
తాజా వార్తలు
ఓ దిల్లీ.. నువ్వు వినాలి..
ఇంటర్నెట్ డెస్క్: అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎండనక, వాననక దిల్లీ శివార్లలో రైతన్నలు చేస్తున్న నిరసన నెలల తరబడి కొనసాగుతోంది. వీరి సత్యాగ్రహం పట్ల దేశమంతా సానుభూతి పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌కే చెందిన సిమ్రతా, రమ్నీక్ అనే యువతుల గీతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
మొహాలీలో నివసించే ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు రైతుల కష్టాలను దిల్లీ సర్కారుకు వివరిస్తూ ఓ గీతాన్ని విడుదల చేసారు. సంగీతంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్లయిన వీరు.. ఈ గీతాన్ని స్వయంగా రాసి, బాణీలను కట్టి పాడారు. వేలాది కర్షకులు ఆరుబయట కష్టపడుతుంటే.. తాము సౌకర్యవంతంగా ఉన్నామనే భావన తమను చాలా బాధించిందని.. వారి కోసం తమకు తెలిసిన విద్య ద్వారా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నామని ఈ యువతులు వివరించారు.
వర్షంలో, చలిలో కొనసాగే ఈ ఉద్యమంలో భాగం కావాలంటూ పలువురు పంజాబ్ మహిళలు తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారని సిమ్రతా, రమ్నీక్ తెలిపారు. రైతన్నలకు మరింత మద్దతు లభించేలా చేసేందుకు తమ వంతుగా ప్రయత్నించామని వారు అన్నారు. మరి వీరి ప్రయత్నం ఎలావుందో ఈ వీడియోలో మీరూ వినండి..