close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. అంతర్‌ రాష్ట్ర సరిహద్దులను మూసివేయండి: కేంద్రం

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక తమ సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్న వలస కూలీలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ, కూలీలు రాష్ట్రాలు, నగరాలు దాటకుండా సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో 11 గంటల వరకే నిత్యావసరాలు

కరోనా వ్యాప్తి నివారణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలు బయట తిరిగేందుకు ఇచ్చిన సమయాన్ని తగ్గించారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఇచ్చిన అనుమతి కొనసాగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తికి అడ్డంకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రంగంలోకి ఇస్రో..!

కరోనావైరస్‌పై పోరాటంలో దేశానికి మద్దతుగా ఉండేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది. తేలిగ్గా ఆపరేట్‌ చేసే విధంగా ఉండే వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి సహకరించనుంది. ప్రస్తుతం దేశంలో అత్యవసరమైన పరికరాల తయారీకి తోడ్పాటునందించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ వెల్లడించారు. ప్రస్తుతం విక్రమ్‌సారాభాయ్‌ స్పేస్‌సెంటర్‌లోని ఏ వ్యక్తి కూడా కొవిడ్ బారిన పడలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘మేం దాదాపు 1,000 లీటర్ల శానిటైజర్లను తయారు చేశాం. మా ఉద్యోగులు మాస్కులను తయారు చేస్తున్నారు. మా కమ్యూనికేషన్స్‌ కంప్యూటర్లు అత్యంత సురక్షితమైనవి. అవసరమైతే మా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తారు. అవసరమైనప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు పెడతాం’’ అని సోమ్‌నాథ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళం

4. పరిశోధనలు జరుగుతున్నాయి.. వ్యాక్సిన్‌ వచ్చి తీరుతుంది

ప్రస్తుత పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు పాటించడమే కరోనా వైరస్‌ నివారణకు సరైన మార్గమని ‘ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ’ ఛైర్మన్‌, ప్రముఖ వైద్య నిపుణులు జి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ‘‘ప్రాథమిక స్థాయి వ్యాక్సిన్లు ఇప్పటికే తయారయ్యాయి. ఆర్‌ఎన్‌ఏతో తయారు చేసే వ్యాక్సిన్‌ కావడం వల్ల ఎక్కువ సమయం పడుతోంది. దీన్ని వెంటనే విచ్చల విడిగా ప్రజల్లో ఉపయోగించలేం. ఎందుకంటే వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నిర్ధారించుకుని.. నయం చేయగలిగే సామర్థ్యాన్ని బట్టి వినియోగంలోకి తెస్తాం.  కచ్చితంగా వ్యాక్సిన్‌ వచ్చి తీరుతుంది’’ అని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హీరో నితిన్‌ వివాహం వాయిదా

యువ కథానాయకుడు నితిన్‌ పెళ్లి వాయిదా పడింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఏప్రిల్ 16న జరగాల్సిన తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇటీవల తన ప్రేయసి షాలినితో నితిన్‌ నిశ్చితార్థం జరిగింది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఆయన సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరించడంతో పెళ్లికి సరైన సమయం కాదని నిర్ణయించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాష్ట్రాన్ని వదిలి వెళ్లకండి : ఉద్ధవ్‌ ఠాక్రే

‘రాష్ట్రాన్ని వదిలి వెళ్లకండి..’ అంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వలస కార్మికులకు విజ్ఞప్తి చేశారు.  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న ఈ సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరారు. వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రెవెన్యూ, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. వలస కార్మికులకు ఏదైనా సహాయం అవసరమైతే.. స్థానిక అధికారులు, జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సరిగ్గా నాలుగేళ్లకు ‘డబుల్‌ ట్రిపుల్‌ ధమాకా’

 వీరేందర్‌ సెహ్వాగ్‌.. టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ స్థానానికి వన్నె తెచ్చిన బ్యాట్స్‌మన్‌. ముల్తాన్‌లో పాకిస్థాన్‌ బౌలర్లకు దడపుట్టించినా.. చెన్నైలో దక్షిణాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించిన అది అతడికే చెల్లింది. భారత జట్టు తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడమే కాక రెండుసార్లు ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌‌. ఈ రెండు ట్రిపుల్‌ శతకాలు సరిగ్గా నాలుగేళ్ల వ్యవధిలో ఒకే రోజు నమోదవ్వడం విశేషం. అది కూడా ఈ రోజే. ఈ సందర్భంగా నాటి విశేషాలు మీ కోసం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘మహానుభావుడు’ స్టిల్స్‌తో శర్వాసందేశం

తాను కథానాయకుడిగా నటించిన ‘మహానుభావుడు’ స్టిల్స్‌తో టాలీవుడ్‌ యువ హీరో శర్వానంద్‌ వినూత్నంగా సందేశాన్నిచ్చారు.  ఆదివారం ట్విటర్‌లోకి అడుగుపెట్టిన శర్వానంద్‌.. తన అధికారిక ఖాతా నుంచి కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తూ పలు ట్వీట్లు పెట్టారు. అయితే ఆయన చెప్పాలనుకున్నా విషయాన్ని తన ‘మహానుభావుడు’ సినిమాలోని స్టిల్స్‌ను పోలిన కార్టూన్స్‌తో చాలా విభిన్నంగా చెప్పారు. ‘మన ప్రపంచం, మన దేశం, మన ప్రజల కోసం ప్రతి ఒక్కరం ‘మహానుభావుడు’గా మారదాం’ అని శర్వా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆమే కరోనా ‘పేషెంట్‌ జీరో’..!  

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్‌ బారిన పడిన మొట్టమొదటి పేషెంట్‌గా భావిస్తున్న వ్యక్తి ఆచూకీని ఎట్టకేలకు కనుగొన్నారు. ఈ వైరస్‌ ఇప్పుడు మహమ్మారిగా మారి దాదాపు 30వేల మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఆంగ్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈమె ఆచూకీని కనుగొంది. నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చిన్నపాటి తప్పు.. తప్పదు వైరస్‌ ముప్పు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినా ప్రజలు మాత్రం దీని తీవ్రతను గుర్తించడం లేదు. కొందరు బాధ్యతగా వ్యవహరించినా చాలామంది ఇష్టారాజ్యంగా వీధుల్లో తిరుగుతున్నారు. బయటకు వచ్చినా సరిగా సామాజిక దూరం పాటించడం లేదు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని వైరస్‌ వ్యాప్తిపై ఎంత అవగాహన కల్పించినా ఇంకా భయం లేనట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. మాకు ఎందుకొస్తుందనే ధీమాలో ఉన్నారు. వీటికి సంబంధించిన చిత్రాలు మీ కోసం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.