Top 10 News @ 9PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 20/09/2021 20:57 IST

Top 10 News @ 9PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కెల్విన్‌ వాంగ్మూలం చాల‌దు!

డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్‌పై తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో నిందితులు, సాక్షుల జాబితాలో నటుల పేర్లను చేర్చలేదు. కెల్విన్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో నటుల విచారణను ఎక్సైజ్‌ శాఖ ప్రస్తావించింది. డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీల పాత్రపై బలమైన, తగిన ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. నటులు, హోటల్స్‌, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు డగ్స్‌ అమ్మినట్లు డ్రగ్స్‌ సరఫరాదారు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపింది.

2. సంక్షేమ పథకాల వల్లే గెలిచామనుకోవడం అవివేకం

ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల మందకృష్ణ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ అంబర్‌పేటలోని మందకృష్ణ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఎన్నికలు బహిష్కరించాం. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాల వల్లే గెలిచామని వైకాపా భావించడం అవివేకం. నేరాలు చేయడం సీఎం జగన్‌కు అలవాటైందని చంద్రబాబు విమర్శించారు. 

3. ఆ మహిళకు ఉద్యోగమిచ్చిన కేటీఆర్‌

 ఎమ్మెస్సీ ఫస్ట్‌క్లాస్‌ చదివి జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజనీ సోమవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ‘ఎమ్మెస్సీ ఫస్ట్‌ క్లాస్‌.. ఉద్యోగం స్వీపర్‌’ పేరుతో ఈనాడులో ప్రచురితమైన కథనానికి పలువురు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆమెకు జీహెచ్‌ఎంసీలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఈ విషయాన్ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

4. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటన.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

కరకట్టపై తెదేపా అధినేత చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకే ఎమ్మెల్యే జోగి రమేశ్ వెళ్లారని.. ఇంటిపై దాడికి కాదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు. కరకట్ట ఘటనపై ఎస్పీలు విశాల్ గున్నీ, ఆరిఫ్ హఫీజ్‌తో కలిసి డీఐజీ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేనప్పటికీ కరకట్ట మొదటి భద్రత అంచె వద్దే అడ్డుకున్నామని చెప్పారు. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనంటూ బయట జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. పూర్తి నిరాధారంగా మీడియాలో కథనాలు ప్రసారం చేశారని డీఐజీ వివరించారు.

5. కొత్త ముఖ్యమంత్రికి.. మీటూ ఆరోపణల సెగ!

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కొద్ది గంటలు గడవకముందే చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి జాతీయ మహిళా కమిషన్‌ నుంచి ఊహించని పరిణామం ఎదురయ్యింది. సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌పై మీటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమితులవ్వడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది.

6. ఓపక్క మాట్లాడుతుంటే బైడెన్‌ నిద్రపోయారు..!

ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నిన్న నెతన్యాహూ ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ కొత్త ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్‌ గతనెలలో జోబైడెన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో నెఫ్తాలీ బెన్నెట్‌ మాట్లాడుతుండగా జో బైడెన్‌ నిద్రలోకి జారుకొన్నట్లు ఓ వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఓ ఆంగ్ల వార్త సంస్థ ఆ వీడియోను ఫ్యాక్ట్‌ చెక్‌ చేసింది. అదొక ఫేక్‌వీడియోగా తేల్చింది. కొన్ని క్షణాల పాటు వీడియోను కట్‌చేసి ఎడిట్‌ చేసినట్లు పేర్కొంది.

7. ‘అధికారులున్నది చెప్పులు మోయడానికే’.. ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు!

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఇలాంంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆమె ఈ సారి ప్రభుత్వ అధికారులపై నోరు పారేసుకున్నారు. ‘అధికారులున్నది చెప్పులు మోయడానికే’నంటూ మరో కొత్త వివాదానానికి తెరలేపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓబీసీకి చెందిన పలువురు శనివారం ఉమా భారతిని భోపాల్‌లోని ఆమె నివాసంలో కలిశారు. కులగణన చేపట్టాలని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఉమా భారతి ఈ వ్యాఖ్యలు చేశారు.

8. ‘కనీస బ్యాలెన్స్‌’ ఛార్జీలు.. పీఎన్‌బీకి ఆదాయం ఎంతంటే? 

ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ ఉంచని ఖాతాదారులపై ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ఛార్జీలు విధిస్తోంది. ఈ ఛార్జీలతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ బ్యాంక్‌ దాదాపు రూ.170కోట్ల మేర వసూలు చేసింది. ఈ మేరకు సహ చట్టం ద్వారా వెల్లడైంది. ఛార్జీల రూపంలో బ్యాంకుకు లభించిన ఆదాయంపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సహచట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా.. పీఎన్‌బీ సమాధానమిచ్చింది. 

9. కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంది..కానీ దాని గురించి పట్టించుకోం..

ఫీల్‌గుడ్‌ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌పై ప్రత్యేక ముద్రవేసిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ‘ఆనంద్‌’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్‌’, ‘ఫిదా’ ఇలా ఆయన సినిమాలన్నీ ప్రత్యేకమైన శైలిలో కొనసాగుతాయి.  మరోసారి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య తొలిసారి నటించిన ‘లవ్‌స్టోరి’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మీడియాతో ముచ్చటించారు.

డానియల్‌ శేఖర్‌ విచ్చేశాడు..! 

10. ఈ ఏడాది చివర్లో  టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన

ఈ ఏడాది చివర్లో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఆ దేశంతో ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. దీంతో పాటు వచ్చే ఏడాది జూన్‌ వరకు టీమ్‌ఇండియా ఆడబోయే సిరీస్‌లను బీసీసీఐ ఖరారు చేసింది. నవంబరు 2021 నుంచి జూన్‌ 2022 మధ్యకాలంలో టీమ్‌ఇండియా వివిధ దేశాలతో పద్నాలుగు టీ20, 3 వన్డే,  4 టెస్టు మ్యాచులు ఆడనుంది. మొదటగా న్యూజిలాండ్‌ ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌లో పర్యటించనుంది. రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచుల్లో భారత్‌తో తలపడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌.. వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడనుంది. 

IPL 2021 Live Updates: ఆర్సీబీxకేకేఆర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని