close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఒకే పరీక్ష?

పరీక్ష విధానంలో మార్పులు చేసే యోచన !
కరోనా పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు
జేఏబీ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి పంజా విసురుతున్నా ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఏదో విధంగా జరపాలని భావిస్తున్న ఐఐటీలు.. రెండు పరీక్షలకు బదులు ఒకే పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నాయి. కరోనా కారణంగా భౌతిక దూరం పాటించాల్సి ఉండటంతో విద్యార్థులు రోజంతా ఒకే చోట ఉండకుండా సమయాన్ని కుదించే దిశగా చర్యలు చేపట్టాయి. ఇప్పటికే అడ్వాన్స్‌డ్‌ పరీక్షను రెండు సార్లు వాయిదా వేసిన కేంద్రం.. వచ్చే సెప్టెంబరు 27న పరీక్ష జరపాలని నిర్ణయించింది. ఈక్రమంలో విద్యార్థులపై కొంత ఒత్తిడి తగ్గించాలని భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) సమావేశాన్ని ఈనెల 17వ తేదీన ఏర్పాటు చేసింది. అందులో అన్ని ఐఐటీల సంచాలకులతోపాటు కేంద్ర మానవ వనరుల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ‘పరీక్ష విధానం మార్చడం, సిలబస్‌ తగ్గించడం, బోర్డు మార్కుల్లో 75 శాతం నిబంధనను మినహాయించడం తదితర ఆంశాలు తెరపైకి వస్తున్నాయి. వాటిపై చర్చించి జేఏబీ సమావేశంలో కేంద్రం నిర్ణయం ప్రకటిస్తుంది’ అని ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహిస్తున్న ఐఐటీ దిల్లీ సంచాలకుడు ఆచార్య రాంగోపాల్‌రావు తెలిపారు.
చర్చించే అంశాలివే..
అడ్వాన్స్‌డ్‌లో రెండు ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరో ఆన్‌లైన్‌ పరీక్ష జరుపుతారు. ఒక్కో పరీక్ష సమయం 3 గంటలు. రెండు ప్రశ్నపత్రాల స్థాయిలో పెద్ద మార్పు ఉండదు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులను ఒకే గదిలో ఉంచడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఒకే పరీక్ష నిర్వహించాలన్న అంశం తెరపైకి వచ్చింది.
* సిలబస్‌ తగ్గింపును కూడా చర్చిస్తారు. అయితే ఇప్పటికే జేఈఈ మెయిన్‌-1ను విద్యార్థులు రాశారు. విద్యార్థులు మొత్తం సిలబస్‌ను చదివి ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు తగ్గించడం వల్ల విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఉండదని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ తగ్గించినా సెప్టెంబరులో జరిగే మెయిన్‌ -2 పరీక్షలోనూ మార్పు చేయాలి. అప్పుడు మెయిన్‌-1కు ఒక సిలబస్‌, మెయిన్‌-2కు మరో సిలబస్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈ సిలబస్‌ తగ్గించినందున వచ్చే ఏడాది జరిగే అడ్వాన్స్‌డ్‌లో తీసుకోవాల్సిన మార్పులపై కూడా చర్చ జరగనుంది.
* సెప్టెంబరులో పరీక్షలు జరిపే పరిస్థితి లేకుంటే ప్రత్యామ్నాయ మార్గం, ప్రవేశాలు, విద్యా క్యాలెండరు తదితర వాటిపై కూడా
సమావేశంలో చర్చించనున్నారు.


75 శాతం ఇంటర్‌ మార్కుల నిబంధన ఎత్తివేత!
ఈ ఏడాది ఐఐటీల్లో చేరేందుకు మినహాయింపు ఇచ్చే అవకాశం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఇంటర్‌, అందుకు సమానమైన పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను ఈ ఏడాదికి ఎత్తివేయాలని జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) భావిస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొదటి ర్యాంకు సాధించినా ఇంటర్‌లో 75 శాతం మార్కులు లేదా బోర్డు పరీక్షల్లో మొదటి 20 పర్సంటైల్‌లో లేకుంటే ప్రవేశం పొందటం ఇప్పటివరకు కుదరదు. ఈసారి కరోనా పరిస్థితుల కారణంగా ఆ నిబంధనను మినహాయించాలని జేఏబీ ఆలోచిస్తోంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌ సిద్ధార్థ్‌పాండే ‘ఈనాడు’తో చెప్పారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకున్నా పెద్దగా ప్రభావం ఉండదని, అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించి ఐఐటీల్లో సీట్లు పొందిన వారిలో 75 శాతం మార్కులు పొందని వారు చాలా తక్కువ మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సెప్టెంబరు 27న జరపాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.