
తాజా వార్తలు
అరచేతులు మృదువుగా మారాలంటే...
నా అరచేతులు చాలా గరుగ్గా ఉంటాయి. ఇంట్లో పాత్రలను శుభ్రం చేయడం వల్ల ఇలా మారాయా? అరచేతులు మృదువుగా మారాలంటే నేనేం చేయాలి?
- ఓ సోదరి
అరచేతులు గరుగ్గా ఉండటానికి అనేక రకాల కారణాలుంటాయి. శీతాకాలంలో కొందరు ఎలక్ట్రిక్ డ్రయ్యర్ కింద చేతులు పెడుతుంటారు. ఇలాచేయడం వల్ల మరింతగా పొడిబారతాయి. అలాగే ఒత్తిడికి గురికావడమూ కారణమే. చేతులను ఎక్కువగా తడపకూడదు. పాత్రలు తోమేటప్పుడు తప్పనిసరిగా గ్లవుజులు వేసుకోవాలి. ఎండలో ఎక్కువ సేపు ఉండాల్సివస్తే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. తడిగా ఉన్న చేతులను టిష్యూ పేపర్‌తో తుడుచుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ తగినన్ని మంచినీళ్లు తాగాలి. సబ్బు తక్కువగా వాడి, తరచూ కొబ్బరినూనె రాయడం వల్ల కూడా అరిచేతులు మృదువుగా మారతాయి.
ఇలా చేయొచ్చు: రెండు చెంచాల ఆలివ్‌నూనెలో చెంచా పంచదార కలిపి అరచేతులకు రాసుకుని బాగా రుద్దాలి. తరువాత కడిగి మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఓట్స్ పొడిని ఆలివ్‌నూనెలో కలిపి పేస్టులా చేయాల్ని. ఈ మిశ్రమాన్ని రాసుకుని పది నిమిషాల తరువాత కడిగితే చేతులు మృదువుగా మారతాయి.
చికిత్స: ఎగ్జిమా, సొరియాసిస్ ఉంటే శీతాకాలంలో అరిచేతులు గరుగ్గా మారి ఒక్కోసారి చిన్నపాటి రక్తస్రావం అయ్యే ప్రమాదమూ ఉంది. అలాంటప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదిస్తే తగిన మందులు సూచిస్తారు. అరిచేతులు బాగా ఎరుపెక్కినా, పగుళ్లు ఏర్పడి రక్తస్రావమైనా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.