close

ప్రధానాంశాలు

స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరి

ఎన్‌కౌంటర్లపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవీ..

‘తీర్పు చెప్పిన తూటా’ న్యాయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దిశపై అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమవడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు ఇది సరైన న్యాయం కాదన్న వాదనలూ అంతేస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ ఎన్‌కౌంటర్లపై జాతీయ మానవహక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)తో పాటు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటన్నది ఆసక్తికరం.


ఎన్‌హెచ్‌ఆర్‌సీ మార్గదర్శకాలు...

బూటకపు ఎన్‌కౌంటర్లపై ప్రజల నుంచి విపరీతంగా ఫిర్యాదులు అందడంతో 1997 మార్చిలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జస్టిస్‌ వెంకటాచలయ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖరాస్తూ.. ఎన్‌కౌంటర్ల విషయంలో పాటించాల్సిన విధివిధానాలను నొక్కిచెప్పారు. ఆ తర్వాత ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొన్ని మార్గదర్శకాలను విడుదలచేస్తూ.. వాటిని పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
* పోలీసులు, ఇతర వ్యక్తులకు మధ్య కాల్పులు జరిగి, మరణం సంభవిస్తే.. ఆ సమాచారాన్ని సంబంధిత పోలీసుస్టేషన్‌లో తగురీతిలో నమోదుచేయాలి.
* మరణానికి దారితీసిన పరిస్థితులు, కారకుల్ని తెలుసుకోవడానికి వెంటనే నిష్పాక్షిక, స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి.
* ఒకవేళ అదే పోలీసుస్టేషన్‌ సిబ్బందే ఎన్‌కౌంటర్‌కు కారకులైనట్లయితే.. దర్యాప్తు బాధ్యతను సీఐడీలాంటి మరో స్వతంత్ర సంస్థకు అప్పగించాలి.
* పోలీసులు నేరం చేసినట్లు పక్కాగా ఫిర్యాదు అందితే.. సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలి.
* అన్ని ఎన్‌కౌంటర్‌ మరణాలపైనా సాధ్యమైనంత త్వరగా వీలైతే మూణ్నెల్ల లోపే మెజిస్టీరియల్‌ విచారణ జరిపించాలి.
* పోలీసు చర్య వల్ల ఎవరైనా చనిపోతే సంబంధిత ఎస్పీలు 48 గంటల్లోపు ఆ సమాచారాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తెలపాలి.
* ఆ తర్వాత మూడునెలల్లోపు శవ పంచనామా, పోస్ట్‌మార్టం, మెజిస్టీరియల్‌ విచారణ నివేదికలను జతచేస్తూ కమిషన్‌కు రెండో నివేదిక పంపాలి.


సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవీ...

* ఎన్‌కౌంటర్ల   విషయంలో, దర్యాప్తులో పాటించాల్సిన విధివిధానాలపై 2014 సెప్టెంబరు 23వ తేదీన సుప్రీంకోర్టు విస్తృత ఆదేశాలిచ్చింది.
* ఘోరమైన నేరాలకు పాల్పడే వారి కదలికలపై నిఘా సమాచారం ఉన్నప్పుడు పోలీసులు వెంటనే దాన్ని కేసు డైరీ లేదా, ఎలక్ట్రానిక్‌ రూపంలో రికార్డు చేయాలి.
* ఎన్‌కౌంటర్‌ మరణాలపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలి.
* నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌, డైరీ ఎంట్రీ, పంచనామా నివేదిక, ఇతర సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా కోర్టుకు సమర్పించాలి.
* ఎన్‌కౌంటర్‌ సమాచారాన్ని జాతీయ, రాష్ట్ర హక్కుల కమిషన్‌లకు తెలియజేయాలి.
* స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరగలేదని అనుమానాలు తలెత్తినపుడు మాత్రమే ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం అవసరం.
* రాష్ట్రాల్లో జరిగే అన్ని రకాల ఎన్‌కౌంటర్లపై ఆర్నెళ్లకు ఒకసారి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు నివేదిక పంపాలి.
* ఎన్‌కౌంటర్‌పై మెజిస్టీరియల్‌ దర్యాప్తు జరపాలి. ఆ నివేదికను సంబంధిత జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌కు పంపాలి.
* ఘటనపై సీఐడీ, లేదా మరో పోలీసుస్టేషన్‌ సిబ్బందిచేత నిష్పాక్షిక, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి.
* పోస్ట్‌మార్టంను వీడియో తీయాలి.
* పోలీసుల తప్పుంటే చర్యలు తీసుకోవాలి.
* వేగంగా అభియోగపత్రం నమోదు.
* ఎన్‌కౌంటర్‌ జరగ్గానే పోలీసులకు రివార్డులు ఇవ్వడం సరికాదు. ఘటనపై అన్ని అనుమానాలూ నివృత్తి అయ్యాకే రివార్డుల విషయాన్ని పరిశీలించాలి.
* అన్ని ఎన్‌కౌంటర్‌ కేసుల్లోనూ పై నిబంధనల్ని తప్పక పాటించాల్సిందే.

- ఈనాడు ప్రత్యేక విభాగం

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.