close
శ్రీలంకలో మారణహోమం 

215 మంది దుర్మరణం, 500 మందికి గాయాలు 
మృతుల్లో భారతీయులు సహా 33 మంది విదేశీయులు 
ఈస్టర్‌నాడు బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో రక్తపుటేర్లు 
8 చోట్ల విధ్వంసం సృష్టించిన ముష్కరులు 
నేషనల్‌ తౌవీత్‌ జమాత్‌ అనే ముస్లిం వేర్పాటువాద ముఠాపై అనుమానం 
కొలంబో

నరనరాన విద్వేషాగ్నిని 
నింపుకొన్న రాక్షసులు... శాంతి, 
దయ, కరుణలను ఏమాత్రం 
సహించలేని రక్తపిశాచులు 
మారణహోమం సృష్టించారు. శాంతిదూత పునరుత్థానమైన రోజున శ్రీలంకలో 
ప్రార్థనా మందిరాలు, హోటళ్లపై విరుచుకుపడి నిస్సహాయులను పొట్టనపెట్టుకున్నారు. 
నెత్తుటి మరకలు ఎప్పుడు.. ఎక్కడ 
ఆదివారం ఉదయం 8.45 గంటలకు 
కొలంబోలోని సెయింట్‌ ఆంటొనీస్‌ చర్చి 
నెగోంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చి, 
బట్టికలోవాలోని జియోన్‌ చర్చి 
కొలంబోలోని ద షాంగ్రిలా, ద సినమన్‌ గ్రాండ్‌, ద కింగ్స్‌బరీ హోటళ్లు 
మధ్యాహ్నం తర్వాత 
దెహీవాలా జంతుప్రదర్శనశాల సమీపంలో 
కొలంబో శివార్లలోని ఒరుగోదవట్టా 
విధ్వంసకాండ తీరు 
కొలంబో జంతుప్రదర్శన శాల సమీపంలో, ఒరుగోదవట్టాలో ఆత్మాహుతి దాడులు; సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో ఇదే తరహా దాడిగా అనుమానం. 
మిగతా చోట్ల బాంబు పేలుళ్లు

ఆటవిక చర్య

ది ‘‘దయాదాక్షిణ్యాల్లేని ఆటవిక చర్య’’. మనప్రాంతం, మొత్తం ప్రపంచానికి ఉగ్రవాదం వల్ల మానవత్వానికి ఎదురవుతున్న తీవ్రమైన సవాల్‌ను బాంబుపేలుళ్లు మరోసారి గుర్తు చేశాయి.  ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంకకు ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి భారత్‌ సంసిద్ధం. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్‌ విక్రమసింఘేలకు ఫోన్‌ చేశా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.

- ప్రధాని నరేంద్రమోదీ 

శాబ్దాల పాటు రక్తపుటేర్లు పారించిన భీతావహ అంతర్యుద్ధం ముగియడంతో శాంతి పవనాలను ఆస్వాదిస్తున్న శ్రీలంకలో మరోసారి ఉగ్ర అలజడి రేగింది. పదేళ్ల ప్రశాంతతకు తూట్లు పొడుస్తూ ఈ ద్వీప దేశంలో మళ్లీ నెత్తురు ఎగజిమ్మింది. పవిత్ర ఈస్టర్‌ ఆదివారం నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న చర్చిలతోపాటు ఐదు నక్షత్రాల హోటళ్లను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు వరుసబాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు దిగడంతో ఈ చిన్న దేశం చిగురుటాకులా కంపించింది. 8 చోట్ల జరిగిన ఈ నరమేధంలో 215 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 500 మంది గాయపడ్డారు. 33 మంది విదేశీయులు బలయ్యారు. 

ప్రార్థన స్థలాలు రక్తసిక్తం 
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.45 గంటలకు రాజధాని కొలంబోలోని సెయింట్‌ ఆంటొనీస్‌ చర్చి, రాజధాని శివార్లలోని నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చి, బట్టికలోవా పట్టణంలోని జియోన్‌ చర్చిలో తొలుత పేలుళ్లు జరిగాయి. ఆ సమయంలో అక్కడ ఈస్టర్‌ ఆదివార ప్రార్థనలతో భారీగా జన సందడి ఉంది. బాంబు విస్ఫోటాల తాకిడికి ప్రశాంత ప్రార్థనా మందిరాలు అట్టుడికిపోయాయి. బాధితుల ఆక్రందనలతో మారుమోగిపోయాయి. ఎటు చూసినా రక్తం, తెగిపడ్డ అవయవాలతో భీతావహ వాతావరణం నెలకొంది. 
వణికిన హోటళ్లు 
ఇదే సమయంలో కొలంబోలోని మూడు 5-స్టార్‌ హోటళ్లు ద షాంగ్రిలా, ద సినమన్‌ గ్రాండ్‌, ద కింగ్స్‌బరీలో బాంబులు పేలాయి. సినమన్‌ గ్రాండ్‌ హోటల్‌లోని రెస్టారెంట్‌ వద్ద ఒక ఆత్మాహుతి బాంబర్‌ తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో పెద్దసంఖ్యలో ప్రజలు బలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. ఈ హోటళ్లకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. బాంబు దాడిలో మృతి చెందిన విదేశీయుల్లో బ్రిటన్‌కు చెందిన ఐదుగురు, డెన్మార్క్‌కు చెందిన ముగ్గురు, చైనీయులు ఇద్దరు, టర్కీవాసులు ఇద్దరు, డచ్‌వాసి ఒకరు, పోర్చుగీసు వ్యక్తి ఒకరు ఉన్నారు. పొలండ్‌, జపాన్‌, పాకిస్థాన్‌, అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులూ మరణించినట్లు వార్తలు వచ్చాయి. 
జరిగిన పేలుళ్లు అన్నీ ఆత్మాహుతి దాడులని ఇప్పుడే ధ్రువీకరించలేమని పోలీసు అధికార ప్రతినిధి రువాన్‌ గుణశేఖర్‌ చెప్పారు. నెగొంబోలోని చర్చిలో జరిగిన పేలుడు ఆత్మాహుతి దాడిలా అనిపిస్తోందన్నారు. 

