జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేపట్టాలి 
close

తాజా వార్తలు

Published : 02/05/2020 23:10 IST

జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేపట్టాలి 

హైదరాబాద్‌ : పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన నేపథ్యంలో పురపాలకశాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. కార్మికులు, భవన నిర్మాణదారులు పాటించాల్సిన విధి విధానాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేసింది. నిర్మాణ స్థలాలు, లేబర్‌ క్యాంపుల వద్ద నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనుల ప్రారంభానికి ముందు రోజు వైద్య శిబిరం నిర్వహించాల్సి ఉందని పురపాలక శాఖ పేర్కొంది. రోజూ కార్మికులు పని ప్రదేశంలోకి ప్రవేశించగానే వారందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపేలా నిర్మాణదారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉదయం కార్మికులందరినీ సమావేశ పరిచి ఆరోగ్య నియమావళిపై అవగాహన కల్పించాలని పేర్కొంది. చేతులు శుభ్రం చేసుకునేలా నీరు, సబ్బు, శానిటైజర్లు ఉంచాలని ఆదేశించింది. నిర్మాణ కూలీలతో సహా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బయటి నుంచి వచ్చే సామగ్రిని తరలించే కూలీలకు గ్లౌజులు అందుబాటులో ఉంచాలని చెప్పింది. సైట్లలో గుట్కా, పాన్‌, తంబాకు నమలడాన్ని, ఉమ్మివేయడాన్ని నిషేధించింది. నిర్ణీత ప్రదేశాల్లో భౌతికదూరం పాటిస్తూ కార్మికులందరూ భోజనం చేసేలా చూడాలని చెప్పింది. నిర్మాణ స్థలంలో రోజూ క్రిమి సంహారక మందులు చల్లాల్సి ఉంటుందని పురపాలక శాఖ స్పష్టం చేసింది. దీనితో పాటుగా కనీసం వారానికి ఒక రోజైనా వైద్యులు అందరినీ పరీక్షించాలని వెల్లడించింది. సైట్లో నివసించే కూలీల కుటుంబాలకు ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేసి, పనివేళలు షిప్టులుగా బదలాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. వస్తువులు, తినుబండారాలు, బాటిళ్లు, ఫోన్లు ఇచ్చి పుచ్చుకోకుండా, ఎక్కువ మంది గుమికూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముట్టుకోనవసరం లేని చెత్తబుట్టలను సైట్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని