close

ప్రధానాంశాలు

శబరిమల కేసు విస్తృత ధర్మాసనానికి

మసీదుల్లో మహిళల ప్రవేశం, ఇతర అంశాలతో కలిపి విచారణ
  బెంచ్‌లో ఏడుగురు సభ్యులు
  సుప్రీంకోర్టు నిర్ణయం

అన్ని మతాల ప్రార్థన స్థలాల్లో మహిళల ప్రవేశం విషయంలో ‘సంపూర్ణ న్యాయం’ అందించడం కోసం న్యాయస్థానం ఒక ఉమ్మడి విధానాన్ని రూపొందించాల్సిన సమయం ఆసన్నమయింది. నిత్యం ఎదురయ్యే ఇలాంటి సమస్యలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. విస్తృత ధర్మాసనం ఏర్పాటయ్యే వరకు ఈ వ్యాజ్యాలన్నింటినీ పెండింగ్‌లో పెడుతున్నాం.

- భారత ప్రధాన న్యాయమూర్తి , జస్టిస్‌ రంజన్‌ గొగొయి

మెజార్టీ న్యాయమూర్తుల అభిప్రాయం

మతపరమైన ప్రాంతాల్లో మహిళలకు ఆంక్షలు ఉండడం ఒక్క శబరిమలలోనే కాకుండా ఇతర మతాల్లోనూ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలు అభిప్రాయపడ్డారు. అందువల్ల వీటన్నింటిపై సమీక్ష జరగాల్సి ఉందని తెలిపారు. ముగ్గురి తరఫున ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగొయి తొమ్మిది పేజీల తీర్పును రాయడంతో పాటు చదివి వినిపించారు. మతం, విశ్వాసాలపై చర్చ జరగాలని పిటిషన్‌దారులు ఆశిస్తున్నారని తెలిపారు.

దిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర  మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని గురువారం సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ సమస్యల్లో మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశం; పార్శీయేతరులను పెళ్లాడిన పార్శీ మహిళలు పవిత్ర అగ్ని ఉండే అగ్యారీకి వెళ్లకుండా నిరోధించడం; దావూదీ బోహ్రా వర్గాల్లో బాలికల జననాంగాలను కత్తిరించడం వంటివి ఉన్నాయి. శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వ్యాజ్యాలను విచారించిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రధాన న్యాయమూర్తి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు.

శబరిమలలో మహిళల ప్రవేశంపై ఏం చెప్పింది?

శబరిమల ఆలయంలో 10-50 ఏళ్ల వయసు ఉన్న మహిళలపై నిషేధాన్ని విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తొలుత విచారించిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో మహిళలు ఆలయంలోకి వెళ్లవచ్చంటూ 2018 సెప్టెంబరు 28న తీర్పు ఇచ్చింది. దీనిని సమీక్షించాలని కోరుతూ 65 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇందులో 56 సమీక్ష వ్యాజ్యాలు, నాలుగు కొత్త రిట్‌ పిటిషన్లు, అయిదు బదిలీ వ్యాజ్యాలు ఉన్నాయి. వీటిని తాజాగా అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. మతపరమైన సమస్యల విచారణకు విస్తృత ధర్మాసనం ఏర్పాటు కానున్న దృష్ట్యా ఈ వ్యాజ్యాలను పెండింగ్‌లో ఉంచాలని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం గతంలో ఇచ్చిన ఆదేశాల్లో ఎటువంటి మార్పులు చేయకూడదని, శబరి ఆలయంలోకి వెళ్లేందుకు మహిళలకు అనుమతి ఇవ్వాలని అసమ్మతి తీర్పు ఇచ్చారు. అయితే మెజార్టీ న్యాయమూర్తులు వ్యాజ్యాలను పెండింగ్‌లో పెట్టాలని తీర్పు ఇచ్చినందున అదే అమల్లోకి రానుంది.

అసమ్మతి తీర్పు

ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లు అసమ్మతి తీర్పు ఇచ్చారు. ఇరువురి తరఫున జస్టిస్‌ నారిమన్‌ తీర్పు రాశారు. గతంలో ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలని పేర్కొన్నారు. శబరిమల అంశంపై ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ వాజ్యాలు వచ్చినందున ధర్మాసనం కూడా వాటికే పరిమితం కావాలని, ఇతర విషయాలను అందులో కలపకూడదని అభిప్రాయపడ్డారు. సమీక్ష వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్టు తెలిపారు. తాజా తీర్పును అనుసరించి ప్రస్తుతం మహిళలు ఆలయంలోకి వెళ్లవచ్చా? లేదా? అన్నదానిపై ఎలాంటి స్పష్టతా లేదు.

శాంతిభద్రతలు కాపాడాలి: రవిశంకర్‌ ప్రసాద్‌

సుప్రీంకోర్టు నేపథ్యంలో కేరళలో శాంతిభద్రతలు కాపాడడానికి కృషి చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును బలవంతంగా అమలు చేయవద్దంటూ భాజపా గత కొంతకాలంగా కేరళ ప్రభుత్వాన్ని డిమాండు చేస్తుండడం గమనార్హం.

‘భక్తుల మనోభావలను కోర్టు గుర్తించింది’

ఈ తీర్పుపై పందళ రాజవంశీయుడు, పిటిషన్‌దారుల్లో ఒకరు అయిన శశికుమార్‌ వర్మ స్పందిస్తూ భక్తుల మనోభావాలను కోర్టు గుర్తించిందని చెప్పారు. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అప్పటి వరకు ప్రవేశం కల్పించాలి: తృప్తి దేశాయ్‌

విస్తృత ధర్మాసనం తీర్పు వచ్చే వరకు మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలని పుణెకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ కోరారు. ఆమె గత ఏడాది నవంబరులో ఆలయంలోకి వెళ్లడానికి విఫలయత్నం చేయడం గమనార్హం.

న్యాయమూర్తుల ముందుకు 7 ప్రశ్నలు

* 1. మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న రాజ్యాంగంలోని 25, 26 అధికరణాల మధ్య ఉన్న పరస్పర సంబంధాలకు భాష్యం చెప్పాలి. 25వ అధికరణం ప్రకారం ఎవరికైనా తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది. 26వ అధికరణం ప్రకారం ఏ మతానికైనా తమ వ్యవహారాలను నిర్వహించుకొనే స్వేచ్ఛ ఉంది. ఈ రెండు హక్కుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? 14వ అధికరణం ప్రకారం అందరికీ సమానత్వ హక్కు ఉంది. వీటిన్నింటి మధ్య సమన్వయం సాధించడం ఎలా?
* 2. రాజ్యాంగంలోని 25(1) అధికరణం ప్రకారం ‘శాంతిభద్రతలు, నైతికత, ఆరోగ్యానికి’ లోబడి ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు. దీనిని ఏ విధంగా నిర్వచించాలి?
* 3. ‘నైతికత’, ‘రాజ్యాంగ నైతికత’పై రాజ్యాంగంలో సరయిన నిర్వచనం లేదు. దీనిపై వివరణ ఇవ్వాలి.
* 4. ఏ మతానికి చెందిన ఆచారాలపైన అయినా ఆరా తీసే అధికారం కోర్టులకు ఎంతవరకు ఉంది? అది మతం, మత వ్యవహారాల్లో అంతర్భాగమా? కాదా? అని ఎంతవరకు నిర్ణయించవచ్చు. ఆచారాలను ఆయా మతాల అధిపతులకే విడచిపెట్టాలా?
* 5. 25(2)(బి) అధికరణం ప్రకారం హిందూ మతంలోని వివిధ వర్గాలకు అర్థం చెప్పడం ఎలా?
* 6. ఆ వర్గాలు పాటించే ఆచారాలకు 26వ అధికరణం ప్రకారం రక్షణ ఉందా?. ఇవి ‘తప్పనిసరి మత ఆచారాలు’ అన్న నిర్వచనం కిందికి వస్తాయా?
*7. ఒక మతానికి/వర్గానికి చెందిన ఆచార వ్యవహారాలపై వేరే మతం/వర్గానికి చెందిన వారు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడాన్ని ఎంతవరకు అనుమతించవచ్చు?

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.