
ప్రధానాంశాలు
కరోనాతో పోరాడుతూ మృతి
దిల్లీ: కాంగ్రెస్ మరో సీనియర్ నేతను కరోనా కాటేసింది. ఆ పార్టీ వ్యూహకర్త, సంక్షోభ పరిష్కర్త, సోనియాగాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్(71) కరోనాతో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున 3.30 గంటలకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఆయన మృతి చెందారు. అక్టోబర్‌లో అహ్మద్ పటేల్‌కు కొవిడ్-19 సోకింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. శరీరంలో వివిధ అవయవాలు విఫలమవ్వడంతో అహ్మద్ పటేల్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. అహ్మద్ పటేల్ భౌతిక కాయాన్ని భరూచ్ జిల్లాలోని అంకాలేశ్వర్ ఆసుపత్రిలో ఉంచారు. గురువారం ఉదయం ఆయన స్వగ్రామం పిరమన్కు తరలిస్తారు. అంత్యక్రియలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు.
కింగ్ మేకర్‌గా గుర్తింపు
గాంధీ కుటుంబం తర్వాత కాంగ్రెస్‌లో అత్యంత బలమైన నేత అహ్మద్ పటేల్. మూడు సార్లు లోక్‌సభకు, ఐదు సార్లు రాజ్యసభకు ఎంపికైన ఈ గుజరాత్ నాయకుడు ప్రచారానికి దూరంగా, తెర వెనుక రాజకీయం నడపడంలో సిద్ధహస్తుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో కింగ్ మేకర్‌గానే పేరు పొందారు.
నాడు రాజీవ్‌కు.. నేడు సోనియాకు
26 ఏళ్ల వయసులో 1977లో గుజరాత్‌లోని భరూచ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన అహ్మద్ పటేల్.. ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, వివిధ పదవుల్లో నాలుగు దశాబ్దాలకుపైగా పార్టీకి సేవలందించారు. రాజీవ్ గాంధీ ప్రధాని పీఠం ఎక్కిన తొలినాళ్లలో ఆయనకు పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. రాజీవ్ చనిపోయిన తర్వాత కష్టకాలంలో సోనియాకు అండగా నిలిచారు. 2001లో ఆమెÅ రాజకీయ సలహాదారుడిగా నియమితులయ్యారు. అప్పటినుంచి పార్టీకి అన్నీ తానై తెరవెనుక వ్యూహాలు రచించారు. ఎన్నో సంక్షోభాల్లో అధినాయకురాలికి అండగా నిలిచారు. నమ్మిన బంటుగా వ్యవహరించారు.
సంక్షోభం ఎక్కడుంటే తానక్కడ
పార్టీలో ఎక్కడ సమస్య తలెత్తినా ముందు ప్రత్యక్షమయ్యేది అహ్మద్ పటేలే. రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో, మహారాష్ట్రలో శివసేనతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక కీలక భూమిక పోషించారు. అధిష్ఠానంపై విమర్శలు గుప్పిస్తూ, ఆగస్టులో 23 మంది సీనియర్ నేతలు లేఖ రాసినపుడు కూడా సోనియాగాంధీకి అండగా నిలిచి.. ఆ వివాదం మరింత జటిలం కాకుండా నివారించారు.
ఆయన లోటు తీర్చలేనిది: సోనియా
ఓ నమ్మకస్థుడైన సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయాను అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. చురుకైన మేధాశక్తి అహ్మద్ పటేల్ సొంతమని ప్రధాని మోదీ కొనియాడారు. అహ్మద్ తనయుడు ఫైసల్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పటేల్ మృతికి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమ్రంతి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘ఆ రహస్యాలు నాతో సమాధి కావాల్సిందే’
దిల్లీ: కాంగ్రెస్‌లో అహ్మద్ పటేల్‌కు తెలియని విషయం ఉండదంటారు విశ్లేషకులు. పార్టీలో, ప్రభుత్వంలో జరిగే అంతర్గత విషయాలు, రాజకీయ నేతల రహస్యాలు ఆయనకు తెలుసు. అయితే ఎప్పుడూ వాటిని ఆయన బయటపెట్టాలనుకోలేదు. నా చావుతోనే ఆ రహస్యాలు సమాధి అవుతాయి అని రచయిత రషీద్ కిద్వాయ్కు తెలిపారు. ‘‘మీ రాజకీయ జీవితంలో జరిగిన సంఘటనలు పుస్తకరూపంలో తేవచ్చుగా అని పటేల్‌ను అడిగాను. ‘నాతో పాటు రహస్యాలు కూడా సమాధి కావాల్సిందే’ అని సమాధానమిచ్చారు’’ అని కిద్వాయ్ తెలిపారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- కల లాంటిది.. నిజమైనది
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి