Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 19/06/2021 16:55 IST

Top Ten News @ 5 PM

1. Unlock: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేత

తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది.  దేశవ్యాప్తంగానే కాకుండా, పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్‌ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులు అందించిన నివేదికల ఆధారంగా మంత్రివర్గం నిర్ధారించింది. ఈమేరకు జూన్‌ 19 వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను రేపటి నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయించింది.

2. Amaravati: చిన్నపెళ్లనూ తీసుకెళ్లలేరు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం గద్దె దిగేంతవరకూ ఉద్యమం కొనసాగిస్తామని రాజధాని అమరావతి రైతులు, మహిళలు తేల్చి చెప్పారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 550వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు, మహిళలు రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగించారు. మందడంలో మహిళలు బుద్ధుడి విగ్రహానికి పూలు సమర్పించి అంజలి ఘటించారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు పోలేరమ్మ ఆలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. వెలగపూడి, తుళ్లూరులో రైతులు శిబిరంలోనే నిరసన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి నుంచి చిన్న మట్టిపెళ్లను కూడా విశాఖకు తీసుకెళ్లలేరని రైతులు వ్యాఖ్యానించారు.

AP news: ధాన్యం కొనుగోళ్ల లెక్క‌లు అస‌త్యం: దేవినేని

3. మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు : నామా

నీతి, నిజాయితీలకు కట్టుబడే వ్యక్తిత్వం తనదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఇటీవల మధుకాన్‌ కంపెనీపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తన బలం కేసీఆర్ అని.. తన బలగం ఖమ్మం నియోజకవర్గ ప్రజలు అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత 20 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉంటున్నా. 40 ఏళ్ల క్రితం మధుకాన్‌ను స్థాపించా. ఎంతో శ్రమించి కంపెనీని విస్తరించా. మధుకాన్‌ ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చెపట్టింది. దేశ సరిహద్దుల్లో క్లిష్టతర ప్రాంతాల్లో రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. 

4. దేశవ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలు

శ్రీవారి ట్రస్టు ద్వారా దేశవ్యాప్తంగా 500 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే పాలక మండలి సమావేశం అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. వచ్చే 18 నెలల్లోనే కశ్మీర్‌లో స్వామివారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వారణాసి, బాంబేలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తితిదే పరిధిలో ఉన్న ప్రతి ఆలయంలో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 100 ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.

5. Education: అమ్మానాన్నలూ.. పిల్లల్ని ఇలా సిద్ధం చేయండి!

కరోనా వైరస్‌తో మనకెన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. పిల్లల భవిష్యత్తుపై మాత్రం గట్టి దెబ్బే కొడుతోంది. ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థలు సరిగా నడవకపోవడంతో వారు ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. తాత్కాలికంగా చదువుకు దూరమైన చిన్నారులను.. చురుగ్గా ఉంచేందుకు కేంద్ర విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇల్లే మొదటి పాఠశాలంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తుచేసింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. ‘ఇల్లే మొదటి పాఠశాలని, తల్లిదండ్రులే మొదటి గురువులని నేను దృఢంగా భావిస్తాను. ఈ మహమ్మారి వేళ.. పిల్లల ఎదుగుదలలో, నేర్చుకోవడంలో వారిదే కీలక పాత్ర’ అని విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్ నిశాంక్ అన్నారు.

6. ఇకపై ఇన్‌స్టా రీల్స్‌లోనూ ‘యాడ్స్‌’

వినోదాన్నే కాదు.. ఎంతోమందికి ఉపాధిగానూ మారింది ఇన్‌స్టాగ్రామ్‌. తమ ప్రతిభను నలుగురికి చూపై వేదికయింది. రాత్రికి రాత్రి సెలబ్రెటీని చేసే సత్తా ఉన్న మాధ్యమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇంతటి ఆదరణ పొందిన ఈ ఇన్‌స్టాలో రీల్స్‌ ఇప్పటి యూత్‌ ఫేవరేట్‌. నిమిషాల నిడివి ఉన్న వీడియోలు రూపొందించి అప్‌లోడ్‌ చేస్తుంటారు ఇందులో. అయితే ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్‌లోనూ యాడ్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ఇన్‌స్టా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జస్టిన్‌ ఓసోఫ్స్కీ పేర్కొన్నారు. ‘‘యాడ్స్‌కి రీల్స్‌లానే 30 సెకన్ల నిడివి కేటాయించాం. ఇతరులకు షేర్‌ చేసే అవకాశం ఉంటుంది. నచ్చితే కామెంట్‌, లైక్‌ కూడా కొట్టొచ్చు’’ అని ఆయన తెలిపారు.

7. Corona: భౌగోళిక ముప్పుగా డెల్టా వేరియంట్‌

భారత్‌లో మొదట బయటపడిన కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ భౌగోళికంగా ప్రభావం చూపుతోందని, దానికున్న గణనీయంగా ప్రబలే స్వభావమే ఈ పరిస్థితికి కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ శుక్రవారం జెనీవాలో మీడియాకు వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో ప్రతి వారం విడుదల చేసే కొవిడ్‌-19 నివేదికల్లో భాగంగా ఈ నెల 15 నాటి తాజా వివరాల మేరకు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 80 దేశాల్లో డెల్టా వేరియంట్‌ ప్రబలిందన్నారు. మరో 12 దేశాలు, ప్రాంతాల్లో బి.1.617 వేరియంట్‌ బయటపడిందని తెలిపారు. డెల్టా వేరియంట్‌ (బి.1.617.2) మొదట భారతదేశంలోనే గతేడాది అక్టోబరులో బయటపడినట్లు గుర్తు చేశారు.

Mask: ఆ దేశాల్లో మాస్కులు అక్కర్లేదు..!

8. Corona: ఆత్మసంతృప్తి వద్దు.. జాగ్రత్తగా ముందుకెళ్దాం

కొవిడ్ పరిస్థితులను నిశితంగా గమనించి, కార్యకలాపాలను పునఃప్రారంభించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోన్న వేళ.. నిబంధనల విషయంలో సంతృప్తి పడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొవిడ్ ఆంక్షల విధింపు లేక సడలింపు విషయంలో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ సూచించింది.

9. కనీస వేతన నిర్ణయంపై కేంద్రం క్లారిటీ

కనీస వేతనాలు, జాతీయ ప్రామాణిక వేతనాలను నిర్ణయించే విషయంలో జాప్యం చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆలస్యం చేసే ఉద్దేశంతోనే కనీస వేతనాల నిర్ణయానికి నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందంటూ వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టతనిచ్చింది. కనీస వేతన అంశంపై ప్రముఖ ఆర్థికవేత్త అజిత్‌ మిశ్రా నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని కేంద్రం ఇటీవల నియమించింది. దీని పదవీ కాలం మూడేళ్లుగా నిర్దేశించింది. దీంతో వేతన నిర్ణయాన్ని మరింత జాప్యం చేసేందుకే మూడేళ్ల కాలానికి నిపుణుల కమిటీని కేంద్రం నియమించిందంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఓ వర్గం చేస్తున్న మీడియా ప్రచారంగా దీన్ని కేంద్రం కొట్టిపారేసింది. 

10. Milkha singh: రక్తం కక్కాడు.. పతకాలు గెలిచాడు

విజేతల జీవితాల్లో సుఖాలే ఉంటాయని భావిస్తారు. వారు పెట్టి పుట్టారని అనుకుంటారు. ప్రయత్నమే చేయకుండా.. అందరికీ ఆ అదృష్టం ఉండదని నిట్టూరుస్తారు. వారు సాధించే విజయాలు, పతకాలు చూసి.. అబ్బో వారికేంటి! తినడానికి తిండి.. సాధన చేసేందుకు వసతులు ఉంటాయని భ్రమిస్తారు. కానీ విజయం సాధించే ప్రక్రియలో ఎదురైన కష్టాలు.. అనుభవించిన బాధలు.. కార్చిన కన్నీళ్లు.. తగిలిన ఎదురుదెబ్బలు.. గుండెలను పిండేసే ఆర్తనాదాలు ఎవరికీ కనిపించవు. ‘ఫ్లయింగ్‌ సిఖ్’గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్‌ జీవితమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అందుకే ఆయన కోట్లాది మందికి ఆదర్శంగా మారారు. ప్రపంచ క్రీడా పటంలో భారత్‌ను నిలబెట్టారు కాబట్టే ఆయన కన్నుమూస్తే ఇంతగా విలపిస్తున్నారు. 

WTC Final: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని