close

తాజా వార్తలు

Published : 22/03/2020 00:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెట్టుబడి కోలుకుంటుందా?

* ప్రస్తుతం మార్కెట్‌ కనిష్ఠ స్థాయుల్లోకి వచ్చింది కదా.. నేను కొత్తగా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. నా దగ్గర రూ.1,50,000 ఉన్నాయి. వీటితోపాటు నెలకు రూ.10,000 పెట్టుబడి పెట్టాలన్నది నా ఆలోచన. ఇప్పుడు సరైన సమయమేనా? నా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి?

- శ్రీకృష్ణ

* మార్కెట్లు దాదాపు కనిష్ఠ స్థాయులకు చేరినా.. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచన అభినందనీయం. ఇప్పుడు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో మంచి లాభాలు చేకూర్చే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో రూ.75,000లను ఈక్విటీ డైవర్సిఫైడ్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. ఇక్కడ నుంచి మార్కెట్‌ మరికొంత పడితే.. మిగతా మొత్తాన్ని మదుపు చేయండి. దీనికి మీరు యాక్సిస్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఈక్విటీ ఫండ్‌, కొటక్‌ ఈక్విటీ ఆపర్చునిటీస్‌ ఫండ్‌, మిరే అసెట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. భవిష్యత్తులో మార్కెట్‌ మరింత పతనమైనా.. మరికొంత మదుపు చేయొచ్చు. కనీసం 7-10 ఏళ్లపాటు అక్కర్లేని డబ్బునే మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. నెలకు మదుపు చేయాలనుకుంటున్న రూ.10,000లను కనీసం నాలుగు ఫండ్లలో రూ.2,500 చొప్పున మదుపు చేయండి.
* గత ఏడేళ్లుగా ఫండ్లలో మదుపు చేస్తున్నాను. చెప్పుకోవడానికి పెద్ద ఫండ్లే అయినప్పటికీ.. రాబడి బాగా తగ్గిపోయింది. కొన్ని ఫండ్లు పెట్టుబడితో సమానం అయ్యాయి. ఇప్పుడు నేనేం చేయాలి?

- రాజు

* మార్కెట్లో భయాందోళనలు ఉన్నప్పుడు పెద్దవి, చిన్నవి, మంచివి, చెడ్డవి అనే తేడా లేకుండా అన్ని ఫండ్లలోనూ రాబడి తగ్గిపోతుంది. మార్కెట్‌ సూచీల్లో గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతం వరకూ దిద్దుబాటు వచ్చింది. దీనివల్ల మీ పెట్టుబడిపైన రాబడి తగ్గింది. మీ పోర్ట్‌ఫోలియోను సరిగ్గా గమనించి, అందులో సరైన రాబడిని అందించని, పనితీరు బాగాలేని వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి. మీకు డబ్బు అవసరం లేకుంటే వేచి ఉండండి. ప్రస్తుత ఇబ్బందుల నుంచి కోలుకుంటే.. మార్కెట్లు తిరిగి వృద్ధి చెందుతాయి. ఇలాంటి సందర్భాలు మార్కెట్లో సహజంగా వస్తుంటాయి. కాబట్టి, పెట్టుబడి ఎప్పుడూ వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీలతోపాటు, డెట్‌ ఫండ్లలోనూ మదుపు చేయాలి. డబ్బు అవసరమైనప్పుడు డెట్‌ ఫండ్ల నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. అందుబాటులో నగదు ఉన్నప్పుడు ఈక్విటీ పెట్టుబడులను పెంచుకోవచ్చు.

* మా అబ్బాయి వయసు 4 ఏళ్లు. అతని పేరుమీద ఏదైనా మదుపు చేయాలన్నది మా ఆలోచన. పదేళ్ల తర్వాత ఏడాదికి కొంత మొత్తం వెనక్కి వచ్చేలా ఉండాలి. నెలకు రూ.8వేల వరకూ కేటాయించగలం.

- రమ్య

* మీ అబ్బాయి పేరుపై మదుపు చేసే బదులు.. మీ పేరుపైనే పెట్టుబడి పెట్టండి. దీనికి మీరు హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ అండ్‌ డెట్‌ ఫండ్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఈక్విటీ హైబ్రీడ్‌ ఫండ్‌, ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రీడ్‌ ఫండ్లను ఎంపిక చేసుకోవచ్చు. మీరు రూ.8,000లను పదేళ్లపాటు మదుపు చేస్తే.. దాదాపు 11శాతం రాబడి అంచనాతో.. రూ.16,05,312 అయ్యేందుకు అవకాశం ఉంది. మీకు డబ్బు కావాలనుకున్నప్పుడు మీ అవసరాలను బట్టి, డబ్బు వెనక్కి తీసుకునే సౌకర్యం ఉంది.
 * మా అమ్మగారు ఇటీవలే పదవీ విరమణ చేశారు. తన దగ్గరున్న రూ.4లక్షలను ఎక్కడైనా మదుపు చేసి, నెలనెలా ఆదాయం పొందాలని అనుకుంటున్నాం. దీనికోసం సురక్షితంగా ఉండే పెట్టుబడిని సూచించండి.

- మాధవ్‌

* మీ డబ్బు సురక్షితంగా ఉంటూ.. మంచి రాబడి కావాలనుకుంటే.. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో 8.6శాతం వడ్డీ ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి రూ.8,600 వడ్డీని వస్తుంది. కనీసం ఐదేళ్లపాటు కొనసాగించాలి. ఆ తర్వాత అవసరమైతే.. డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. లేదా మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు.

- తుమ్మ బాల్‌రాజ్‌, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని