close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విజయన్‌ చరిత్ర సృష్టిస్తారా?

ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని కచ్చితంగా మార్చే సంప్రదాయానికి కేరళ ఓటర్లు స్వస్తి పలకనున్నారా? తాజా ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా వామపక్ష ప్రజాస్వామ్య వేదిక (ఎల్‌డీఎఫ్‌) చరిత్ర సృష్టించనుందా? సీఎం పినరయి విజయన్‌ కరిష్మాయే అందుకు ప్రధాన ఇరుసుగా మారనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోందిప్పుడు!

దేశ రాజకీయాల్లో కేరళది ప్రత్యేక స్థానం. 1977 ఎన్నికల్లో మినహా, మరెప్పుడూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. నిజానికి వాటిలో చాలా ప్రభుత్వాలు బాగానే పనిచేశాయి. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించాయి. అయినా ఓటర్లు కరుణించలేదు. వరుసగా పదేళ్లు తమను పాలించే అవకాశమివ్వలేదు. ఈ సంప్రదాయానికి తాజా ఎన్నికలతో ముగింపు కార్డు పడటం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అధికారంలో కొనసాగుతుందని ఇటీవల ఆరు ఒపీనియన్‌ సర్వేలు జోస్యం చెప్పాయి కూడా. ఈ విశ్లేషణలు, సర్వేల విశ్వాసం వెనుక ప్రధానంగా వినిపిస్తున్న పేరు ‘విజయన్‌’.

పాలనపై సంతృప్తి

కేరళలో ప్రస్తుతం రాజకీయాలన్నీ దాదాపుగా విజయన్‌ చుట్టూనే తిరుగుతున్నాయి! ఎన్నికలకు సంబంధించి జరిగే ప్రతి సంభాషణలోనూ ఆయన పేరు వినిపిస్తోంది. సీపీఎంకు అంతగా పట్టులేని కాసర్‌గోడ్‌ వంటి జిల్లాల్లోనూ విజయన్‌ సీఎంగా కొనసాగాలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ‘‘మాకు రాష్ట్ర మంత్రుల పేర్లు ఏంటో కూడా తెలియదు. తెలిసిందల్లా సీఎం ఒక్కరే. ఆయన ఆధ్వర్యంలో అన్ని మంత్రిత్వ శాఖలూ బాగా పనిచేస్తున్నాయి. ముఖ్యమంత్రే అన్నీ తానై వాటిని నడిపిస్తున్నారు. ఆయన పనితీరుపై అందరూ సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించట్లేదు’’ అని గల్ఫ్‌ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన అహ్మద్‌ మిర్షద్‌ (కాసర్‌గోడ్‌) అనే వ్యక్తి చెప్పుకొచ్చారు. నిజానికి తాను ‘ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌)’ మద్దతుదారుడినని, ఈ దఫా మాత్రం ఎల్‌డీఎఫ్‌కే ఓటేస్తానని మిర్షద్‌ పేర్కొన్నారు.

కఠిన సవాళ్లను దాటుకొని..

సీఎంగా గత ఐదేళ్లలో విజయన్‌ అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇటీవల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆయన హయాంలోనే రాష్ట్రాన్ని రెండేళ్లు వరదలు ముంచెత్తాయి. నిఫా వైరస్‌ ప్రబలడంతో, తర్వాత కొవిడ్‌ మహమ్మారి విజృంభించడంతో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి అంశాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. వాటన్నింటినీ ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు.

సంక్షేమ పథకాలతో పెరిగిన ఆదరణ

విజయన్‌ తన పాలనలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం ఇంటింటికీ ఆహార/నిత్యావసర కిట్లు అందించింది. ఆకలి మరణాలు చోటుచేసుకోకుండా నివారించింది. లక్షల మందికి ఆర్థికంగానూ అండగా నిలిచింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయ రంగాలకు కేటాయింపులను ప్రతి బడ్జెట్‌లో పెంచుతూ వెళ్లింది. సంక్షేమ పింఛనును పెంచింది. ప్రైవేటు రంగ పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వడంతో నిస్సాన్‌, టెక్‌ మహీంద్ర వంటి కంపెనీలు రాష్ట్రంలో ఐటీ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. వీటన్నింటి ఫలితంగా విజయన్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది.

ప్రతికూలాంశాలూ ఉన్నాయ్‌

విజయన్‌కు ఆదరణ పెరిగిన మాట వాస్తవమే అయినా.. తాజా ఎన్నికల్లో ఆయనకు ప్రతికూలంగా పనిచేసే అంశాలూ ఉన్నాయి. ముఖ్యంగా మధ్య, దక్షిణ కేరళల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. శబరిమల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుచిత రీతిలో వ్యవహరించిందని పలువురు ఆగ్రహంతో ఉన్నారు. ఇక రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన మరో అంశం బంగారం అక్రమ రవాణా కుంభకోణం. ప్రభుత్వంలోని పలువురు పెద్దల హస్తం అందులో ఉందని ఆరోపణలొచ్చాయి. వీటన్నింటినీ దాటుకొని విజయన్‌ విజయపతాక ఎగరేస్తారో లేదో చూడాలంటే మే 2 వరకు ఆగాల్సిందే!

- ఈనాడు, ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు