
తాజా వార్తలు
రైతుల పోరాటానికి మద్దతుగా హైదరాబాద్‌లో ర్యాలీ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్‌లో ర్యాలీ ప్రారంభమైంది. అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని సరూర్‌నగర్ నుంచి ఉప్పల్ వరకు వాహనాలతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ర్యాలీలో వామపక్షాల నేతలు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద ముగియనుంది. వాహన ర్యాలీ సాగుతున్న మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తొలుత ఇందిరా పార్కు నుంచి పీపుల్స్‌ప్లాజా, నిజాం క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించాలని అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ భావించింది. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయంగా సరూర్ నగర్ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహించాలని నిర్వాహకులకు హైకోర్టు సూచించింది.
ఇవీ చదవండి..
ఉద్రిక్తతల నడుమ..కొనసాగుతోన్న ట్రాక్టర్ పరేడ్!