close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆరోగ్యాన్ని కబళిస్తున్న ప్లాస్టిక్‌

ఆహార పదార్థాలన్నీ వాటిల్లోనే క్యాన్సర్‌ సహా ప్రమాదకరమైన సమస్యలు
వినియోగాన్ని తగ్గించుకోవాలంటున్న నిపుణులు

మన జీవితం ప్లాస్టిక్‌మయంగా మారింది. ఏది తినాలన్నా, ఏ పని చేయాలన్నా ప్లాస్టిక్‌ లేకుండా దాదాపు అసాధ్యమనే పరిస్థితి తలెత్తింది. కూరగాయల మార్కెట్‌ మొదలుకొని పెద్ద షాపింగ్‌ మాల్‌ వరకూ ఏ వస్తువు తీసుకున్నా ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో వేసి ఇస్తున్నారు. కర్రీ పాయింట్లలో అయితే వేడి సాంబారు, అన్నం, కూరలు అన్నింటినీ ప్లాస్టిక్‌ కవర్లలో కట్టి ఇస్తున్నారు, ఏ వేడుకయినా ఆహార పదార్థాల కోసం కంచాలు, టీ గ్లాసులు, నీళ్ల గ్లాసులు, సాంబారు గిన్నెలు అన్నీ ప్లాస్టిక్‌వే వాడుతున్నారు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి అనర్థమని ఏళ్లుగా ప్రభుత్వాలు, పర్యావరణ ప్రియులు చెబుతున్నా.. ప్రజలకు ఎక్కడం లేదు. నిజానికి ప్లాస్టిక్‌ వాడకం వల్ల పరోక్షంగా కాదు.. ప్రత్యక్షంగానే ఆరోగ్యానికి హాని కలుగుతోంది.

 

పలుచటి, రంగులతో ప్రమాదం

‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌)’ సూచించిన విధంగా నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసిన ప్లాస్టిక్‌ వస్తువు అయితే కొంతమేరకు ఫరవాలేదు. ఈ వస్తువుల్లో హానికారక రసాయనాలు తక్కువ మోతాదులో ఉంటాయి. వీటి కింది భాగంలో ‘ఇది ఆహార పదార్థాల కోసమే తయారుచేసినది’ అని పేర్కొంటూ ‘బీఐఎస్‌’ ధ్రువీకరించిన ముద్రణ ఉంటుంది. ఇక ప్లాస్టిక్‌ చేతి సంచుల్లో కనీసం 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న సంచులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే విపణిలో ఈ ఆదేశాలు అమలు కావడంలేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లో కొన్ని ఊరుపేరు లేని కంపెనీల నీళ్ల సీసాలను కూడా విక్రయిస్తున్నారు.

ప్లాస్టిక్‌ వస్తువుల్లోని హానికారకాలు

* ప్లాస్టిక్‌ పరమాణువులు
* సీసం
* క్యాడ్మియం
* థాలేట్‌
* మెర్క్యూరీ (పాదరసం)

తలెత్తే అనారోగ్య సమస్యలివే..

* కేన్సర్‌
* పుట్టుకతో అవకరాలు
* దీర్ఘకాలిక బ్రాంకైటిస్‌
* అల్సర్లు
* కాలేయం దెబ్బతినడం
* ఎండోక్రైన్‌ వ్యవస్థ దెబ్బతినడం
* పునరుత్పత్తి వ్యవస్థపై దుష్ప్రభావం
* సంతానలేమి
* రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం
* యుక్తవయసులోనే ఊబకాయం

త్వరలో నిషేధించనున్నవి

* 200 ఎంఎల్‌ నీళ్ల సీసాలు
* ప్లాస్టిక్‌ మినరల్‌ వాటర్‌ ప్యాకెట్లు.
* అన్ని రకాల ప్లాస్టిక్‌ చేతి సంచులు, నాన్‌ ఓవన్‌  బ్యాగులు.
* ఒకసారి వినియోగించి పారవేసే అన్ని రకాల ప్లాస్టిక్‌ వస్తువులు.
* ప్లాస్టిక్‌, థర్మాకోల్‌తో చేసే అలంకృత సామాగ్రి.

ప్రభుత్వాల అప్రమత్తత.. తెలంగాణలోనూ నిషేధం

ప్లాస్టిక్‌ వస్తువుల వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు కొన్ని రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిషేధించగా, కర్ణాటక కూడా అదే బాటలో కసరత్తు చేస్తోంది. కేరళలో శబరిమల తదితర కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నిషేధాన్ని విధించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. తెలంగాణలోనూ కొన్ని రకాల ప్లాస్టిక్‌ వస్తువులపై పూర్తిగా నిషేధం విధించనున్నారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి తప్పునకు ఐదువేల జరిమానా, మలి తప్పునకు రూ.10వేల జరిమానా, మూడోసారి కూడా తప్పు చేస్తే రూ.25వేల జరిమానా, మూడు నెలల జైలుశిక్ష విధించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

ప్రత్యామ్నాయం ఏమిటి?

* ప్లాస్టిక్‌ను సాధ్యమైనంత తక్కువగా వినియోగించడం ప్రజల వ్యక్తిగత బాధ్యతే.
* జనప నార, సాధారణ వస్త్రాలతో చేసిన చేతి సంచుల వాడకం పెరగాలి.
* కాగితపు సంచులు, మట్టి పాత్రలు, గాజు పెట్టెలు, గ్లాసులు వాడాలి.
* జీవశైథిల్య (బయోడీగ్రేడబుల్‌) వస్తువులు వినియోగించాలి.

సాధ్యమైనంత వరకు  వాడకం తగ్గించాలి

ప్లాస్టిక్‌ వాడకం వల్ల మనకు తెలియకుండానే విషతుల్యాలు శరీరంలోకి చేరిపోతున్నాయి. వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలను ప్లాస్టిక్‌ వస్తువుల్లో వాడడం వల్ల హానికారకాలు విడుదలై, శరీరంలో ప్రమాదకరమైన మార్పులకు కారణమవుతున్నాయి. శరీరంలోని సహజసిద్ధ హార్మోన్ల సమతౌల్యతను దెబ్బతీస్తున్నాయి.  ముఖ్యంగా పిల్లల జీవన ప్రమాణాలపై దుష్ప్రభావం చూపుతాయి. వారి జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. శ్వాస సమస్యలు ఎదురవుతాయి. కిడ్నీల మీద కూడా దుష్ప్రభావం ఉంటుంది. ప్లాస్టిక్‌ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తే మంచిది.
- డాక్టర్‌ ఎంవీ రావు, ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌

కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది

ప్లాస్టిక్‌ సంచుల్లో, డబ్బాల్లో టీ లేదా ఇతర వేడి ఆహార పదార్థాలను ఉంచినప్పుడు.. వాటిలోంచి విషతుల్య రసాయనాలు వెలువడుతాయి. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్‌ రావడానికి కారణమవుతుంది. చాలామంది నీళ్ల సీసాలను కార్లలో పెట్టి మరిచిపోతుంటారు. వీటినుంచి ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ పరమాణువులు విడుదలవుతాయి. ఆ నీళ్లను తాగినప్పుడు విషతుల్యాలు మన శరీరంలోకి చేరుతున్నాయి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడితే మేలు.
- డాక్టర్‌ అనిల్‌ చెరుకూరి, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు

- ఈనాడు, హైదరాబాద్‌ 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.