మరో రెండు చోట్ల.. 
ముష్కరుల మారణ కాండ ఇంతటితో ముగియలేదు. మధ్యాహ్నం మరోసారి విరుచుకుపడ్డారు. ఏడో పేలుడు రాజధాని శివార్లలోని దెహీవాలాలో ఉన్న జంతుప్రదర్శనశాల సమీపంలో జరిగింది. అక్కడ ఇద్దరు చనిపోయారు. ఎనిమిదో పేలుడు కొలంబోకు ఉత్తరాన శివార్లలో ఉన్న ఒరుగోదవట్టాలో జరిగింది. అక్కడ గాలింపుల్లో భాగంగా పోలీసు బృందం ఒక భవనంలోకి ప్రవేశించినప్పుడు మాటువేసిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో ఆ భవన కాంక్రీటు శకలాల కింద పడి ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద 8 పేలుళ్లలో 207 మంది చనిపోయారని పోలీసు ప్రతినిధి పేర్కొనగా, స్థానిక మీడియా మాత్రం 215 మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. గాయపడినవారిలో పలువురు భారతీయులు ఉన్నారు. 
భద్రత కట్టుదిట్టం 
ఎనిమిదవ పేలుడు జరగ్గానే ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. కొలంబోలోని మతపరమైన ప్రాంతాలన్నింటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. తాత్కాలికంగా సామాజిక మాధ్యమాలన్నింటినీ స్తంభింపచేసింది. బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా భద్రతా దళాలను మోహరించింది. పోలీసులు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య విభాగం అధికారుల సెలవులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. కొలంబో జిల్లాలో ఈస్టర్‌ ప్రార్థనలను రద్దు చేసినట్లు స్థానిక ఆర్చిబిషప్‌ కార్డినల్‌ మాల్కమ్‌ రంజిత్‌ చెప్పారు. ‘‘జంతువులు మాత్రమే ఇంత దారుణంగా వ్యవహరిస్తాయి. దీనిపై ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ చేపట్టాలి. బాధ్యులను ‘నిర్దయ’గా శిక్షించాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

శాంతియుతంగా ఉండండి: సిరిసేన 
ఈ విపత్కర సమయంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కోరారు. ఈ అనూహ్య ఘటనలతో తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. దీనిపై అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని భద్రతా దళాలను ఆదేశించినట్లు తెలిపారు. ఈ దాడులు పిరికిపంద చర్య అని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే చెప్పారు. పరిస్థితిని అదుపుచేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 
అవసరమైతే సంప్రదించండి.. 
శ్రీలంకలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కొలంబోలోని భారత హైకమిషన్‌ పేర్కొంది. ఇక్కడి భారత పౌరులకు ఎలాంటి సాయం, సమాచారం అవసరమైనా +94777903082, +94112422788, +94112422789, +94777902082, +94772234176 నంబర్లలో సంప్రదించాలని కోరింది.

మృతుల్లో ముగ్గురు భారతీయులు

మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారని విదేశీ వ్యవ హారాలమంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. వారిని లక్ష్మి, నారాయణ్‌ చంద్రశేఖర్‌, రమేశ్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. అయితే కేరళలోని కాసర్‌గడ్‌కు చెందిన రజీనా (58) అనే మహిళకూడా ఈ దాడుల్లో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఎవరిదీ ఘాతుకం? 

 ఘటనలకు సంబంధించి 13 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా ఒక్క ముఠా ఘాతుకమేనని ప్రభుత్వం అనుమానిస్తోంది.  ఈ దాడులు తమ పనేనని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద ముఠా కూడా ప్రకటించలేదు. గతంలో ఇలాంటి దాడులను వేర్పాటువాద ముఠా ఎల్టీటీఈ చేపట్టింది. దేశ ఉత్తర, తూర్పు ప్రావిన్స్‌లలో ప్రత్యేక తమిళ దేశం కావాలంటూ 30 ఏళ్ల పాటు సాయుధ పోరాటం చేసింది. అందులో 70-80వేల మంది వరకూ బలై ఉంటారని అంచనా. 2009లో ఎల్టీటీఈ అధిపతి వేలుపిళ్లై ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం హతమార్చడంతో ఆ ముఠా తుడిచిపెట్టుకుపోయింది. తాజా బాంబు పేలుళ్లకు సంబంధించి నేషనల్‌ తౌవీత్‌ జమాత్‌ (ఎన్‌టీజే) అనే ముఠాపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా గత ఏడాది ఈ అతివాద ముఠా వార్తల్లోకి ఎక్కింది.

ఉగ్రవాదులది పైశాచికం

ఈ ఘటన ఉగ్రవాదం పైశాచిక చర్యకు నిదర్శనం. మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.

- రాహుల్‌గాంధీ ట్వీట్‌

అత్యంత హేయం

బాంబు పేలుళ్ల ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

- సీఎం కేసీఆర్‌

మానవత్వానికే మాయని మచ్చ

శ్రీలంకలో జరిగిన  మారణహోమం మానవత్వానికే మాయని మచ్చ. పేలుళ్ల ఘటన నన్ను ఆవేదనకు గురి చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

- ఏపీ సీఎం చంద్రబాబు

ప్రపంచం అండగా నిలవాలి

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రపంచమంతా  శ్రీలంకవాసులకు అండగా నిలవాలి. మృతుల కుటుంబాలకు సంతాపం.

-తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.