close
Updated : 15/09/2021 16:37 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

#రేప్‌ కల్చర్ : అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నారు?

రేప్‌ కల్చర్‌ అంటే భౌతిక దాడి మాత్రమే కాదు. తమ పరుష పదజాలంతో మహిళల మనోభావాలు దెబ్బతీయడం, డేటింగ్‌లో ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడం వంటివి కూడా రేప్‌లో భాగమే. అటు విద్యలోనూ ఇటు ఆర్థికంగానూ అగ్రగామి అనిపించుకున్న అమెరికాలో సైతం ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఇలా రేప్‌కు గురవుతున్నారంటే నేటి సమాజంలో ఆడవారి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారత్‌లో అయితే ఏటా పాతిక వేలకు పైగానే రేప్‌ కేసులు నమోదవుతుండగా అనధికారికంగా ఎందరో అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. తాజాగా హైదరాబాదులో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనతో పాటు, ఇటీవలి కాలంలో వివిధ ప్రాంతాల్లో మహిళల పైన జరిగిన అత్యాచారాలే  ఇందుకు సాక్ష్యం.

అయితే మరోపక్క వయసుతోనూ, వావి వరసలతోనూ సంబంధం లేకుండా నిత్యం చిన్నారుల పైన, స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మూల కారణం స్త్రీనే అన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ క్రమంలో చాలామంది తల్లిదండ్రులు కూడా అత్యాచారాల విషయంలో అమ్మాయిలతోనే ఎక్కువగా మాట్లాడుతున్నారట ! కానీ అబ్బాయిలకు అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలపడం లేదట. అందుకే చాలామంది అబ్బాయిలు రేప్‌ కల్చర్‌లో భాగమవుతున్నారు. 
మరి ఇటువంటి దారుణ పరిస్థితులకు కారణం ఎక్కడుంది ? అసలు ఈ రేప్‌ కల్చర్‌ని అంతమొందించడం ఎలా? తెలుసుకుందాం రండి!

సమానత్వంలో అబ్బాయిలకు శిక్షణ అవసరం!

శరీరం దృఢంగా ఉండాలంటే కసరత్తులు ఎలా అవసరమో, మనసు సానుకూలంగా ఉండడానికి కూడా శిక్షణ అంతే అవసరం. అది తల్లిదండ్రులతో పాటు గురువుల చేతిలోనే ఉంది. గతంలో జరిగిన అత్యాచారాలను విశ్లేషించిన కొందరు మానసిక పరిశోధకులు ఇంట్లో, స్కూల్లో సరైన మార్గదర్శకత్వం లేకనే చాలామంది యువకులు అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడుతున్నారని తెలిపారు. అంటే అమ్మాయిలకు దుస్తులు సరిగా వేసుకోమని... రాత్రి వేళ త్వరగా ఇంటికి రమ్మని, అబ్బాయిలతో ఎక్కువగా చనువుగా ఉండకూడదని తెలిపే తల్లిదండ్రులు తమ అబ్బాయిలకి మటుకు అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో చెప్పడం లేదట. తమ పెంపకంలో అమ్మాయి అంటే సున్నితమైన, బలహీనమైన వ్యక్తిలా... అబ్బాయి అంటే బలవంతుడిలా చిత్రీకరించడం చాలామంది అబ్బాయిలకి ప్రతికూల సంకేతంలా వెళుతోంది. అంతేకాదు చాలామంది అమ్మాయిలను అభద్రతా భావానికి గురి చేస్తోంది. సమాజంలో అమ్మాయి అంటే ఇలానే ఉండాలనే గిరి గీసిన సిద్ధాంతం వల్ల, అలా ఉండని అమ్మాయిని అబ్బాయిలు తప్పుడు దృష్టితో చూస్తున్నారట. అలా కాకుండా ప్రతి ఇంట్లో అబ్బాయి, అమ్మాయి ఒకటే అనే సమానత్వాన్ని చిన్నప్పటి నుంచే నేర్పగలిగితే ఈ సమాజంలో చాలా వరకు అత్యాచారాలు జరగకుండా చేయవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు.

ముందు ఇంట్లో పురుషాధిక్యాన్ని తగ్గించాలి!

పిల్లలు ఏది నేర్చుకున్నా ముందు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారనేది అందరూ అంగీకరించేదే. అయితే అది తెలుసుకుని మసలుకునేది చాలా తక్కువ మంది. ఇప్పటికీ గరిష్టంగా చాలామంది ఇళ్లలో పురుషులదే ఆధిక్యం. అసలు ఆధిక్యం, అధిపత్యం అన్న భావన వచ్చిందంటేనే సమానత్వం నశించినట్లు. తరచూ తమ మాటే నెగ్గాలని పిల్లల ముందే తల్లిదండ్రులు గొడవలు పెట్టుకోవడం మూలంగా పిల్లల్లో కూడా అటువంటి భావనే కలుగుతుందని వారు గ్రహించాలి. ఇటువంటి సమయంలోనే సమస్యను పరిష్కరించుకోవడంలో.. ఆగ్రహాన్ని నిగ్రహించుకోవడంలో పిల్లలకు తాము ఒక ఉదాహరణగా నిలవాలని తల్లిదండ్రులు భావించాలి. తల్లీ, తండ్రి సమానమే అని వారు నిరూపించినప్పుడే అన్నా, చెల్లి దగ్గర నుంచి అన్ని బంధాల్లో ఆడమగ ఒకటే అనే సమానత్వ భావన పిల్లల్లో కలుగుతుంది.

పిల్లల ముందు అలా మాట్లాడకండి !

ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, టీవీల వల్ల రేప్‌ అంటే ఏంటో చాలామంది పిల్లలకు సైతం తెలిసిపోతోంది. అయితే అవి ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునే సరైన జ్ఞానం వారికి అందడం లేదు. పైగా ఇటువంటి ఉదంతాలు ప్రసారమైనప్పుడు ‘ఆ సమయంలో ఆ అమ్మాయి అక్కడ ఏంచేస్తోంది ?’ ‘ఆమె వస్త్రధారణ సరిగా లేదు..’, ‘ఈ కాలం అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు..!’ వంటి మాటలు మాట్లాడడం పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని పెంచుతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మహిళల పైన పురుషుడు తన బలాన్ని ప్రదర్శించడం తప్పు అనే సంకేతాన్ని పిల్లలకు చేరేలా చేయాలే తప్ప జరిగిన అత్యాచారంలో పురుషుడి పాత్రను తగ్గించి మహిళని బాధ్యురాలిని చేయకూడదు. అలాగే అబ్బాయిలు చేసే పనిని అమ్మాయిలు చేస్తున్నప్పుడు కూడా ‘అది అబ్బాయిల పని.. నీకెందుకు ?’, ‘అమ్మాయిలెవరైనా ఇలా చేస్తారా ?’ అంటూ వేరు చేసి కించపరిచేలా మాట్లాడకూడదు.

పదజాలంతోనే మొదలుపెట్టండి !

పది చేతి దెబ్బల కంటే ఒక్క మాట గుండెను పగిలేలా చేయగలదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే పరుష పదజాలాన్ని ప్రయోగిస్తుండడం నేటి సమాజంలో భాగమైపోయింది. ఆడ, మగ మధ్య వ్యత్యాసం ఉందని అపోహపడడానికి, పురుషుడంటే బలవంతుడు అనే బీజం పిల్లల నరనరాల్లో నాటుకుపోవడానికి తల్లిదండ్రులు మాట్లాడే ఈ పరుష పదజాలమే నాంది. అందుకే ఇటువంటి విషయాల్లో ముందు తల్లిదండ్రులకు శిక్షణ అవసరం అంటున్నారు మానసిక నిపుణులు. ముందు మనం మాట్లాడే మాటలు సానుకూలంగా ఉంటే.. చేతలు కూడా సానుకూలంగా మారతాయనే సత్యాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

బయటి ప్రభావాన్ని పిల్లలపై పడనీయకండి !

పిల్లలకు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడం ఎంత అవసరమో బయట నుంచి వారు ఎటువంటి ప్రతికూల ధోరణులను అలవర్చుకోకుండా చూడడం కూడా అంతే అవసరం. సినిమాలు, స్నేహితుల ప్రభావం వల్ల పిల్లలు నెగెటివిటీకి ఎక్కువ ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు అమ్మాయిని చూసి ఏదో కామెంట్ చేయడం, విజిల్‌ వేయడం హీరోయిజంలా పిల్లలకు అనిపించొచ్చు. కానీ అది ప్రతికూలతను పెంచుతుందని... రేప్‌ కల్చర్‌లో అదొక భాగమనే అభిప్రాయాన్ని వారికి కలిగించాలి. అలాగని అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండమని చెబితే సరిపోదు. చెడు గురించి తెలిస్తేనే కదా మంచి గురించి తెలిసేది. చేయాల్సిందల్లా మంచి, చెడుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించేలా పిల్లలకు నేర్పడమే.

అలానే అనాదిగా స్త్రీని ‘సెక్సువల్‌ ఆబ్జెక్ట్‌’ (శృంగార వస్తువు)గా చూపే సంస్కృతి మన సంఘంలో ఉంది. అలా కాకుండా లైంగిక వాంఛలోనూ ఆడ, మగ సమానమనే భావం భావి తరాలకు కలిగించే విధంగా తల్లిదండ్రుల నడవడిక సాగాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు రాజ్యాంగ పరంగా కూడా అన్ని రంగాల్లో ఆడ, మగకి కలిపి ఒక్కటే విధానం ఉన్నప్పుడు భావితరాల్లో కూడా సమానత్వ భావం అలవడుతుందని.. అందుకు అందరూ కృషి చేస్తేనే జరిగే ఘోరాలను నిలువరించవచ్చని వారు అంటున్నారు. మరి మన సమాజంలో ‘రేప్‌ కల్చర్‌’ను ఇంకా ఏవిధంగా అంతమొందించచ్చో మీ అభిప్రాయాలను వసుంధర.నెట్‌ వేదిక ద్వారా పంచుకోండి.

మహిళల పైన, చిన్నారుల పైన అత్యాచారాలు నిరోధించాలంటే ఏం చేయాలి?

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని