close
లెక్క చెప్పని అభ్యర్థులకు నోటీసులు

అసెంబ్లీ ఎన్నికల ఖర్చుల  వివరాలివ్వని 52 మంది
మూడోసారి స్పందించని వారిపై అనర్హత వేటు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల వ్యయ వివరాలు అందజేయని అభ్యర్థులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో గడిచిన డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 1,821 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 1,702 మంది ఓటమి పాలయ్యారు. ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా అభ్యర్థులు వ్యయ వివరాలను అందించాలన్నది నిబంధన. గడువులోగా ఎన్నికల్లో ఎంత వ్యయం చేశారన్న వివరాలను ఎన్నికల సంఘం రూపొందించిన విధానంలో అందించాలి. లెక్కల వివరాలు ఇవ్వని వారికి మూడు దఫాలు నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ స్పందించని పక్షంలో ఆ అభ్యర్థులను ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు వేస్తుంది. తొలి విడతగా 77 మంది అభ్యర్థులకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. వారిలో ఇరవై మంది స్పందించి తమ వివరాలను అందచేశారు.

52 మందికి నోటీసు
ఇప్పటివరకు లెక్కలు చూపని 52 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. వీరిలో జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. దేవరకొండలో ఆరుగురు, నల్గొండలో అయిదుగురు, నాగార్జునసాగర్‌, మునుగోడు, ములుగు నియోజకవర్గాల్లో నలుగురు చొప్పున ఉన్నారు. మల్కాజిగిరి, మిర్యాలగూడల్లో ముగ్గురు చొప్పున, నకిరేకల్‌లో ఇద్దరు ఉన్నారు. జుక్కల్‌, రామగుండం, కరీంనగర్‌, నారాయణఖేడ్‌, గజ్వేల్‌, పరిగి, వికారాబాద్‌, మేడ్చల్‌, నారాయణపేట్‌, హుజూర్‌నగర్‌, ఆలేరు, డోర్నకల్‌, మహబూబాబాద్‌, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి చొప్పున లెక్కలు ఇవ్వని జాబితాలో ఉన్నారు. వచ్చే నెలలో మరోదఫా ఆయా అభ్యర్థులకు నోటీసుల జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించేందుకు జూన్‌ నెలాఖరు గడువుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.