close

ప్ర‌త్యేక క‌థ‌నం

అట్టడుగుకు జీవ జలం.. గొంతెండుతున్న పట్నం

పురపాలక పట్టణాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య


పాతాళానికి భూగర్భ జలాలు

పట్టణాలు, నగరాలకు పురపాలక శాఖ ద్వారా సరఫరా అయ్యే భూగర్భజలాల్లో 60 శాతం పైగా తగ్గిపోయాయి. వెయ్యి అడుగులు లోతు బోర్లలో కూడా చుక్కనీరు లేకుండా పోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది.


ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. భూగర్భజలాలు పాతాళానికి చేరడంతో నీటికోసం విలవిలలాడే పరిస్థితి తలెత్తింది. గోదావరి, కృష్ణా జలాలు మిషన్‌ భగీరథ ద్వారా చాలా పట్టణాలకు చేరువైనా సరఫరాలో అంతరాయాలు, అరకొర సరఫరాకు తోడు భూగర్భజల మట్టాలు దారుణంగా పడిపోవడంతో పట్టణాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో ప్రైవేటుబోర్లలో చుక్కనీరు లేకుండా పోగా పురపాలక శాఖకు చెందిన వందలాది బోర్లు నిరుపయోగంగా మారాయి.

కొత్త మున్సిపాలిటీల్లో పాత పద్ధతే..
భూగర్భజలాలపైనే అత్యధికంగా ఆధారపడిన పట్టణాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కొత్తగా ఏర్పాటైన 67 పురపాలక సంఘాల్లో గతంలోని గ్రామపంచాయతీ సరఫరా విధానాలతోనే నీళ్లు సరఫరా అవుతున్నాయి. వీటిలో అత్యధికంగా భూగర్భజలాలపైనే ఆధారపడినవి కావడంతో  సమస్య తీవ్రంగా ఉంది. బెల్లంపల్లి, షాద్‌నగర్‌లలో నాలుగురోజులకోసారి నీరు సరఫరా అవుతుండగా 15కు పైగా పురపాలక సంఘాల్లో మూడు రోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. ట్యాంకర్ల సంఖ్యను పెంచుతున్నా సమస్య తీరడంలేదు. శివారు కాలనీల కోసం ప్రైవేటు ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్నా సరఫరా అరకొరగానే ఉంటోంది. రాష్ట్రంలో సరఫరా కావాల్సిన 700 ఎంఎల్‌డీల నీటిలో 75 శాతం కంటే తక్కువే సరఫరా అవుతోంది.

పలు పట్టణాల్లో నీటికి కటకట
బెల్లంపల్లి, సిర్పూరు కాగజ్‌నగర్‌, మంచిర్యాల, ఇల్లందు, కొత్తగూడెం, మెదక్‌, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, హుస్నాబాద్‌, అచ్చంపేట, బైంసా, షాద్‌నగర్‌, జోగిపేట, తాండూరు సహా పలు పురపాలక పట్టణాలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి. కొత్తగూడెంలో 4రోజులకోసారి పురపాలకసంఘం నీటి సరఫరా చేస్తోంది. భూగర్భజలాలు తగ్గిపోవడంతో ప్రజలు నీటి కోసం సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్‌లో నగర పాలక సంస్థ నీటిని సరఫరా చేస్తున్నా భూగర్భజలాలు అడుగంటడంతో తాగునీటి సమస్య నెలకొంది. 800 అడుగులు పైగా వేసిన బోర్లలో చుక్కనీరు లేకుండా పోయింది. నల్గొండ పట్టణంతోపాటు శివారు కాలనీలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి. పట్టణంలో 24 ఎంఎల్‌డీల నీరు సరఫరా కావాల్సి ఉండగా సగటున 17 ఎంఎల్‌డీల నీరు మాత్రం సరఫరా అవుతోంది. పట్టణంలోని ప్రధాన కాలనీలకు రోజు తప్పి రోజు పంపిణీ చేస్తున్నా.. కొన్ని ప్రాంతాలకు మాత్రం మూడు, నాలుగు రోజుకోసారి అందిస్తున్నారు. మున్సిపాలిటీ అధ్వర్యంలో 26  ట్యాంకర్ల ద్వార నీళ్లు సరఫరా చేస్తున్నా నీటి అవసరాలు అంతంతమాత్రంగానే తీరుతున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.