ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలే నిర్వహించాలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలే నిర్వహించాలి

యాంటీజెన్‌ను 40 శాతానికి పరిమితం చేయండి
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు

ఈనాడు- హైదరాబాద్‌: కొవిడ్‌ నిర్ధారణ కోసం ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలనే ఎక్కువగా నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఐసీఎంఆర్‌ రాష్ట్రాలను ఆదేశించాయి. మొత్తం పరీక్షల్లో ఆర్‌టీపీసీఆర్‌ 60 శాతం, యాంటీజెన్‌ 40 శాతం వరకూ ఉండేలా చర్యలు చేపట్టాలన్నాయి. యాంటీజెన్‌ పరీక్షలను ఎక్కువగా నిర్వహిస్తుండడం వల్ల పూర్తిస్థాయిలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులను గుర్తించలేకపోతున్నామనీ, తద్వారా వైరస్‌ వ్యాప్తికి దారితీస్తోందని ఆందోళన వెలిబుచ్చాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కొవిడ్‌ 19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ప్రధానంగా ఇదే విషయంపై చర్చించారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో అనుసరించాల్సిన విధానాలపై ఈ సందర్భంగా పలు మార్గదర్శకాలను జారీచేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, ఐసీఎంఆర్‌ కార్యదర్శి బలరాం భార్గవ సంయుక్తంగా అన్ని రాష్ట్రాలకూ లేఖ రాశారు.
90 శాతం యాంటీజెన్‌ పరీక్షలే
రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు సుమారు 50వేలకు పైగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇందులో 90 శాతానికి పైగా యాంటీజెన్‌ పరీక్షలే చేస్తున్నారు. 1076 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కేంద్రాలు నెలకొల్పగా, ప్రభుత్వ వైద్యంలో 18 ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌లున్నాయి. ప్రైవేటులో 56 ల్యాబోరేటరీలకు అనుమతులున్నాయి. రోజుకు సుమారు 10వేల వరకూ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం రోజుకు 3-4 వేలు మించడం లేదు. ఇందులోనూ ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేసే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలే అత్యధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. లక్షణాలుండి యాంటీజెన్‌లో నెగిటివ్‌గా తేలినవారికి ఆర్‌టీపీసీఆర్‌ చేయాలని నిబంధనలు చెబుతున్నా ఆ దిశగానూ ఎక్కువ పరీక్షలు చేయడం లేదు. వైరస్‌ ఉందనే అనుమానితులు సత్వర పరీక్షలకు మొగ్గుచూపుతున్నారే తప్ప.. ఫలితాలకు ఒకట్రెండు రోజులు సమయం పట్టే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల్లోనూ ఈ రెండు పరీక్షల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి. రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు మార్చుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశాయి.


మార్గదర్శకాలు..

* కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆర్‌టీపీసీఆర్‌కు.. ర్యాపిడ్‌ యాంటీజెన్‌కు మధ్యగణనీయమైన వ్యత్యాసముంది.
* దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ యాంటీజెన్‌ పరీక్షల్లో కంటే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌ శాతం ఎక్కువగా నమోదవుతున్నట్లుగా తేలింది.
* యాంటీజెన్‌ కిట్లను ప్రమాణాల ప్రకారం వినియోగించకపోవడం, కొన్ని కిట్లు వైరస్‌ను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోవడం తదితర కారణాల వల్ల కచ్చితమైన ఫలితాలు వెల్లడవడం లేదు.
* యాంటీజెన్‌ పరీక్షలను లక్షణాలు బయటపడడానికి ముందు దశలో లేదా లక్షణాలు వెలుగు చూసిన తొలిరోజుల్లో నిర్వహించాలి. ఎందుకంటే ఈ సమయంలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
* లక్షణాలు కనిపించిన 5-7 రోజుల తర్వాత యాంటీజెన్‌ పరీక్షలతో ప్రయోజనం లేదు.
* లక్షణాలున్న వారికి ర్యాపిడ్‌ టెస్టుల్లో నెగిటివ్‌ వస్తే.. తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలి. ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి.
* యాంటీజెన్‌ కిట్ల నాణ్యత ప్రమాణాలను పరీక్షించే విధానాన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.

ఇవీ చదవండి
అమెరికా ఊపిరి పీల్చుకో

కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టొద్దు
 Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు