Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 20/09/2021 17:09 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. త్వరలోనే ఏపీలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ: పేర్నినాని

చిత్ర పరిశ్రమల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్‌ యజమానులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై సమావేశంలో చర్చ జరిగింది. త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సినీ ప్రముఖలతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని, సోదరభావంతో చూస్తారని అన్నారు.

2. కేటీఆర్‌.. పక్కదారి పట్టించొద్దు: రేవంత్‌రెడ్డి

ఆదర్శ, పారదర్శక తెలంగాణ కోసం యువతలో విశ్వాసం కల్పించేందుకే మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ విసిరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని గన్‌ పార్కు అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్‌ వ్యవహారంలో లోతుగా విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా?అని ప్రశ్నించారు. డ్రగ్స్‌ అమ్మకాలకు పబ్‌లు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ఎక్సైజ్‌ శాఖ విచారణ మధ్యలో అకున్‌ సబర్వాల్‌ను బదిలీ చేశారని రేవంత్‌ ఆక్షేపించారు. 

3. గుజరాత్‌ టు విజయవాడ.. హెరాయిన్‌ సరఫరా వార్తలు అవాస్తవం: విజయవాడ సీపీ

గుజరాత్‌ నుంచి విజయవాడకు హెరాయిన్‌ సరఫరా చేస్తున్నారనే వార్తలు అవాస్తవమని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిని శ్రీనివాసులు తెలిపారు. గుజరాత్‌ ముంద్రా పోర్టు నుంచి దిల్లీకి హెరాయిన్‌ తరలిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆషీ కంపెనీ లైసెన్స్‌లో విజయవాడ చిరునామా ఉందన్న మాట వాస్తవమే అయినా విజయవాడ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు జరగట్లేదన్నారు. చెన్నై, అహ్మదాబాద్‌, దిల్లీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయని చెప్పారు. విజయవాడ చిరునామాతో ఉన్న కంపెనీ యజమాని చెన్నైలో ఉంటారని.. చాలా ఏళ్ల క్రితమే చెన్నైలో స్థిరపడ్డారని సీపీ ప్రకటనలో వెల్లడించారు.

4. అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’: షర్మిల

ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. అక్టోబర్‌ 20వ తేదీ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందన్నారు. పాదయాత్రను చేవెళ్లలో ప్రారంభించి చేవెళ్లలోనే ముగించనున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు.

5. మన వాళ్లని తక్కువ అంచనా వేయొద్దు సుమీ!

వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ.. సరికొత్త విషయాలు నెటిజన్లతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని స్ఫూర్తిదాయకమైనవైతే.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఆయన ‘‘కెలాగ్స్‌ ఉప్మా’’ మీద పోస్టు చేసిన మీమ్‌ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. విషయానికొస్తే.. సరిగ్గా పదేళ్ల క్రితం ‘‘కెలాగ్స్‌’’ అనే అమెరికా ఆహార ఉత్పత్తి సంస్థ భారత్‌లో అడుగుపెట్టింది. ప్రారంభంలోనే.. ఇంకేముంది ‘‘భారతీయుల బ్రేక్‌ఫాస్ట్‌ అలవాట్లు మార్చేస్తాం.. ఇడ్లీ, ఉప్మా దోశ బదులు కార్న్‌ఫ్లేక్స్‌, చాకో పాప్స్‌ తినేలా చేస్తాం’’ అంటూ సవాళ్లు విసిరింది. మరి మన భారతీయులు వారి ఆలోచనకు లొంగకపోవడం సరికదా! చివరకు ఆ కంపెనీ చేత ‘ఉప్మా’ ఉత్పత్తి చేయించేలా చేశారు.

6. పురుషులు చేయకూడని పనులకు మాత్రమే హాజరు కావాలి..

తాలిబన్లు స్త్రీల హక్కులను పరిరక్షిస్తారన్నది కేవలం భ్రమేనని మరోసారి రుజువైంది! అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో మున్సిపాలిటీలోని మహిళా ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమవ్వాలని వారు ఆదేశించారు. పురుషులు చేయకూడని/చేయలేని పనుల్లో ఉన్న కొంతమంది మాత్రమే విధులకు హాజరు కావాలని పేర్కొంది. అతివల టాయిలెట్లలో పనిచేయడాన్ని ఇందుకు ఉదాహరణగా సూచించింది. కాబుల్‌ తాత్కాలిక మేయర్‌ హమ్దుల్లా నమోనీ ఆదివారం ఈ మేరకు తమ ఆదేశాలను వివరించారు. నగరంలో దాదాపు 3 వేలమంది మున్సిపాలిటీ ఉద్యోగులున్నారు. వారిలో మహిళలు 33% వరకు ఉంటారు. 

7. రోహిత్‌కు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం: జయవర్దెనె

ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఆ జట్టు కోచ్‌ మహేలా జయవర్దెనె తెలిపాడు. కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని వెల్లడించాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆదివారం ఆ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ధోనీసేన నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి 136/8 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 పరుగుల తేడాతో ఓటమిపాలై ఈ సీజన్‌లో నాలుగు ఓటములు మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం జయవర్దెనె మాట్లాడుతూ తమ కెప్టెన్‌కు మరిన్ని రోజులు విశ్రాంతి అవసరమని తెలిపాడు. 

8. యూనివర్శిటీలో విద్యార్థి కాల్పులు.. 8 మంది మృతి

రష్యాలోని పెర్మ్‌ క్రెయ్‌ ప్రాంతంలో గల పెర్మ్‌ స్టేట్‌ యూనివర్శిటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అదే విశ్వవిద్యాలయంలో చదువుతోన్న ఓ 18 ఏళ్ల విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో విశ్వవిద్యాలయంలోకి తుపాకీతో వచ్చిన నిందితుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. తుపాకీ శబ్దాలతో ఉలిక్కిపడ్డ ఉపాధ్యాయులు, విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. కొంతమంది ఆడిటోరియంలోకి వెళ్లి దాక్కోగా.. మరికొందరు కిటికీల నుంచి దూకి బయటకు పరిగెత్తారు. 

9. రెండు -మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తా!

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 8న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా బలమైన పోరాటం చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల ప్రకారం 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుపొందినట్టు తెలుస్తోందన్నారు. పార్టీ తరఫున విజయం సాధించిన అభ్యర్థులందరికీ జనసేన తరఫున, జన సైనికుల తరఫున, నాయకులందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేశారు.

10. లాభాలకు బ్రేక్‌.. భారీ నష్టాల్లో మార్కెట్‌ సూచీలు
 గత వారం కొత్త రికార్డులు నెలకొల్పుతూ లాభాల్లో దూసుకెళ్లిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. దీనికి తోడు ఇటీవల సూచీలు భారీ లాభాలు చవిచూసిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమూ మరో కారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఉదయం 58,647 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపు లాభాల్లోకి వెళ్లినా తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 524.96 పాయింట్లు నష్టపోయి 58,490.93 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 188.30 పాయింట్లు కోల్పోయి 17,396 వద్ద స్థిరపడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని