close

ప్రధానాంశాలు

అట్టుడికిన పశ్చిమ బెంగాల్‌

  కొనసాగిన ‘పౌర’ నిరసనలు
  రైళ్లు, బస్సులకు నిప్పు
 దిల్లీలో ప్రదర్శనలు

దిల్లీ, కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శనివారం వివిధ రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌ అట్టుడికిపోతోంది. అసోంలోని సోనిత్‌పుర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఒక చమురు ట్యాంకరుకు దుండగులు నిప్పంటించి, డ్రైవరును హతమార్చారు. దీంతో ఆ రాష్ట్రంలో ఆందోళనల్లో మృతి చెందినవారి సంఖ్య మూడుకు చేరింది. అంతర్జాలంపై నిషేధాన్ని సోమవారం వరకు పొడిగించారు. ఎగువనున్న ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను గువాహటిలోనే నిలిపివేసి, అక్కడి నుంచి వెనక్కి పంపిస్తున్నారు. ఈ నెల 18న విధులకు హాజరుకారాదని అసోంలో ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించారు.

ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం...
పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌, ఉత్తర 24 పరగణాల జిల్లాలు, గ్రామీణ హావ్‌డాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయిదు రైళ్లకు, మూడు రైల్వే స్టేషన్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పట్టాలపై ఆందోళనకారులు బైఠాయించడంతో కొన్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. టికెట్‌ కౌంటర్లు, సిగ్నల్‌ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. 78 రైళ్లను ఆగ్నేయ రైల్వే రద్దు చేసింది. 25 బస్సుల్ని, కొన్ని టోల్‌ప్లాజాలను నిరసనకారులు కాల్చివేశారు. అనేక ఆస్తుల్ని ధ్వంసం చేశారు. మరికొన్నింటిని కొల్లగొట్టారు. జాతీయ రహదారులపై రాకపోకల్ని అడ్డగించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఘటనలపై గవర్నర్‌ జగ్‌దీప్‌ ధంకడ్‌ విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు తాను చేయాల్సిందంతా చేస్తానని చెప్పారు. పరిస్థితుల్ని ముఖ్యమంత్రి అదుపు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కోరుతామని భాజపా హెచ్చరించింది.
* దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ప్రదర్శనలో వివిధ వర్గాలవారు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా జన్‌పథ్‌ మెట్రో స్టేషన్‌ని మూసివేశారు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (దిల్లీ) వచ్చేనెల 5 వరకు తరగతుల్ని, పరీక్షల్ని రద్దు చేసింది.
* నాగాలాండ్‌లో విద్యాసంస్థలు, మార్కెట్లు మూతబడ్డాయి.
* మేఘాలయాలో నిరవధిక కర్ఫ్యూను పాక్షికంగా సడలించినప్పుడు నిత్యావసరాల కోసం ప్రజలు బారులు తీరారు.
* బిహార్‌లో ఈ నెల 21న బంద్‌ పాటించాలని ఆర్జేడీ పిలుపునిచ్చింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.