close

ప్రధానాంశాలు

ధోని మెరిసినా.. మురిసింది విరాటే

ఒక్క పరుగు తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం

ధోని వీరోచిత పోరాటం వృథా. ప్లేఆఫ్స్‌    చేరువలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి. ఆశలు మిణుమిణుకుమంటున్న బెంగళూరుకు వరుసగా రెండో విజయం. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో సూపర్‌కింగ్స్‌ను ఓడించింది.

బెంగళూరు

ధోని మెరిసినా.. బెంగళూరుదే మురిపెం. ఆదివారం రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో చెన్నైని ఓడించింది. పార్థివ్‌ పటేల్‌ (53; 37 బంతుల్లో 2×4, 4×6) రాణించడంతో మొదట బెంగళూరు 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ (2/25), జడేజా (2/29) ఆ జట్టును కట్టడి చేశారు. స్టెయిన్‌ (2/29), ఉమేశ్‌ (2/47), సైని (1/24) ధాటికి తడబడిన చెన్నై.. ఛేదనలో 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. అద్భుతంగా పోరాడిన కెప్టెన్‌ ధోని (84 నాటౌట్‌; 48 బంతుల్లో 5×4, 7×6) చెన్నైని దాదాపుగా గెలిపించినంత పనిచేశాడు. చివరి బంతికి ఒక్క పరుగూ రాకపోవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.

ధోని ఒక్కడు..: పెద్దదేమీ కానీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే చెన్నైకి పెద్ద షాక్‌ తగిలింది. పవర్‌ప్లే ముగిసేసరికి 32 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్టెయిన్‌, సైని, ఉమేశ్‌ యాదవ్‌ నిప్పులు చెరిగే బంతులతో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. స్టెయిన్‌ తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో వాట్సన్‌ (5), రైనా (0)ను ఔట్‌ చేయగా.. డుప్లెసిస్‌ (5), జాదవ్‌ (9)లను ఉమేశ్‌ వరుస ఓవర్లలో వెనక్కి పంపాడు. ధోని, రాయుడు (29) వెంటనే మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఇన్నింగ్స్‌ను నిర్మించారు. కానీ పరుగుల వేగం పెరగలేదు. 13వ ఓవర్లో ఉమేశ్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ దంచి జోరందుకున్నట్లు కనిపించిన రాయుడు.. వెంటనే చాహల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 83. సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. చివరి ఆరు ఓవర్లలో 76 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధోని ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. వేగంగా పరుగులు రాలేదు. మరోవైపు నుంచి జడేజా (11), బ్రావో (5) ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు చేయాల్సిన స్థితిలో చెన్నై ఓటమి లాంఛనమే అనిపించింది. కానీ ఉమేశ్‌ బౌలింగ్‌లో విధ్వంసక విన్యాసాలతో విరుచుకుపడ్డ ధోని.. బెంగళూరుకు చెమటలు పట్టించాడు. చెన్నైని విజయపు అంచుల దాకా తీసుకెళ్లాడు. కానీ చివరికి చెన్నైకి నిరాశ తప్పలేదు.

రాణించిన పార్థివ్‌: మొదట చెన్నై బౌలర్లు కట్టుద్టిమైన బౌలింగ్‌తో బెంగళూరుకు కళ్లెం వేశారు. పార్థివ్‌ పటేల్‌ మినహా ఏ బ్యాట్స్‌మెనూ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన బెంగళూరు.. 11 పరుగులకే ఓపెనర్‌ కోహ్లి (9; 8 బంతుల్లో 2×4) వికెట్‌ను చేజార్చుకున్నప్పటికీ డివిలియర్స్‌ (25; 19 బంతుల్లో 3×4, 1×6), పార్థివ్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి 49 పరుగులు చేసింది. ఐతే జోరు మీదున్న డివిలియర్స్‌ను ఔట్‌ చేసి జడేజా ఆ జట్టును దెబ్బతీశాడు. ఆ తర్వాత స్కోరు వేగం తగ్గింది. ఏ దశలోనూ బెంగళూరు ఇన్నింగ్స్‌ జోరందుకోలేదు. పార్థివ్‌ పటేల్‌.. అక్షదీప్‌ (24; 20 బంతుల్లో 1×4, 1×6)తో మూడో వికెట్‌కు 35 బంతుల్లో 41, స్టాయినిస్‌ (12)తో నాలుగో వికెట్‌కు 18 బంతుల్లో 25 జోడించి వెనుదిరిగాడు. ఆఖర్లోనూ బెంగళూరు స్కోరు వేగం పెరగలేదు. మొయిన్‌ అలీ (26; 16 బంతుల్లో 5×4) కాస్త బ్యాటు ఝుళిపించడంతో స్కోరు 161కి చేరుకుంది. చివరి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకున్న బెంగళూరు 43 పరుగులు చేసింది.

అంతలా కొట్టి.. ఆఖరి బంతికి ప్చ్‌! 

6 బంతుల్లో 26 పరుగులు.. ఎలాంటి బ్యాట్స్‌మన్‌కైనా ఈ సమీకరణం కష్ట సాధ్యమే! ఒకప్పటి ధోని మీద అయితే ఆశలు పెట్టుకోవచ్చు కానీ.. ఈ మధ్య అతడిలో మునుపటి ఊపు కనిపించని నేపథ్యంలో ఛేదన అసాధ్యం లాగే అనిపించింది! కానీ ధోని అనూహ్య రీతిలో చెలరేగిపోయాడు. చెన్నైని విజయపుటంచుల దాకా తీసుకెళ్లాడు. ఇక చెన్నై గెలుపు లాంఛనమే అనుకునేలా చేశాడు. కానీ ఆఖరి బంతికి ఊహించనిది జరిగింది. మ్యాచ్‌ బెంగళూరు వశమైంది. ఓవర్‌ తొలి బంతికి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టిన ధోని.. రెండో బంతిని పుల్‌ చేస్తూ మిడ్‌వికెట్‌ దిశగా స్టేడియం అవతల పడేలా కొట్టడం విశేషం. బంతి ఏకంగా 111 మీటర్లు ప్రయాణించిందంటే ధోని ఎంత బలంగా, కసిగా ఆ బంతిని కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఈ షాట్‌తో ధోని ఆత్మవిశ్వాసం రెట్టింపై.. తర్వాతి బంతికి కూడా సిక్సర్‌ అందుకున్నాడు. ఈసారి లాంగాఫ్‌లో బంతి బౌండరీ దాటింది. నాలుగో బంతికి రెండు పరుగులు రావడంతో చివరి 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో ఉమేశ్‌ ఓ చెత్త బంతి వేశాడు. యార్కర్‌ కోసం ప్రయత్నించాడో ఏమో కానీ.. అది ధోని కాళ్ల మీదికి పుల్‌టాస్‌లా వచ్చింది. అతను అలవోకగా మిడ్‌వికెట్‌, స్క్వేర్‌ లెగ్‌ మధ్యలో సిక్సర్‌ బాదేశాడు. ఒక బంతికి 2 పరుగులు చేస్తే చాలు. 5 బంతుల్లో 24 పరుగులు చేసిన వాడికి ఇదో లెక్కా? ఇంకేముంది చెన్నై విజయం లాంఛనమే అనిపించింది. కానీ మధ్యలో డివిలియర్స్‌తో మంతనాలు జరిపిన ఉమేశ్‌.. ఈసారి వేగం తగ్గించి ఆఫ్‌ స్టంప్‌ ఆవల లెంగ్త్‌ బాల్‌ వేశాడు. ధోని దాన్ని పాయింట్‌ వైపు కట్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. పరుగు తీసే ప్రయత్నం చేశాడు. వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ బంతిని అందుకుని వికెట్లకు డైరెక్ట్‌ త్రో వేసేశాడు. అవతలి ఎండ్‌ నుంచి వచ్చిన శార్దూల్‌.. డైవ్‌ చేసినా ఫలితం లేకపోయింది. స్వల్ప తేడాలో అతను రనౌటైపోయాడు. పరుగు పూర్తయితే మ్యాచ్‌ టై అయ్యేది. సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చేది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: పార్థివ్‌ పటేల్‌ (సి) వాట్సన్‌ (బి) బ్రావో 53; కోహ్లి (సి) ధోని (బి) చాహర్‌  9; డివిలియర్స్‌ (సి) డుప్లెసిస్‌ (బి) జడేజా 25; అక్ష్దీప్‌ (సి) డుప్లెసిస్‌ (బి) జడేజా 24; స్టాయినిస్‌ (సి) షోరే (బి) తాహిర్‌ 14; మొయిన్‌ అలీ (సి) ఠాకూర్‌ (బి) బ్రావో 26; నేగి (సి) రాయుడు (బి) చాహర్‌ 5; ఉమేశ్‌ యాదవ్‌ నాటౌట్‌ 1; స్టెయిన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161; వికెట్ల పతనం: 1-11, 2-58, 3-99, 4-124, 5-126, 6-150, 7-160; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-25-2; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-40-0; జడేజా 4-0-29-2; డ్వేన్‌ బ్రావో 4-0-34-2; ఇమ్రాన్‌ తాహిర్‌ 4-0-31-1

చెన్నై సూపర్‌ కింగ్స్‌: వాట్సన్‌ (సి) స్టాయినిస్‌ (బి) స్టెయిన్‌ 5; డుప్లెసిస్‌ (సి) డివిలియర్స్‌ (బి) ఉమేశ్‌ 5; రైనా (బి) స్టెయిన్‌ 0; రాయుడు (బి) చాహల్‌ 29; జాదవ్‌ (సి) డివిలియర్స్‌ (బి) ఉమేశ్‌ 9; ధోని నాటౌట్‌ 84; జడేజా రనౌట్‌ 11; బ్రావో (సి) పార్థివ్‌ (బి) సైని 5; శార్దూల్‌ ఠాకూర్‌ రనౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160; వికెట్ల పతనం: 1-6, 2-6, 3-17, 4-28, 5-83, 6-108, 7-136, 8-160; బౌలింగ్‌: స్టెయిన్‌  4-0-29-2; సైని 4-0-24-1; ఉమేశ్‌ యాదవ్‌ 4-0-47-2; నేగి 1-0-7-0; స్టాయినిస్‌ 3-0-20-0; చాహల్‌ 4-0-24-1Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net