close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/07/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీజింగ్‌ మిత్రభేదం!

భారత్‌ నేపాల్‌ల మధ్య సరిహద్దు చిచ్చు

నేపాల్‌ రోజురోజుకూ భారత్‌కు దూరమవుతోంది. తనను అధికారం నుంచి కూలదోయడానికి ఇండియా ప్రయత్నిస్తోందని నేపాల్‌ ప్రధానమంత్రి కె.పి.ఓలి ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ సవరణ చేసి, ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ గఢ్‌ జిల్లాలో 400 చదరపు కిలోమీటర్ల భారతీయ భూభాగాన్ని నేపాల్‌లో అంతర్భాగంగా చూపే సరికొత్త పటాన్ని విడుదల చేసినప్పటి నుంచి భారత్‌ తనపై ఆగ్రహిస్తోందని ఓలి వాదిస్తున్నారు. అయితే, ఓలి భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని నేపాల్‌ పాలక కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ప్రధానమంత్రులు అయిన పుష్ప కుమార్‌ దహల్‌ (ప్రచండ), మాధవ్‌ కుమార్‌ నేపాల్‌, ఝల్‌ నాథ్‌ ఖానల్‌ నిలదీస్తున్నారు. వీరు పాలక కమ్యూనిస్టు పార్టీ స్థాయీసంఘ సభ్యులు కూడా. ఓలి భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు నమ్మకమైన ఆధారాలు చూపకపోతే ప్రధాని పదవితో పాటు కమ్యూనిస్టు పార్టీ సహాధ్యక్ష పదవికీ రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఓలి ముఖ్యమైన అంశాల్లో పార్టీ సీనియర్లను సంప్రదించకుండా అన్ని అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారని మాజీ ప్రధానులు- ముఖ్యంగా పార్టీ సహాధ్యక్షుడైన ప్రచండ మండిపడుతున్నారు. ఉదాహరణకు గత నెలలో నేపాల్‌, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య జరిగిన చర్చల విషయంలో మాధవ్‌ కుమార్‌ నేపాల్‌ను ఓలి విశ్వాసంలోకి తీసుకోలేదు. మాధవ్‌ కుమార్‌ మాజీ ప్రధానమంత్రే కాదు, పార్టీ విదేశాంగ వ్యవహరాల బాధ్యుడు కూడా. నిబంధనలకు విరుద్ధంగా- ఓలి పార్టీలో పాలనాపరమైన, ఆర్థికపరమైన విధులను స్వయంగానో, తన విధేయులతోనో నిర్వహిస్తున్నారని సీనియర్లు ఆగ్రహిస్తున్నారు. ఎంసీసీ కార్యక్రమం కింద అమెరికా నుంచి 50 కోట్ల డాలర్ల సహాయాన్ని తీసుకోవాలని ఓలి నిర్ణయించడంపైనా పార్టీలో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ప్రభుత్వ నిర్వహణలో, ముఖ్యంగా కొవిడ్‌ సంక్షోభ నియంత్రణలో, అవినీతి అదుపులో, అభివృద్ధి హామీలను నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారనే భావన ప్రజల్లో బలపడింది. దీనివల్ల కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి నేపాల్‌ ప్రజల్లో మద్దతు నానాటికీ క్షీణిస్తోంది.

పెరుగుతున్న భారత వ్యతిరేకత

సొంత పార్టీలో ఎదురవుతున్న వ్యతిరేకతను అధిగమించడానికి ఓలి ప్రతిపక్షాల నుంచి మద్దతు తీసుకుంటున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి దగ్గరవుతూ భారత వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. 2015లో నేపాల్‌కు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు, 2017 పార్లమెంటరీ ఎన్నికల్లోనూ, తాజాగా మ్యాపు సమస్యపైనా ఈ ఎత్తుగడలకు ఒడిగట్టారు. ఓలికి ప్రతిపక్ష నేపాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడైన షేర్‌ బహదూర్‌ దేవ్‌ బా లోపాయికారీ మద్దతు ఉందని భావిస్తున్నారు. భారత భూభాగాలను నేపాల్‌లో కలిపేసుకోవడం ద్వారా నేపాల్‌ ప్రజల దృష్టిలో హీరోగా చలామణీ కావాలని, సొంత పార్టీ లోపల, వెలుపల విమర్శకుల నోళ్లు మూయించాలని ఓలి చూస్తున్నారు. నేపాలీ జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా పబ్బం గడుపుకోవాలన్నది ఆయన ఆరాటం. నేపాల్‌ సమాజంలో వచ్చిన మూడు మార్పులు ఆయన్ను ఈ వ్యూహానికి పురిగొల్పాయి. మొదటిది- మెరుగైన జీవితం కోసం నేపాల్‌ యువతరంలో పెరిగిన ఆశలు, ఆకాంక్షలు. దేశ జనాభాలో 65 శాతానికి మించిన యువతీయువకులు అంతర్జాలం, సామాజిక మాధ్యమాల ద్వారా బయటి ప్రపంచ పరిణామాలను తెలుసుకొంటున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లడమూ బాహ్య ప్రపంచంతో సంపర్కం పెంచింది. ప్రజాస్వామ్య సమాజంలో విద్యార్హతలు, నైపుణ్యాలు సంతరించుకుని ఆత్మవిశ్వాసం నింపుకొన్నారు. వీరిని భారత్‌-నేపాల్‌ చిరకాల సాంస్కృతిక, నాగరికతాపరమైన సంబంధాలు ప్రభావితం చేయలేకపోతున్నాయి. రోటీ-బేటీ సంబంధాలనే పడికట్టు పదాలు వీరిని ఆకట్టుకోలేకపోతున్నాయి. భారతదేశంతో సంబంధాల వల్ల నేపాల్‌ ఆర్థికంగా అభివృద్ధి చెంది తమ జీవితాలు మెరుగుపడతాయా లేదా అన్నది మాత్రమే వారికి ముఖ్యం. కానీ, ఈ ఆశ నెరవేరలేదని నేపాల్‌ యువత భావిస్తోంది. ఇదే భారత్‌తో బంధాన్ని బలహీనపరచిన రెండో అంశం. భారతదేశం కొన్ని సంవత్సరాల నుంచి నేపాల్‌లో చెప్పుకోదగిన ప్రాజెక్టు ఏదీ చేపట్టలేదు. పైగా, తమ దేశ వ్యవహారాల్లో భారత్‌ తెరచాటు జోక్యం చేసుకొంటోందని, నేపాల్‌ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ, అహంకారపూరిత దౌత్యానికి పాల్పడుతోందని నేపాలీ యువతరం భావిస్తోంది. 2015 సెప్టెంబరులో నేపాల్‌ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో భారత్‌ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం, తరవాత అయిదు నెలలపాటు నేపాల్‌ను ఆర్థికంగా దిగ్బంధించడం నేపాలీ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. దీన్ని భారత్‌ అహంకారపూరిత వైఖరికి నిదర్శనంగా వారు భావించసాగారు.


పట్టు పెంచుకుంటున్న చైనా

భారతదేశంపై నేపాలీల్లో పెరుగుతున్న ప్రతికూల భావనలను సొమ్ము చేసుకోవడానికి చైనా గట్టిగా ప్రయత్నించడం మూడో అంశం. నేపాల్‌లో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం (బీఆర్‌ఐ) కింద మౌలిక వసతుల నిర్మాణానికి వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టడంతోపాటు, చైనా రేవులద్వారా నేపాలీ సరకుల ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. నేపాల్‌ పాలక కమ్యూనిస్టు ప్రముఖులతోపాటు, ఇతర పార్టీల నాయకులనూ ధనప్రలోభాలతో చైనా లోబరచుకుంది. ఓలిపై పార్టీలో వ్యతిరేకత పెరిగిన దరిమిలా నేపాల్‌లోని చైనా రాయబారి తరచూ కమ్యూనిస్టు నాయకులను కలుస్తూ సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారు. భారత్‌-చైనాల మధ్య లిపులేఖ్‌ను వాణిజ్య, సాంస్కృతిక రవాణా మార్గంగా గుర్తిస్తూ 1954, 2015 సంవత్సరాల్లో ఒప్పందం కుదిరిన దృష్ట్యా కాలాపానీ, మ్యాపుల వివాదంలో బీజింగ్‌ బహిరంగంగా నేపాల్‌ను సమర్థించజాలదు. అయితే, నేపాల్‌-భారత్‌ల జగడం తనకే లాభదాయకమని అది సంతోషిస్తోంది. భారత్‌కు నేపాల్‌ దూరమైతే అక్కడ చైనా వ్యూహాత్మకంగా పాగా వేస్తుంది. ఆ మేరకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.


పంథా మారాలి

దౌత్యపరమైన తప్పిదాల వల్ల సామాన్య నేపాలీ ప్రజలకు భారత్‌ దూరమైంది. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ పట్ల, ప్రధానమంత్రి ఓలి నాయకత్వం పట్ల భారత ప్రభుత్వం ప్రతికూల ధోరణి అనుసరించడం కూడా పెద్ద అపశ్రుతిగా నిలిచింది. ఇటీవలి కాలంలో మాత్రం నేపాల్‌ పట్ల భారత్‌ తన ధోరణి సడలించింది. అక్కడ పెండింగులో ఉన్న రోడ్డు, రైలు ప్రాజెక్టులను, చమురు పైపులైన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. అయినా, నేపాల్‌ కమ్యూనిస్టు ప్రభుత్వంలో కానీ, ఆ దేశంలో పెరుగుతున్న భారత వ్యతిరేక జాతీయవాదంలో కానీ ఎటువంటి మార్పూ రాలేదు. నేపాల్‌తో భారత్‌కు చిరకాలం నుంచి సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలు ఉన్నప్పటికీ- అక్కడ చైనా ప్రాబల్యం విస్తరించకుండా దిల్లీ అడ్డుకోవడం చాలా కష్టం. భారతదేశం వెంటనే నేపాల్‌ పట్ల తన పంథాను మార్చుకోవాలి. తన దౌత్యంలో ఇచ్చిపుచ్చుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. నేపాల్‌ అభిప్రాయాలను, అవసరాలను మన్నించాలి. చైనా వల్ల హిమాలయాల్లో ఇబ్బందులు కొనసాగకుండా చూసుకోవాలంటే భారత్‌ తక్షణం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

- ఎస్‌.డి.ముని

(రచయిత- భారత మాజీ రాయబారి, జేఎన్‌యూ గౌరవ ఆచార్యులు)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.