close
అందరూ కదలాలి.. అడవులు పెరగాలి

 మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి
 క్షేత్రస్థాయి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం
ఈనాడు - సిద్దిపేట

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన కొత్తలో గజ్వేల్‌లోని అటవీ భూములు ఎడారిని తలపించేవి. ఎక్కడా చెట్లు కనిపించేవి కావు. ఇక్కడ అడవులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేశాం. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. వర్షపాతమూ పెరిగింది. 27 రకాల పండ్ల మొక్కలను ఇక్కడ పెంచాం. దీంతో ఇవి ప్రస్తుతం కోతులకు ఫుడ్‌కోర్టులుగా తయారవుతున్నాయి. ఇక్కడ చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఈ పనులకు శ్రీకారం చుట్టాలి.

-ముఖ్యమంత్రి కేసీఆర్‌

 

రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణే లక్ష్యంగా కదలాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. అడవుల్లో మొక్కలు నాటి సంరక్షించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండో రోజు క్షేత్రస్థాయి పర్యటనను చేపట్టారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 11.20 గంటలకు వీరంతా రెండు బస్సుల్లో సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలోని సింగాయిపల్లికి చేరుకున్నారు. అడవుల పునరుద్ధరణను అక్కడ విజయవంతంగా చేపట్టిన తీరును వారు పరిశీలించారు. అనంతరం గజ్వేల్‌ మీదుగా వెళుతూ కోమటిబండ సమీపంలో మొక్కలను సంరక్షిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. గజ్వేల్‌లోని ఈ ప్రాంతాల్లో అడవులను అభివృద్ధి చేసిన తీరును సీఎం కేసీఆర్‌ స్వయంగా కలెక్టర్లకు వివరించారు. కోమటిబండ వద్ద భోజనాలు చేసిన తర్వాత మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

ఏం చేశారో స్పష్టంగా వివరించారు
గజ్వేల్‌ అటవీ ప్రాంతంలో పునరుద్ధరణ చేపట్టిన తీరును అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్‌స్టాక్‌ను ఉపయోగించుకొని సహజమైన పద్ధతిలో చెట్లను పెంచుతున్న విధానాన్ని అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు. అడవి చుట్టూ కందకాలు తీయడం వల్ల రక్షణ ఏర్పడుతుందన్నారు. లోపలి జంతువులు బయటకు వెళ్లకుండా, బయట జంతువులు లోనికి రాకుండా కందకాలు ఉపయోగపడతాయని వారికి తెలిపారు. వీటిలో నీరు నిల్వ ఉండటం వల్ల మొక్కలకు కావాల్సిన తేమ అందుతుందన్నారు. కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లను నాటడంతో అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచుతుండటం వల్ల కోతులు గ్రామాలు, పట్టణాల నుంచి అడవులకు వాపస్‌ వస్తున్నాయన్నారు. కాలుష్య సమస్యకూ మొక్కల పెంపకం పరిష్కారం చూపుతుందన్నారు. అటవీ భూముల్లో మొక్కలు పెంచడానికి వీలుగా కాంపా నిధులూ అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా వారు కలెక్టర్లకు తెలిపారు.

వివిధ అంశాలపై చర్చ
గజ్వేల్‌ పట్టణ సమీపంలో ఉన్న కోమటిబండపై ఉన్న మిషన్‌ భగీరథ ట్యాంకులు, సంపులను పరిశీలించారు. భోజనవిరామం అనంతరం సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, కొత్త పురపాలక చట్టం అమలుపై చర్చించారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన తీరుపై మాట్లాడారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం వారికి వివరించారు. ఇందుకోసం 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని వారికి సూచించారు. అవినీతికి ఆస్కారం లేకుండా, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేలా పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వ రూపకల్పన చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమావేశాన్ని ముగించుకొని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి... అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.


జీవ వైవిధ్యానికి దోహదం

‘‘సామాజిక అడవుల పెంపకంతో ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అడవుల పెంపకంతో వాతావరణంలో మార్పు వస్తుంది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు జీవవైవిధ్యమూ పెంపొందుతుంది.  మన రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయి. ఇది మన భూభాగంలో 23.4శాతం. ఇంత భూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు మాత్రం లేవు. దీనిని పరిగణనలోకి తీసుకొని పచ్చదనాన్ని పెంచేలా చొరవ తీసుకోవాలి. తలచుకుంటే అసాధ్యమేమీ ఉండదు. అందుకు మిషన్‌ భగీరథ పథకమే నిదర్శనం’’.అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్లతో అన్నారు.


మంత్రి ఈటల..పరుగుపరుగునా!

కదులుతున్న బస్సును అందుకోవడానికి మంత్రి ఈటల పరుగులు పెడుతున్నట్లు అనిపిస్తోంది కదా ఈ చిత్రాన్ని చూస్తుంటే. సీఎం కేసీఆర్‌ బుధవారం జిల్లా కలెక్టర్లతో కలిసి సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం సింగాయిపల్లి అటవీ ప్రాంతానికి బస్సులో వెళ్లారు. ఈ కార్యక్రమానికి స్థానికులను అనుమతించలేదు. కొందరు స్థానిక ప్రతినిధులు వినతిపత్రాలను చూపుతూ రోడ్డుపక్కన నిలబడి ఉండటాన్ని గమనించిన సీఎం కేసీఆర్‌ మంత్రి ఈటలను పిలిచి వాటిని తీసుకురావాలని పురమాయించినట్లు కనిపించింది. వెంటనే ఈటల బస్సు దిగివచ్చి వినతిపత్రాలను స్వీకరించి ఇలా పరుగుపరుగున వెళ్లి బస్సెక్కారు.

- ఈనాడు, హైదరాబాద్‌

 


త్వరలో సీఎం జిల్లాల పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: ప్రగతిపనుల పరిశీలన కోసం త్వరలో తాను జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లకు వెల్లడించినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులతో, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తానని, ప్రాజెక్టులను సందర్శిస్తానని, హరితహారం, 60 రోజుల ప్రణాళికల అమలును తనిఖీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. అలాగే జనవరిలో మళ్లీ కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.