.
* ఐసీజేఎస్‌లో వారెంట్‌ జారీ అయిన తర్వాత అది అమలు పరిచే వరకూ కంప్యూటర్లో కనిపిస్తూనే ఉంటుంది. దానివల్ల ఎక్కువసార్లు, ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉండే వారెంట్లపై న్యాయమూర్తి ప్రత్యేక దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది.

అంతా ఆదానే

ఒక్క కేసులో అభియోగపత్రం దాఖలు చేయాలంటే కనీసం వంద పేజీలు వెచ్చించాలి. న్యాయస్థానానికి సమర్పించే ప్రతితోపాటు దాని నకలును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు, నిందితుడికి, దర్యాప్తు అధికారికి, పర్యవేక్షణాధికారికీ అందించాలి. అంటే ప్రతి కేసుకూ కనీసం 500 కాగితాలు అవసరం.
* ఐసీజేఎస్‌లో ఎక్కడా కాగితం అన్నది కనిపించదు. అంతా ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుంది. అలాగే ఈ పత్రాలు సమర్పించడానికి పోలీసు సిబ్బంది పదేపదే ఆయా విభాగాల మధ్య తిరగడానికయ్యే ఖర్చు ఆదా అవుతుంది. అన్నిటికీ మించి దస్త్రాలేవీ వ్యక్తిగతంగా సమర్పించాల్సిన అవసరం లేకపోవడం వల్ల కొన్ని వేల పని గంటలు ఆదా అవుతాయి. ఆ సమయాన్ని ఇతరత్రా విధులకు వాడుకోవచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.