close
Array ( ) 1

తాజా వార్తలు

వైద్యానికి ఒక్క పైసా తీసుకోలేదు!

రోగిని, వారి బంధువుల మనోభావాలను గౌరవించాలనేది నా దృక్పథం. వాళ్లు తెలివితక్కువవాళ్లనుకోవడం భ్రమ. ప్రతి ఒక్కరికి వారి జబ్బు గురించి, చికిత్స గురించి చెప్పడం వైద్యుడి కర్తవ్యం.

ఆయన దేశంలోనే అగ్రగణ్య డాక్టర్‌. కావాలంటే కాసుల సంపాదనకు కొదవ లేదు. కానీ సంపాదన వద్దనుకొని సమాజం వైపు చూశారాయన. ప్రధాన వైద్యవృత్తిని వదిలి.. ప్రజారోగ్యం వైపు అడుగేశారు. జబ్బులకు చికిత్స చేయటం కన్నా అసలు జబ్బులు రాకుండా చూడటమే ముఖ్యమని తలచారు. గ్రామీణ భారతావనిని ఆరోగ్య భారతావనిగా చూడాలని సంకల్పించి.. దేశవ్యాప్తంగా ఆరోగ్య విధానాల్లో మార్పులకు శ్రీకారం చుడుతున్న ఆ తెలుగుతేజమే పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.శ్రీనాథరెడ్డి. భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షుడిగా దేశంలో ప్రాథమిక వైద్యం బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు నడుస్తున్న ఆయన ‘హాయ్‌’తో పంచుకున్న ముచ్చట్లు.
* బాగా డబ్బులు సంపాదించే కార్డియాలజీని వదిలి ప్రజారోగ్యంలోకి వచ్చారెందుకు?
ప్రధాన వైద్యవృత్తిని వదిలేసి ప్రజారోగ్య రంగంలోకి వచ్చి దాదాపు 12 ఏళ్లు అవుతోంది. చాలామంది అడిగారు... ‘నువ్వు గుండె వైద్య విభాగానికి అధిపతివి కదా.. ఎందుకు అంత ముఖ్యమైన, గుర్తింపు వచ్చే పనిని వదిలేస్తున్నావు’ అని. నాకు మొదట్నించి సామాజిక పరిస్థితుల పట్ల ఆసక్తి ఎక్కువ. మొదట్లో గుండె రుమాటిక్‌ కవాటాల జబ్బుపై ఎక్కువగా పనిచేశాను. దీంతో పేదవాళ్లు ఎక్కువగా బాధపడుతుండటం కలచివేసింది. దీనిపై పరిశోధనలు కూడా చేశాను. హరియాణాలోని కొన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు కొందరు యుక్తవయసు మహిళలు పేదరికంతో బాధపడుతూ గుండెజబ్బులకు గురవటం ప్రత్యక్షంగా చూశాను. మనదేశంలో పేదలు చికిత్స అనంతరం మందులు కొనలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు పొగాకు విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీనిపైనా పరిశోధన చేశాను. జబ్బు వచ్చాక చికిత్స చేయడం కన్నా రాకముందే నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యమని గ్రహించాను. ఇందుకు ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండటం అవసరం. అందుకే ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేయాలని నిశ్చయించుకున్నాను. ఇది నాకు చాలా సంతృప్తి నిచ్చింది. అలాగని వైద్యవృత్తికి పూర్తిగా దూరమేమీ కాలేదు. ఎవరైనా రెండో అభిప్రాయం కోసం వచ్చినప్పుడు ఇప్పటికీ కొద్దిమంది రోగులను చూస్తుంటాను. ఇన్నేళ్ల నా వైద్యవృత్తిలో ఎప్పుడూ ఎవరి దగ్గరా డబ్బు తీసుకున్నదే లేదు.
* డాక్టర్‌గా రోగులతో ఎలా వ్యవహరించేవారు?
మొదట్నించీ నాకు రోగులు, వారి కుటుంబ సభ్యులతో సమస్య గురించి చర్చించడం అలవాటు. నేను వైద్యున్ని.. నాకు అంతా తెలుసు.. నేను చెబుతున్నాను వినూ.. అనే ధోరణి కాదు నాది. చదువుకున్న వారికైనా, చదువుకోనివారికైనా వీలైనంత వరకూ ఆకళింపు కలిగించటానికే ప్రయత్నిస్తాను. జబ్బు గురించే కాదు.. చికిత్సలో ఎలాంటి విధానాలున్నాయో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ఫలితాలేంటో కూడా వివరిస్తాను. దీంతో నిర్ణయం తీసుకోవడంలో వాళ్లూ భాగస్వాములవుతారు. ఇది చాలా అవసరం కూడా. రోగిని, వారి బంధువుల మనోభావాలను గౌరవించాలనేది నా దృక్పథం. వాళ్లు తెలివితక్కువవాళ్లనుకోవడం భ్రమ. ప్రతి ఒక్కరికి వారి జబ్బు గురించి, చికిత్స గురించి చెప్పడం వైద్యుడి కర్తవ్యం. అలా భావించినపుడు ప్రతి రోగీ ప్రత్యేకంగానే కనిపిస్తాడు. కాబట్టి బోర్‌ కొట్టే సమస్యే లేదు.
* జబ్బుల పరంగా సంపన్నులు, పేదల్లో ఏమైనా తేడాలు గమనించారా?
డబ్బున్నవాళ్లు జీవనశైలి జబ్బుల బారినపడకుండా కొంత జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ పేదల్లో అంత  అవగాహన ఉండటం లేదు. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కొనలేని వారు ఎందరో. నాణ్యమైన నూనెను వాడుకునే పరిస్థితుల్లేవు. పొగాకు వాడకం పేదల్లో బాగా పెరిగింది. ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లు వీరిలోనూ పెరిగిపోయాయి. వాతావరణ కాలుష్యానికి ఎక్కువగా గురయ్యేది పేదలు, మధ్యతరగతి వర్గాలే. దీంతో ఈ వర్గాలు జీవనశైలి వ్యాధుల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోంది.
* అందుకనుగుణంగా మన వైద్యం ఉందా మరి?
ఒకప్పుడు ప్రాథమిక వైద్యమంటే జ్వరమొస్తే మందు వేయడం, దెబ్బ తగిలితే కట్టుకట్టడం మాత్రమే. ఇప్పుడా పరిస్థితి మారింది. గ్రామాల్లోనూ అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి జీవనశైలి వ్యాధుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. కాబట్టి గ్రామీణ వైద్యసేవల దృక్పథంలో మార్పు రావాలి. ముందుగా చేయాల్సింది ప్రాథమిక సేవలను పటిష్ఠం చేయటం. వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. గ్రామాల్లో వైద్యులు పనిచేయటానికి వీలుగా మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి. అయితే పూర్తిగా వైద్యుల మీదే ఆధారపడాల్సిన పనిలేదు. నర్సులు, సామాజిక ఆరోగ్య కార్యకర్తల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వీరికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ప్రాథమిక వైద్యసేవలందించొచ్చు.
* విద్యార్థి దశలో రాజకీయాలపై ఆసక్తిగా ఉండేవారట?
కళాశాల దశలో విద్యార్థి రాజకీయాల్లో, ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఆసక్తి మాత్రం ఉండేది. నేను మొదట్నించి కూడా సోషలిస్టు భావాలతో పెరిగాను. అలాంటి సమావేశాల్లో ప్రధానంగా ప్రసంగాలు చేసేవాడిని. ప్రచార పత్రాలను రాసిచ్చేవాడిని. వియత్నాం యుద్ధంపై జరిగిన ఒక సమావేశంలో నన్ను కూడా పిలిచారు. ఆ సమావేశానికి కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్యగారిని కూడా ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను తెలుగులో ఉపన్యాసమిచ్చాను. ఆ తర్వాత సుందరయ్యగారు వెళ్లి మా నాన్నతో.. ‘నీకంటే మీ అబ్బాయే బాగా మాట్లాడుతున్నాడు’ అని చెప్పారు. అంతర కళాశాల వక్తృత్వ పోటీల్లో నేను చాలా సార్లు బహుమతులు పొందాను.

* పిల్లలకు కుటుంబ విలువలను నేర్పించడమెలా?
సమాజంలో ఒకరిపై మరొకరు ఆధారపడక తప్పదు. తోటి వ్యక్తుల అవసరాలు, బాధలపై స్పందించాలి. పెద్దవాళ్లను చూసే పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటారు. అయితే తల్లిదండ్రులు మార్గదర్శకులుగా ఉండాలే తప్ప పిల్లలను పూర్తిగా నియంత్రించటం తగదు. ప్రతి పిల్లాడికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని గౌరవించాలి. అలా అని గాలికి వదిలేయొద్దు. సున్నితత్వానికి భంగం కలగకుండా స్నేహితులుగా మెలగాలి.
* అన్ని విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి మొదట్నించీ ఉందా?
ఈ అలవాటు నాకు చిన్నప్పట్నించే ఉంది. కొన్ని విలువలు అమ్మానాన్నల నుంచి అబ్బాయి. ఇంట్లో నేనొక్కడినే పిల్లాడిని. నాకు అర్థమైనా కాకపోయినా పెద్ద పెద్ద పుస్తకాలు చూస్తూ, తిరగేస్తూనే పెరిగాను. కొన్నాళ్లు మా పెదనాన్న గారి దగ్గర నెల్లూరులో ఉన్నాను. సాధారణంగా పిల్లలు చందమామ, బొమ్మరిల్లు వంటి పుస్తకాలు చదివేవారు. కానీ నేను అక్కడ శరత్‌చంద్ర, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, గోర్కీ వంటి రచయితల అనువాద పుస్తకాలు చదువుతూ వచ్చాను. నాకు తెలియకుండానే సాహిత్యం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే అభిరుచి పెరిగాయి.
* బాల్యంలో గమ్మత్తు
నెల్లూరులో మా పెద్దనాన్నగారింట్లో ఉంటున్నప్పుడు వీధి చివరి బడిలో చేర్పించారు. అది తెలుగు మీడియం పాఠశాల. నేనసలు బడికి వెళ్లేవాడిని కాదు. మా పెదనాన్నగారూ ఏమీ అనేవారు కాదు. పెదనాన్నగారి పిల్లలకు ఇంట్లో ప్రైవేటు పాఠాలు చెబుతుంటే మధ్య మధ్యలో వినేవాణ్ని. తర్వాత మా కుటుంబమంతా హైదరాబాద్‌కు వచ్చేసింది. అప్పుడు నాకు 8 ఏళ్లు. తరగతులకు హాజరు కాకపోయినా నాలుగో తరగతి ఉత్తీర్ణుడైనట్లుగా ధ్రువపత్రం తీసుకొచ్చి హైదరాబాద్‌లో సెయింట్‌ పాల్స్‌ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతిలో చేర్పించారు. ఇక్కడ ఆంగ్ల మాధ్యమం. పైగా హిందీ మొదటి భాష. తెలుగు రెండో భాష. నాకు ఇంగ్లిషు కూడా సరిగ్గా రాదు. హిందీ అయితే ఒక్క ముక్కా అర్థం కాదు. నెల తర్వాత ప్రిన్సిపల్‌ గారు మా అమ్మను పిలిచారు. ‘మీ అబ్బాయి అసలు కుదురుకోలేకపోతున్నాడు. ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. మూడో తరగతికి పంపించాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ఐదు నుంచి మూడులోకి పంపిస్తే.. అబ్బాయిలో విశ్వాసం సన్నగిల్లుతుంది. కొద్దిరోజులు అవకాశమివ్వండి. అప్పటికీ కుదురుకోకపోతే తెలుగు మీడియం పాఠశాలలో వేస్తానని మా అమ్మ చెప్పారు. ఇక అప్పట్నించి అమ్మ నాపై ప్రత్యేక శ్రద్ధపెట్టి సాయంత్రం ఆసుపత్రి నుంచి రాగానే నాతోనే కూర్చొని చదువు చెప్పారు. రెండు నెలలు గడిచాక తొలి త్రైమాసిక పరీక్షల్లో నాకు మూడో ర్యాంకు వచ్చింది. తర్వాత మా ప్రిన్సిపల్‌ అమ్మను పిలిచి.. ‘రెండునెలల్లో ఇంత పురోగతి ఏ విద్యార్థిలోనూ చూడలేదు. నేను డబుల్‌ ప్రమోషన్‌ ఇవ్వబోతున్నాను’ అని ఆరో తరగతిలోకి పంపించారు. అంటే నా రెగ్యులర్‌ స్కూలింగ్‌ మొదలైంది ఆరో తరగతితోనే అన్నమాట. అప్పట్లో పొట్టిగా ఉండేవాడిని. అందుకే నేను మొదటి బెంచీలో కూర్చునేవాడిని. వెనుక బెంచీలో కూర్చునేవాడు నా చొక్కాపై బొమ్మలేసేవాడు. అందుకే కాలేజీకి వెళ్లాక ఆఖరి బెంచీలో కూచోవటం మొదలెట్టా.


* పిల్లల్లో కొత్త విషయాల పట్ల ఆసక్తి, కుతుహలాన్ని కలిగించాలంటే ఏం చేయాలి?
పిల్లల్లోని సహజసిద్ధమైన ఆసక్తిని, కుతుహలాన్ని చంపేయకూడదు. వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలివ్వాలి. ప్రశ్నలడిగే విధంగా ప్రోత్సహించాలి. పిల్లాడు అడిగేది చొప్పదంటూ ప్రశ్నే అయి ఉండొచ్చు. కానీ ఆ ప్రశ్న అడిగే హక్కు పిల్లాడికి ఉందని పెద్దలు గుర్తించాలి. తల్లిదండ్రులతో కలిసి అన్ని విషయాలు మాట్లాడుకునేలా సహృదయ వాతావరణం ఉండేలా చూసుకోవటం ముఖ్యం. ఇప్పుడు వీడియో, కంప్యూటర్‌ ఆటలతోనే పిల్లలకు కాలం గడిచిపోతుంది. పాఠ్య పుస్తకాలు మాత్రమే కాదు.. ఇతరత్రా సాహిత్య పుస్తకాలను చదవడం పిల్లలకు అలవాటు చేయించాలి. దీంతో పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది.

* పీవీ, మన్మోహన్‌లతో మీ అనుభవాలు?
పీవీ నర్సింహ్మారావు గారికి వ్యక్తిగత వైద్యుడిగా, మన్మోహన్‌సింగ్‌ హయాంలో వైద్యుల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించాను. ఇద్దరూ స్థితప్రజ్ఞులే. పీవీలో సున్నితమైన హాస్యచతురత ఉండేది. మన్మోహన్‌గారు సౌమ్యుడు, నిరాడంబరుడు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి ఆయనకు నుదిటికి దెబ్బ తగిలింది. ఎయిమ్స్‌ వైద్యులు చికిత్స చేశారు. గాయం నయమైందా లేదా అని చూడ్డానికి అప్పటి ఎయిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ వేణుగోపాల్‌ వచ్చారు. ఒక గదిలో నేను, వేణుగోపాల్‌, మన్మోహన్‌సింగ్‌ కూర్చున్నాం. నా పక్కన, మన్మోహన్‌ పక్కన చిన్న స్టూళ్లు ఉన్నాయి. పనిచేసే అబ్బాయి వచ్చి వాటి మీద టీ కప్పులు పెట్టాడు. వేణుగోపాల్‌ పక్కన స్టూల్‌ లేకపోవడంతో చేతికిచ్చి వెళ్లిపోయాడు. అది మన్మోహన్‌ గమనించారు. మరొకరైతే ఆ సహాయకుడిని పిలిచి వేణుగోపాల్‌ దగ్గర కూడా స్టూల్‌ వేయమని పురమాయించేవారు. కానీ మన్మోహన్‌సింగ్‌ తానే స్వయంగా లేచి అదే గదిలో మరో మూలనున్న ఇంకో స్టూల్‌ను తీసుకొచ్చి వేణుగోపాల్‌ పక్కన పెట్టారు. అది ఆయన నిరాడంబరతకు నిదర్శనం. మేమెవరం వెళ్లినా బయటి ద్వారం వద్దకు వచ్చి సాగనంపేవారు. పీవీ, మన్మోహన్‌ ఇద్దరూ మేధావులే.

* యువ వైద్యులకు మీరిచ్చే సందేశం?
నైపుణ్యం, విలువలు కలిసినప్పుడే నిజంగా వృత్తిని నిర్వహించినవారవుతారు. నిరంతరం నేర్చుకోవాలనే ఆసక్తి, తపన ఉండాలి.

- అయితరాజు రంగారావు, ఈనాడు, హైదరాబాద్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.