
తాజా వార్తలు
రేవ్ పార్టీనా? పుట్టినరోజు వేడుకా?
హోటల్‌పై పోలీసుల దాడి.. అదుపులో 8 మంది
హైదరాబాద్: రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. అయితే లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు జరిగినట్టుగా తెల్లారాక కేసు నమోదు చేయడం గమనార్హం. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడి ఓ ప్రముఖ హోటల్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో శనివారం రాత్రి పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి దాడులు చేశారు. అక్కడ ఓ గదిలో మద్యం తాగుతూ లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఒకేచోట పలువురు గుమిగూడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో సంతోష్‌రెడ్డి, భానుకిరణ్, విజయరామారావు, రఘువీర్‌రెడ్డి, ఉక్రెయిన్‌కు చెందిన ఓ యువతి, మరో ముగ్గురు పాతికేళ్లలోపు యువతులున్నారు. వారిని విచారించగా.. జన్మదినం సందర్భంగా హోటల్లో స్నేహితులతో కలిసి వేడుక నిర్వహించినట్లు వెల్లడించారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వివరించారు. యువతులను రెస్క్యూహోంకి తరలించారు.
నాలుగు నెలులుగా యువతి పేరుతోనే గది
నిందితుడు సంతోష్‌రెడ్డి గతంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లోని ఓ పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహించాడు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 32 మంది యువతులను తీసుకొచ్చాడు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంతోష్‌రెడ్డిపై నమోదైన కేసులను తరువాత మార్చడంతో బెయిలు దొరికింది. తాజా ఘటనలో పట్టుబడిన వారి సంఖ్య విషయంలో పోలీసులు ఒకరికొకరు సంబంధం లేని సంఖ్యలు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. కొంతమందిని కావాలని తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన ఆ మహిళ సంతోష్‌రెడ్డి వద్ద ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి ఆ గది ఆమె పేరు మీదే ఉంది. ముగ్గురు ఉండాల్సిన గదిలో 8 మంది ఉండటంపై హోటల్ నిర్వాహకులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుల్లో ఒకరు ప్రముఖ వ్యక్తి బంధువుగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి అల్లుడి జన్మదినం సందర్భంగా వారంతా హోటల్లో పార్టీ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే అది రేవ్ పార్టీనా? పుట్టినరోజు వేడుకా? అనేది తేలుతుంది.